సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఘృణి...హృణి
   ******
వ్యక్తి తన తెలివితేటలతో సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్నా, అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలన్నా, హృదయాలను ఆకట్టుకోవాలనుకున్నా   ఘృణిలా  ప్రకాశించాలి.
 సౌజన్యం, సౌభ్రాతృత్వం సమానత్వం గుణాలతో తనదైన ముద్రతో సాగిపోవాలి.అప్పుడే తనదైన శైలిలో ప్రత్యేకమైన ఉనికిని చాటుకోగలడు.ఘృణిలా ఇలలో భాసిల్లగలడు. 
ఘృణి అంటే ఏమిటో చూద్దాం...ఘృణి అంటే కిరణము,అంశువు, వర్చస్సు,కాంతి,విభ,శోచిస్సు,ఓజ, వెలుగు,రోచిస్సు,ద్యుతి,భానువు,భాసము,ఘృష్టి లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
 ఏ వ్యక్తి అయినా తనలోని మంచితనం మానవతా విలువలతో,సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడే పనులు చేస్తేనే ఘృణిలా ఎదుటి వారి గుండెల్లో నిలిచిపోగలడు.
అనవసరమైన హృణితో రగిలిపోవడం, ఇతరుల అభివృద్ధి చూసి అసూయ పడటం, తనలోని భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకుండా ఊరికే హృణితో విరుచుకుపడే వారిని ఎవ్వరూ ఇష్టపడరు.
తనలోని హృణి తనకే కాదు, చుట్టు పక్కల వారికి కూడా ఇబ్బందిని కలిగిస్తుంది.
ఇంతకూ హృణి అంటే ఏమిటో చూద్దాం...కోపము,అంచలము,అతిఘము,నెగులు, అసూయ, ఆగ్రహము,ఉద్రేకము,క్లేశము,ఖష్పము, రోషము, క్రోధము శఠము లాంటి అర్థాలు ఉన్నాయి.
ఓ పద్య కవి "తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష "  అన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.
హృణిని వదిలేసి శాంతము, సహృదయంతో  మెలగాలి.అప్పుడే ఘృణిలా  వెలుగులీనుతూ అందరి మన్ననలను పొందగలం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు