కాశీపతి మాజీ గద్వాల ఆస్ధాన కవి;-..డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు
 సీస మాలిక:---
"పలనాటి గడ్డపై పాండిత్యపటిమతో
      వెలుగొందెనొక్కడు విశ్వమందు
పద్యమొక్కటి యందు భావాలు ముప్పది
       కూర్చి వ్రాయుట మరి గొప్ప గాదె
అక్షరములు పది "యరలవశషసహ
         ళఱ" లతో కావ్యము వ్రాసి చూపె
అచ్చతెలుగు కావ్యమల్లెనందు నిరోష్ట్య
       నిర్వచనములతో నేర్పు మీర
త్ర్యర్ధికావ్యమొకటి వ్రాసెను ప్రతిభతో
    పండితాళి తలలు పట్టుకొనగ
అరచేతి ఉసిరిక అవధానమన్నచో
   పెదవి విప్పిన పద్య విరులు పూయు
అక్షరాస్యత లేని యడవి దరి పురిలో
   పుంభావ  వాణిగ పుట్టినారు
అమరకోశాదుల అవపోసనముపట్టె
     గోపాలకుండయి కొండదరిని
కారణ జన్ముండు కాశీపతి యనుట
   అక్షర సత్యమీ అవనియందు
విశ్వ కర్మజుడు దివిలో వెలుగు చుండె
పుట్టడిట్టి ఘనుడికపై పుడమి పైన
వారి చరితను రేపటి వారి కొరకు
భద్రపరచుట మనవంతు బాధ్యతౌను."
           ... డాక్టర్ బెజ్జంకి. మాచర్ల
         "పుట్ట డిట్టి ఘనుడికపై పుడమి లోన" అన్నమాట నిజం.ఎందరో మహావధానులు ఉన్నారు కాని "కవిసింహ కాశీపతి"వలే సాహిత్యంతో సాముగరిడీలాడిన వారు లేరు ఒక పద్యానికి ముప్పది అర్ధాలు చేప్పిన ఏకైక వ్యక్తి అపర పుంభావ సరస్వతి కాశీపతి గారే. ముప్పది మంది దేవతలను ఒకే పద్యంలో కీర్తించారు.
"ఆ.వె.భూరి జఠర గురుడు నీర జాంబక భూతి
          మహితకరుడహీన మణికలాపు
          డలఘ సద్గుణేశు డగ్రగోపుడు మహా
          మర్త్య సింహుడేలు మనల నెపుడు.
   పదాలు అటూ ఇటూ ఇరగదీసి  
 ఆ పద్యానికి టీక తాత్పర్యం రాసి కాశీపతి గారు ప్రచురించారు.  "మహామహోపాధ్యాయ"శతాధిక గ్రంధకర్త "రాష్ట్రపతి సన్మానగ్రహిత పెదపాటి నాగేశ్వరరావు గారు ఆంగ్లములోకి అనువాదంచేచారు. 
కాశీపతి గారు 17 వ యేట రాసిన "ధూర్జటి శతకము"
గూడా 2015 లో నేను తాత్పర్యము సమకూర్చగా వెలుగు చూసింది.ఏమాప్రతిభ ఏమామేధాశక్తి కేవలం పది అక్షరాలు "య,ర‌,ల,వ,ళ,శ,ష,స,హ,ఱ." ఈ అక్షరాల తోనే వేరేఅక్షరం రాకుండా "శౌరి శైశవ లీల" అనే ఏకాశ్వాస పద్యకావ్యం రాశారు.
"నిరోష్ట్య నిర్వచన శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానం"
రాశారు. ఇందులో ఓష్ట్యములు లేకుండా అంటే"ప,ఫ,బ,భ,మ"లు లేకుండా, వచనం లేకుండా, సంస్కృత పదాలు లేకుండా, ఆంధ్రశబ్దాలతో హరిశ్చంద్రోపాఖ్యానం రాశారు,
       "సిద్దయోగిచరిత్ర" ఈగ్రంధమును సనాతన సాహిత్య పరిషత్ వ్యవస్ధాపకులు బాణాల మల్లికార్జున రావు గారు వ్యాఖ్యనంతో ఫునర్ముద్రణ చేయబోతున్నారు.
