సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 మనము... మానము
 ******
నేను, నాది అనే మాట స్వార్థాన్ని సూచిస్తుంది.  నీకు నీవే , నాకు నేనే అనే స్వార్థ చింతన కాకుండా మనము అనే మాటలో హృదయ వైశాల్యం కనిపిస్తుంది.
మనము మంచిదైతే మనసున్న వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందగలం.
రూపురేఖా విలాసాలు ఎలా ఉన్నా మనము అనేది మనిషి వ్యక్తిత్వాన్ని  స్పష్టంగా చూపే అద్దం లాంటిది.
వ్యావహారికంలో ఉపయోగించే మనము అనే పదానికి, నిఘంటువులో మనము అనే పదానికి చాలా అర్థ భేదాలు ఉన్నాయి.
 
మనము అనే పదానికి ఏయే అర్థాలు ఉన్నాయో చూద్దాం.
మనస్సు, అంతఃకరణము, అంతరంగము,ఆత్మ,ఎద, ఎడద,ఆస్వాంతము,గుట్టుపట్టు, హృదయము,హృది, చిత్తము,చేతనము,డెందము,మానసము,మది, సత్వము,స్వాంతము మొదలైన అర్థాలు ఉన్నాయి.
మనము మానవీయ విలువల మానమును కలిగి ఉండాలి.అలాంటి మనమే సమాజంలో మానమును పొందగలదు.
మానము అత్యంత విలువైన ధనము లాంటిది.పురాణేతిహాసాలలో ఎందరో మానధనము కలిగిన వారి గురించి విన్నాం.చదువుకున్నాం.
మరి మానము అంటే ఏయే అర్థాలు,నానార్థాలు ఉన్నాయో చూద్దాం.
 గౌరవము,అభిగ్రహము,ఉగ్గుడు,గరువము, గోము,తేకువ,మన్నన,మన్నిక, పరువు, పెద్దఱికము, ప్రతిష్ట, పురస్కారము, మర్యాద,సత్కర్మము, సత్కారము, సన్మానముతో పాటు ప్రణయ కోపము,నెయ్యపు పలుకు,నెయ్యపు గినుక, పొలయలుక,మానక్రోధము, కొలమానము, పరిమాణము,విమానము,విధము,అందము, పద్ధతి, భావము, రకము, వైఖరి,విధానము, సమయము,తరుణము,అదను,అవసరము,వేళ,వైళము, సందర్భము, కాలము లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
సమాజములో  మంచి మనముతో కలిసిమెలిసి ఉందాం.మానమును వీడకుండా అభిమానమును పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు