బాల్యాన్ని చిదిమేస్తున్న క్యాన్సర్ మహమ్మారి ;--:సి.హెచ్.ప్రతాప్
 మన దేశంలో చాప కింద నీరులా కేన్సర్ భూతం విస్తరిస్తుండడం ఆందోళనకర పరిణామం. ఈ విషయంలో భారత ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకప్పుడు గొప్పింట్లో కనిపించే ‘కేన్సర్’ భూతం, ఇప్పుడు పేద ధనిక, పట్టన, గ్రామీణ ప్రాంతాలనే బేధం లేకుండా బాల్యాన్ని కూడా మింగేస్తోంది. లుకేమియా, మెదడు కేన్సర్, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూ మర్ వంటి కేన్సర్లు చిన్నారులను నులిపెడుతున్నాయి. బలహీన ఆరోగ్య వ్యవస్థ కలిగిన తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే బాల్య కేన్సర్ల భారం అధికంగా ఉంది. మన దేశంలో మొత్తం కేన్సర్ కేసుల్లో 1.6 నుంచి 4.8 శాతం వరకు పదిహేనేళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లల్లో కనిపిస్తోంది.
క్యాన్సర్ అంటువ్యాధి అనేది అంటువ్యాధి కాదు. ఒక వ్యక్తి నుండి మరొకరికి పాకే అవకాశం లేదు. కీమోథెరపీ , రేడియేషన్ థెరపీని ద్వారా పిల్లలు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షియస్ డిజార్డర్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మజీవులు శరీరంలో చేరటానికి ఎక్కువ అవకాశం ఉంది. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు వారి తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయన్న అపోహాలు చాలా మందిలో నెలకొని ఉన్నాయి. అయితే అన్ని రకాల క్యాన్సర్లు కణాలలో జన్యుపరమైన పొరపాట్ల వల్ల సంభవిస్తున్నప్పటికీ, దీనికి తల్లిదండ్రులే కారణం ఏమాత్రం కాదు. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం, పీడియాట్రిక్ క్యాన్సర్‌లలో కేవలం 2% మాత్రమే వారసత్వంగా సంక్రమిస్తున్నాయి. పిల్లలలో వచ్చే క్యాన్సర్‌లలో ఎక్కువ భాగం యాదృచ్ఛిక ఉత్పరివర్తనాల వల్ల వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఏడాదిలోపు పిల్లల్లో తలెత్తే కేన్సర్లలో ‘న్యూరోబ్లాస్టోమా’ముఖ్యంగా కనిపిస్తోంది. నాలుగేళ్లలోపు పిల్లల్లో లుకేమియా సాధారణంకాగా, 9- 16 ఏళ్ల పిల్లల్లో బోన్ కేన్సర్లు అధికంగా ఉంటున్నాయి. ప్రతి ఏటా సుమారు 75 వేల మంది పిల్లలు కేన్సర్‌కు గురవుతున్నట్లు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ తెలిపింది. సరైన అవగాహన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ద్వారా కేన్సర్ సమస్యని అధిగమించవచ్చని అయితే ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మన దేశంలో  కేన్సర్ బాధితుల్లో ఐదు శాతం పిల్లలే ఉంటున్నారు. వీరిలో 100 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. చెడు అలవాట్ల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా పిల్లలు కేన్సర్ బారినపడటం దురదృష్టం. పుట్టుకతోనే జన్యువుల పని తీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అయితే సరైన సమయంలో గుర్తించగలిగితే పిల్లల్లో తలెత్తే కేన్సర్లనీ దాదాపుగా నయం చేయవచ్చు. పెద్దవారిలో 60 65 శాతం మందిలో కేన్సర్ తగ్గితే, పిల్లల్లో 85 90 శాతం మందిలో పూర్తిగా నయం చేయవచ్చు. ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. వ్యాధి ముదిరాక గుర్తించినా ఫలితం అంతగా ఉండదు.
ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ బారినపడిన చిన్నారుల్లో 60 శాతం మంది సకాలంలో వ్యాధి గుర్తించక, వైద్యం అందక మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది..పేదరికం కారణంగా అల్ప, మధ్య ఆదాయ వర్గాలలో కేన్సర్ బాధిత చిన్నారులకు అవసరమైన మందులు, ఆహారం అందుబాటులో ఉండటం లేదు. దీంతో కేన్సర్ సోకిన అత్యధిక మంది పిల్లలు ఐదేళ్ళకు మించి బతక్కపోవడానికి, కేన్సర్‌ను సకాలంలో గుర్తించకపోవడం, వైద్యం ఖర్చు భరించలేనంతగా ఉండడం, మధ్యలోనే చికిత్స ఆగిపోవడం వంటి కారణాలు చిన్నారుల పాలిట శాపంగా మారాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, ప్రజల్లో చైతన్యం పెరిగినా నేటికీ చాలా మంది రోగ నిర్థారణకు ముందుకు రావడం లేదు. యుక్త వయస్సుతో పాటు చిన్నారుల్లో వచ్చే కేన్సర్ ప్రమాదకరం కాగా, 50 శాతం జన్యు సంబంధంగా వస్తే, మరో 20 శాతం అలవాట్ల కారణంగా సంభవిస్తున్నాయి. నాలుగు తరాల కిందటి వారిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నా, ఆ తర్వాత పిల్లలకు కేన్సర్ సోకే ప్రమాదముంది. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందిచడానికి సాధ్యమవుతుంది.
కేన్సర్ బారిన పడిన చిన్నారుల్లో 3వ వంతు అసంపూర్ణ చికిత్స కారణంగా బతికే అవకాశాన్ని కోల్పోతున్నారు. దిగువ, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో 30 శాతం మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు. మరింత పేదరికంలో ఉన్న దేశాల్లో 99 శాతం మంది చికిత్స చేయించకపోవడం, లేదంటే చికిత్సను మధ్యలోనే నిలిపి వేయడం జరుగుతోంది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు ఎప్పటికీ సాధారణ జీవితాలను గడిపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారిలో తాము భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నామన్న భావన కలగకుండా ఆరోగ్యకరంగా వారి జీవనశైలి కొనసాగించేలా, లక్ష్యాలవైపు ముందడుగు వేసేలా ప్రోత్సహించాలి. ఇదిలా వుంటే బాల్యంలో క్యాన్సర్ నుండి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల సంతానోత్పత్తిపై ప్రభావం చూపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సాధారణ పునరుత్పత్తి కలిగివుండవచ్చు.
బిడ్డ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత కూడా దీర్ఘకాలిక వైద్య సంరక్షణ చాలా అవసరం. శరీర వ్యవస్థలో చిన్న మార్పు కనిపించినా నిపుణులను కలవాలి. కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న పిల్లలకు గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ, ఎదుగుదలలోనూ లోపాలు ఉండవచ్చు. పెద్దయిన తర్వాత సంతానలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ఒకరకమైన క్యాన్సర్‌ తగ్గినా, మరోరకమైన క్యాన్సర్‌ దాడిచేసే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకటే దారి. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, సమర్థమైన చికిత్స అందించడం, కోలుకున్న తర్వాత కూడా తగిన సంరక్షణ అందించడం.. పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం, మంచి జీవనశైలిని పరిచయం చేయడం.. తల్లిదండ్రుల బాధ్యత.  

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం