'భిన్నమైన' సంసారం!(కవిత );-కొత్తపల్లి ఉదయబాబు-సికింద్రాబాద్.
నేనొక్కడిగా ఉన్నప్పుడు నా
బ్రతుకు ఒక  సరి ప్రధాన  సంఖ్య!
తాను సున్నలా వచ్చి చేరినప్పుడు
'పది'లాంటి పరిపూర్ణ సంఖ్యయే!

ఏడాది మా సంసారం క్రమ భిన్నమే
నేను లవంలో ఉన్నా తనదే ఆధిక్యత.
నేను ' హారమై'న అపక్రమ భిన్నం లోను
కానీ నాకు కొండంత   చేయూత!

ఇద్దరు ముగ్గురమైన 'సంయుక్త సంఖ్య'లో
'పూర్ణాంకమై' నిలబడిన పిల్లలు ఉన్న క్షణాన
గుణకార, కూడికల మిశ్రమభిన్నమే -కానీ 
తన ఆధిక్యతతో మళ్లీ మాది 'క్రమభిన్నమే'.

ఆలుమగల అన్యోన్య సంసారంలో
ఎవరు కింద ఎవరు పైనున్నా
మిశ్రమ భిన్నాలు - అపక్రమ భిన్నాలై
తన సహకారంతో మలిగినప్పుడే,
సంసారపు విలువ తెలిసేది
అనురాగ దాంపత్యానికి
ఆలవాలమై నిలిచేది!
అనురాగసంగమ జ్యోతిగా వెలిగేది!

సమాప్తం


కామెంట్‌లు