మర్యాద- యామిజాల జగదీశ్
 ఓ అతిథి....మిత్రుడిగానో లేక శత్రువుగానో ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించడం కనీసపాటి మర్యాద. వారికి నవ్వుతూ ఆహ్వానించి మాట్లాడటం సంస్కారం. వేదంలో ఉన్న మాట కూడా ఇదే. ఓ శత్రువు ఇంట ఉన్నామనే ఆలోచనే రాని విధంగా ఇంటికొచ్చిన అతనిని చూడటం అవసరం.
శ్రీకృష్ణుడు అర్జునుడితోనూ భీముడితోనూ కలిసి మగధ రాజైన జరాసంధుడి వద్దకు వెళ్ళారు. వారు తనకు శత్రువులైనప్పటికీ సాదరంగా ఆహ్వానించాడు జరాసంధుడు.
భీముడు జరాసంధుడితో యుద్ధం చేయవలసి ఉన్న తరుణం. అయినప్పటికీ జరాసంధుడు సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు.
రాత్రి పూట వారు మిత్రుల్లా అతిథులలా ఒక్కటిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అలవాటు. కానీ పగలేమో చావో రేవో అన్నట్లుగా వారు తలపడ్డారు.
 ఇంటికొచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించడం ఓ సంస్కారం. ఒకరు బద్ధశత్రువైనా సరే కటిక బీదవాడైనా సరే కనీసం ఓ ఆసనంమీద కూర్చోపెట్టి తాగడానికి మంచినీరివ్వడం, వినయంతో మాట్లాడటం వంటివి ముఖ్యం. ఇది ప్రతి ఒక్కరికీ అవశ్యం.

కామెంట్‌లు