           సమస్యాపూరణలు చూద్దాం.
సమస్య:--"కన్నులలో చన్నులమరె కాంతామణికిన్.
"చెన్నలర బెస్త చేడియ
  క్రన్నన వల వల్లెవాటుగాగొని వేడ్కన్
  మున్నీటికి జనునెడ వల
  కన్నులలో చన్నులమరె కాంతామణికిన్"
మరో దత్త పది.భీష్ణ,ద్రోణ,కృప,శల్య . నాలుగు పదాలు  రామాయణార్ధంలో పూరించిలి. పేర్లు భారతం లోవి కానీ రామాయణ కధ రావాలలి.
పూరణ గమనించండి.
"మారుతి భీష్మముగను లక్ష్మణుడు మూర్చ
 పొందెనిక ద్రోణగిరి కేగి తొందరగను
 కృపదలిర్పగ సంజీవి నెసగదెచ్చి
 యిడగదే నీదు కౌశల్య మిపుడు జూతు "
అని తెలివిగా పూరించారు
      ఇంతటి మేధాసంపన్నుడు ఎక్కడో మారుమూల వెనుక బడిన పల్నాడు లో వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జన్నించారు.ఏనాడో తెలుసా
నందన నామ సంవత్సరం మాఘశుద్ధ దశమి అనగా సరియగు ఆంగ్ల తేది ప్రకారం 27.01.1893. తేదీన.
ఇంట్లో ఆరుగురు సంతానంలో  చివరివాడు  కాశీపతి.అక్కలు ముగ్గురు అన్నలు,
కాశీపతి ని బడిమానించి ఆవులకు పంపారు. ఆవులు కాస్తూనే ఆంధ్రనామ సంగ్రహం,అమరకోశం కంఠోపాటం చేశారు. భారతభాగవతాలు పఠించారు. మూడోతరగతి వరకు చదువు ఉంది ఇంకా చదవాలని కాశీపతి కోరిక. ఇంట్లో చెప్పకుండా దాదాపు ఇరమై మైళ్ళదూరంలో ఉన్న "రెంటచింతల" గ్రామం వెళ్ళి క్రైస్తవ పాఠశాలలోఆరో తరగతి పూర్తి చేశారు. ఏడోతరగతిలో ఉండగా తల్లిదండ్రులకు తెలిసింది. వెళ్ళి తీసుకొని వచ్చి.ఆవులు కాయబెట్టినారు.
భరద్వాజ గోత్రులు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు అయిన పోకూరి సుబ్బయాచారి రామ లక్ష్వమ్మ దంపతులకు జన్నించారు.  "నూనూగు మీసాల నూత్నయవ్వనంలోనే అష్టావధానం చేశారు.పండితుల ప్రశంసలు అందుకున్నారు.1893 లో జన్మించిన కాశీపతి 1910 నాటికి "ధూర్జటి శతకం"రాశారు.
అలా అలా ఎదిగి ." గద్వాల సంస్ధానం ఆస్ధాన పండితుడై పేరెన్నికగన్నారు. కాలికి గండపెండెరం తొడిగించుకున్నారు.గజారోహణం చేయించుకున్నారు.సంస్ధానాలు విశ్వవిద్యాలయాలు ఘనంగా సత్కాకరించాయి.నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సన్మానించారు కాశీపతి రాసిన "సిద్దయోగిచరిత్ర"లోని ఒక ఆశ్వాసం ఆం.వి.విద్యాలయం బి.ఏ. విద్యార్థులకు పాఠ్యాంశంగా 1974 లో పెట్టారు.
వారి రచనలు:-1.సారంగధరీయం.2.శౌరిశైశవలీల 3 సిద్ధయోగిచరిత్ర.4 హరిశ్చంద్రోపాఖ్యానం.5.ధూర్జటి శతకం మొలైనవి 60 దాకా రాశారు.
