కామేశ్వరిగారితో కాస్సేపు;-- యామిజాల జగదీశ్
 చలంగారి నుంచి ఉత్తరాలు వచ్చిందంటే ఆ రోజంతా పండగే. అఫ్ కోర్స్ నాకు చలంగారి నుంచి వచ్చిన ఉత్తరాలు ఓ అయిదో ఆరో. అవి కూడా పోస్టు కార్డులే. నిజానికి వాటన్నింటినీ కలిపితే ఓ ఇన్లాండ్ లెటర్ కూడా నిండదు. అయితేనేం నా ఆనందం నాది. నేను ఉత్తరం రాస్తే ఆయన వెంటనే జవాబిచ్చారు. అయిదారు వుత్తరాలూ అం

తే, నేను రాసిన వాటికి ప్రత్యుత్తరాలవి. కానీ ఆవిడకలా కాదు, చలంగారే మొదటిసారిగా ఓ ఉత్తరం రాశారు. ఆయన నుంచి అందుకున్న ఆవిడ ఓ డాక్టర్. పేరు వెంపటి (పిల్లలమర్రి) కామేశ్వరి. ఆ ఉత్తరం వయస్సు అరవై ఆరేళ్ళు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బోలెడన్ని ఉత్తరాలు సాగాయి. అవి చలం నాన్న ఉత్తరాలు అనే శీర్షికతో పుస్తకరూపంలో వచ్చాయి. ఆవిడను కలవాలని కొన్ని నెలలుగా అనుకుంటున్న కోరిక డిసెంబర్ 27వ తేదీన (2022) న నెరవేరింది. 
డిసెంబర్ 24న తొంభయ్యో వసంతంలోకి భవ్యంగా అడుగు పెట్టిన మూడు రోజులకు నేను ఆవిడను దర్శించుకుని ఓ గంటపైనే గడిపాను. అమెరికాలో ఉంటున్న వాళ్ళబ్బాయి శ్రీ (శ్రీనాథ్ శర్మ) కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. శ్రీ సైంటిస్ట్. ఈయన కూడా నాలాగా చిన్నతనంలో తిరువణ్ణామలైలో చలంగారింటికి వచ్చిన వారే. కామేశ్వరిగారితో మాట్లాడినంత సేపూ చలంగారు, షౌగారి ముచ్చట్లే. అలాగే  అప్పట్లో ఆవిడ మద్రాసులో ఉండటం వల్ల జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రిగారతో తమకున్న బంధాలను గుర్తు చేసుకున్నారు. మల్లాదివారిని బాబాయ్ అని పిలిచేవారు. వారింటికి ఆవిడ, వాళ్ళాయన శర్మగారు తరచూ వెళ్తుండేవారు. ఓమారు మల్లాదివారు ఆవిడ ఇంట్లో భోంచేసిన విషయాన్నికూడా చెప్పుకొచ్చారు. 
చలంగారి నుంచి ఆవిడకు ఉత్తరం రావడంలో జలసూత్రంగారి పాత్ర ఉండటం గమనార్హం.  ఆ రోజుల్లో మద్రాసులో ఉన్న తెలుగువారిలో చాలా మందికి చలంగారరిని పరిచయం చేసింది జలసూత్రంగారే. ఈయన పేరడీ శాస్త్రిగా ప్రసిద్ధులు. మా నాన్నగారిని 1952 ప్రాంతంలో ఈయనే తిరువణ్ణామలైకి తీసుకువెళ్ళారు. చలంగారితో ఆ పరిచయ స్నేహబంధం ఇరవై ఏడేళ్ళు కొనసాగింది. 
14  ఏటికల్లా చలంగారి పుస్తకాలను  దొరికినవి దొరికినట్టే చదివిన ఆవిడకు ఆయనమీద అభిమానం ఏర్పడింది. ఆయనకు ఉత్తరం రాద్దామని అనుకున్న ఆవిడ రాస్తే బాగుంటుందో లేదో అని ఆలోచిస్తున్న విషయం జలసూత్రంగారి చెవిన పడింది. ఆయన చలంగారితో ఈ విషయం చెప్పడంతోనే ఆయన కామేశ్వరిగారికి ఓ ఉత్తరం రాశారు. Dear unknown friend ..... అని సంబోధిస్తూ రాశారు. అది 1957 జూన్ 3 వ తేదీన రాసిన ఉత్తరం.
ఆ ఉత్తరం ఇదే...
Dear unknown friend,
మీరు నన్ను చూడాలనుకోవడం, నాకు సన్మానం. అలాంటి వాంఛ మన మనసుని మించి నరాల్లోకి ఇంకి హృదయాన్ని చేరుకుంటే, ఇక దేహాలు చూసుకోవడమనేది స్వల్ప విషయమౌతుంది.
 
జీవితం - తప్పవు ఆశలు, నిరాశలు, ambitions.
 కాని ఏ స్థితిలోనూ హృదయంలోని అందమైన విలువల్ని అడుగున పడనీకండి- ఎన్ని కష్టాలు అడ్డం వచ్చినా సరే.
 ఈశ్వరాశీర్వాదాలతో,
 చలం.
చలంగారి నుంచి వచ్చిన ఈ ఉత్తరాన్ని అందుకున్న ఆవిడ నమ్మలేకపోయారు. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉక్కిరిబిక్కిరి అయ్యారావిడ!
"ఎంతో మంచి ఉత్తరం. అదీ వారంతట వారే రాయడం. వారే మొదటిసారిగా ఉత్తరం రాసింది నాకేనట! ఎంత అదృష్టవంతు రాలిని! ఆ తరువాత ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు మా మధ్య జరిగాయి" అని మహదానందంతో చెప్పారు 
బయలుదేరి వస్తుంటే "అమ్మ ఒడిలో మా జీవనం" అనే పుస్తకాన్ని ఇచ్చారు చదివాక రిటర్న్ చేయమని. శారదగారు "షౌ" గారిపై రాసిన పుస్తకమది. ఈ పుస్తకం షౌగారు అరుణాచలం నుంచి భీమ్లీ వెళ్ళి అక్కడ స్థిరపడిన విశేషాలతో కూడినది. షౌ గారు భీమ్లీలో ఉంటున్న రోజుల్లో ఒకే ఒక్కసారి ఆవిడకు నేను గుర్తున్నానా అంటూ ఉత్తరం రాస్తే "ఎందుకు గుర్తు లేవు. నీకు నేనేగా పేరు పెట్టా"నంటూ ఓ ఉత్తరం రాశారు. ఈ మాట నాకెంతో ఆనందాన్నిచ్చింది. 2006 మే 20వ తేదీన షౌ గారు తనువు చాలించడం వరకూ అనేకానేక సంఘటనలు శారదగారి పుస్తకంలో ఉన్నాయి. "శ్రీ సౌరిస్ గారితో (ఈశ్వరునితో) నిరతము సంభాషించు భాగ్యము, మరియు వారి అనుగ్రహంతో లభించిన అనుభవాల మాలిక, అనుభూతుల డోలిక ఈ అమ్మ ఒడిలో మా జీవనం" అని శారద గారు తమ తొలి పలుకులో చెప్పుకున్నారు. చలంగారితోనూ షౌ గారితోనూ ఏమాత్రం పరిచయబంధ మున్నా అది ఆనందమూ. చిరస్మరణీ యమూ. నా జీవితంలో నాకా భాగ్యం కలగడం అనిర్వచనీయం. కామెంట్‌లు