ఆయన సేవ అపారం;-- యామిజాల జగదీశ్
 తమిళనాడులోని పుదుక్కోట్టయ్ జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నింట్లోనూ ఆయన సెల్ ఫోన్ నెంబర్ ఉంచారు.
అందుకు కారణం...
ఇప్పటి వరకూ అయిదు వేలకుపైగా శవాలను తన కారులో ఎక్కించుకోవడం...
ఆరోగ్యం బాగులేక సీరియస్ గా ఉన్నవారిని, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారినీ తన కారులో తీసుకుపోయి ఆస్పత్రికి తరలించడం...!!
దాదాపు రెండు వేల మందికిపైగా గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తీసుకుపోయి వారి ప్రసవానికి తన వంతు సాయం చేయారు.
నలభై నాలుగు సంవత్సరాలుగా తన సొంత కారులో ఒక్క పైసాకూడా తీసుకోకుండా అయిదు వేలకు పైగా శవాలను ఆస్పత్రుల నుంచి వారి వారి ఇళ్ళకు తరలించడంలో తోడ్పడ్డారు.
వందల ప్రసవాలకు ఉచితంగా సహాయసహకారాలు అందించారు. ఇలా తన ఊళ్ళో ఎందరికో సాయపడుతున్న ఈయన స్వస్థలం పుదుక్కోట్టయ్ జిల్లాలోని ఆలంకుడి. ఆయన పేరు గణేశన్.
పేదలకు సాయం చేయడమే తన లక్ష్యంగా చేసుకున్న ఈయనను "515" గణేశన్ అని పిలుస్తుంటారు. ఆయన వయస్సు 62 ఏళ్ళు.
కుటుంబ పరిస్థితుల కారణంగా ఎనిమిదో తరగతి తర్వాత చదువుకోలేకపోయిన ఈయన పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తూ వస్తున్నారు. 
ఓమారు తమ ఊళ్ళో ఓ కుటుంబానికి చెందిన వారు ఓ తోపుడు బండిమీద తమ బంధువు శవాన్ని తీసుకుపోతుండటాన్ని చూసినప్పుడు ఆయన మనసు బాధపడింది.
ఊళ్ళో రెండు అద్దె కార్లు ఉన్నా వారు శవాలను తమ వాహనాలలో తరలించడానికి పూనుకోరు. దీంతో ఆయన ఓ నిర్ణయానికొచ్చారు. ఇనుప వ్యాపారం నుంచి సంపాదించి కూడబెట్టుకున్న పదిహేడు వేల రూపాయలతో నలభై నాలుగేళ్ళ క్రితం ఓ కారు కొనుక్కుని "515" అనే నెంబర్ రిజిస్టర్ చేయించారు.
అత్యవసర చికిత్స కోసం తల్లడిల్లుతున్న వారికి మాత్రమే ఆ కారుని  ఉపయోగించాలని, అటువంటి వారి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా కారు నడపాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తీసుకుపోవడం, ఆస్పత్రుల నుంచి శవాలను ఇళ్ళకు తరలించడం చేస్తూ వస్తున్న ఆయనే శ్మశాన వాటికలో గోతులు కూడా తవ్వి అంత్యక్రియలకు తోడ్పడుతున్నారు. ఆయన ఎవరినీ డబ్బులు అడగరు. కొందరు వారంతట వారే డబ్బులిస్తారు. అంతేతప్ప తానుగా ఇప్పటివరకూ ఎవరినీ డబ్బులడగలేదన్నారు.
ఓసారైతే ఆయన చెన్నై నుంచి ఓ శవాన్ని తీసుకురావడానికి బయలుదేరారు. ఒక్కసారి మాత్రం ఆలంకుడి నుంచి కారుకి పెట్రోల్ ఖర్చు మాత్రం పెట్టుకోమని అడగక తప్పలేదు. తీరా ఆయనను రమ్మన్న మహిళ దగ్గర డబ్బులు లేవు. మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసిచ్చి దానిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని పెట్రోల్ వేయించుకోమన్నారట. అప్పుడాయన మనస్సు ఎంతో బాధపడింది. పెట్రోల్ కోసం ఆమె తాళిబొట్టుని తాకట్టు పెట్టాలా అనుకుని ఆయనే ఎవరి దగ్గరో అప్పు తీసుకుని పెట్రోల్ పోయించుకుని శవాన్ని సొంత ఊరుకి తరలించారు. 
శవాన్ని తరలించడానికి సకల వసతులతో ఇప్పుడు ఆంబులన్స్ వాహనాలున్నా ఆయన కారుకి పని ఉంటూనే ఉంది. కానీ ఇప్పుడు ప్రసవ సాయం కోసం వచ్చే వారు తక్కువయ్యారని ఆయన చెప్పారు.
ఆయనకంటూ ఒక్క అంగుళం భూమి కూడా లేదు. ఇప్పటికీ పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తున్నారు. అందులో వచ్చే డబ్బులతోనే కారుకేదన్నా రిపేర్ చేయవలసి వస్తే చేయిస్తుంటారు.
ఆయనకు అయిదుగురు కుమార్తెలు. వారిలో నలుగురికి పెళ్ళిళ్ళు చేశారు. 
పేదప్రజలకు సేవ చేస్తుండటం మహద్భాగ్యంగా భావిస్తున్న ఆయన ఇందువల్ల ఎంతో తృప్తిగా ఉందంటుంటారు.
జీవితాంతం పేదలకు తన వంతు సాయం చేయాలన్నదే తన ఆశ ఆని ఆయనన్నారు

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Great deed God blesshim