బిరుదులు:--కొన్ని,
1.కవిసింహ.2.కవిశిరోమణి.3.కవిశిఖామణి.4.కళాపరిపూర్ణ. 5మహాకవిశేఖరమొదలైన బిరుదులెన్నో వరించాయి.
   సన్మానాలు
1950 పొద్దుటూరులో గండపెండెరం,గజాహణం
1960 రాయచూర్ లో సువర్ణ కంకణం,
1962 ఢిల్లీలో రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారచే సన్మానం.
1966 కర్నూలు జిల్లా హాలాహర్వి లో  కనకాభిషేకం 
1968 సిద్ధిపేట పురవీధుల్లో బ్రహ్మరధం పట్టారు
        ఈ విధంగా గద్వాలలో మరెన్నోచోట్ల సన్మానాలు పొందారు.
        పల్నాటి సీమలో పేరెన్నికగన్న సత్రశాల పుణ్యక్షేత్రం చేరుటకు సరైన రహదారి లేనందున పుర ప్రముఖులతో కలసి ఆనాటి మాచర్ల తహసీల్దార్ గారికి సహకరించి రహదారి నిర్మాణమునకు కృషి చేశారు.
     
    
     
       
చిక్కరాజు జగన్మోహనరావు గారు. కాశీపతి గారికి ఇంటి స్ధలం కు పట్టా ఇచ్చి గౌరవించారు.
 వారి రచనలపై కొందరు యుఫిల్ ,పిహెచ్.డి .
    గార్లపాటి గురుబ్రహ్మాచార్యులుగారు "శ్రీ పోకూరి కాశీపతి సాహిత్య పీఠం "స్ధాపించారు .కల్లూరి వేంకటేశ్వర రావు గారిచే పిహెచ్.డి, చేయించారు. వారి గ్రంధాలను పునర్ముద్రణ చేయిస్తున్నారు.
   సాహితీప్రియులను శోకసముద్రములో ముంచి 1974 డిసెంబర్ 27 వ తేదీన దివికేగినారు.జనవరి 27 న జననం కాగా, డిసెంబర్ 27 న మరణం ఇదొక విశేషం.వారి వివరాలు నేను నా "పలనాటి కవుల చరిత్ర లో "రాయటం జరిగింది.
అంతే గాదు వారు స్ధాపించిన "నాగార్జున సాహితీ సమాఖ్య"అందులో యస్ కె.బి.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు వి.వి.యల్ నరసింహారావు గారు,పాలపర్తి వేణుగోపాలరావు వంటి ప్రముఖులు సభ్యులుగా కార్యక్రమాలు పలనాటిలో సాహితీ పరిమళాలను వ్యాపింపజేశారు,అనంతరం నేను కార్యదర్శిగా 1994 నుండి 2002 వరకూ సమాఖ్య కార్యక్రమాలు కొనసాగించే భాగ్యం దక్కింది.
       మాచర్ల పట్టణం నడిబొడ్డులో ను మండాది రోడ్డులో ఉన్న వారి సమాధి వద్దను ఒక విగ్రహం "ప్రముఖ దేశభక్తి పరులు చిత్రలేఖనోపాధ్యాయులు శిల్పి గురజాల వేంకయ్య గారు సిమెంట్ విగ్రహం ఉచితం గా చెసి ఇవ్వగా ప్రతిష్టించారు.వారు రాసిన రెండు శతకాలు1,ధూర్జటి శతకం,2,నరసింహ నిరసనస్తుతి తాత్పర్యం వ్రాసే భాగ్యం నాకు దక్కింది. ఆ మహనీయుని 48వ వర్ధంతి నేడు. వారి ఆత్మశాంతికి అక్షరాంజలులిడుచున్నాను.వారి జయంతి వర్ధంతి సభలు గద్వాల ,హైదరాబాద్, మాచర్ల పట్టణాలలో జరుగుచున్నవి.జోహార్ కాశీపతి. జోహార్ .
 ...డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు
           పల్నాటి సాహిత్య పీఠం అధ్యక్షులు
            మాచర్ల పల్నాడు జిల్లా. ఆం.ప్ర
             చరవాణి:-98485 62726.


కామెంట్‌లు