కరకరమనే వడియాలు...!!-----ప్రొ.భక్తవత్సల రెడ్డి--తిరుపతి.

 సంప్రదాయ ఆహారపు అలవాట్లలో మనం చాలా పోగొట్టుకొన్నాం. కాలం మారుతున్నపుడు మనం కూడా కాలానికి అనుగుణంగా మారక తప్పదు. అయితే ఈ మార్పు ఇతరులని అనుకరించడం వల్ల తెచ్చిపెట్టుకున్న మార్పా లేక మన పునాది ఆధారంగా కాలానుగుణంగా ప్రాంతీయ వాతావరణ నేపధ్యంగా తెచ్చుకుంటున్న మార్పా అన్న అంశం మీద స్పష్టత ఉండాలి. సంప్రదాయ వంటల్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నపుడు కొన్ని కాలానికి తగ్గట్టు మరికొన్ని శరీర ప్రకృతికి తగ్గట్టు, ఇంకా కొన్ని ప్రాంతీయతని అట్టిపెట్టుకుని ఉన్నట్టు చూడగలం. వైవిధ్యమున్న భోజనంలో కరకర నమిలే వడియాలు, వరుగులకు కూడా ప్రాధాన్యత ఉంది. వైవిధ్యమున్న వడియాలు, వరుగులు గురించి ముచ్చటించుకోవడం నేటి మన ముచ్చట. 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జానపదగిరిజన విజ్ఞానపీఠం వరంగల్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2000 – 2001 లో జరిపిన క్షేత్రపర్యటన సమాచారం దీనికి ఆధారం. ఆ సమాచారమంతా విషయదాతల పరంగా నోటు పుస్తకాలలోకి ఎక్కించడమే కాకుండా గ్రామాల ఆధారంగా, ఒక్కో ప్రక్రియకి సంబంధించిన రిపోర్టులు కూడా తయారు చేసినారు. 1995 నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 
అరటి దూటి, ఉల్లిపాయలు, క్యాబేజి, నువ్వులు, పనసకాయ పొట్టు, పెసరపప్పు, బియ్యపుపిండి, సగ్గుబియ్యం, బూడిదగుమ్మడికాయలు, మినపపప్పు, రేగుపండ్లు లాంటి వాటిని ఉపయోగించుకొని చేసే వడియాలలో వైవిధ్యముంది. 
అరటి దూటి, పచ్చిమిర్చి, ఉప్పు, మినపపప్పు, జిలకర, అల్లం ఉపయోగించుకొని అరటి దూటి వడియాలు (మినపపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జిలకర అన్నింటినీ కలిపి రుబ్బి, రుబ్బిన పిండికి అరటిదూటి ముక్కలను కలిపి, ఒక గుడ్డ మీద ముద్దలుగా పెట్టి ఎండబెట్టి), ఉల్లిపాయలు, మినపపప్పు, ఎండుకారం, పచ్చిమిర్చి, జిలకర, ఉప్పుతో ఉల్లిపాయ వడియాలు (నానబెట్టిన మినపపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు అన్నింటినీ కలిపి రుబ్బి, రుబ్బిన పిండికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కలిపి, ఒక గుడ్డ మీద చిన్న చిన్న ముద్దలుగా పెట్టి ఎండబెట్టి), క్యాబేజి పచ్చిమిర్చి మినపపప్పు అల్లం ఉప్పుతో క్యాబేజి వడియాలు (నానబెట్టిన మినపపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు అన్నింటినీ కలిపి రుబ్బి, రుబ్బిన పిండికి సన్నగా తరిగిన క్యాబేజి ముక్కలను కలిపి, ఒక గుడ్డ మీద పిండిని ముద్దలుగా పెట్టి ఎండబెట్టి), గోధుమనూక పచ్చిమిర్చి ఉప్పుతో కొంతమంది, పచ్చిమిర్చికి బదులు కారం కలుపుకొని మరికొందరు గోధుమనూక వడియాలు (గోధుమనూకలో ఉప్పు, కారం కలిపి, అందులో నీళ్ళు పోసి కలిపి, ఆ పిండిని జంతికల కుడకలో వేసి, ఒక గుడ్డ మీద కుడకతో పిండిని వత్తి, ఎండబెట్టి లేదా ఒక గిన్నెలో నీటిని ఎసరు పెట్టి, ఎసరు మరిగిన తరువాత అందులో గోధుమ నూకను, రుబ్బిన పచ్చిమిర్చిని, ఉప్పును కలిపి ఉడికించి, తరువాత ఒక మైకాకవరు మీద పిండిని ముద్దలుగా పెట్టి, ఎండబెట్టి), తెలగపిండి కారం వెల్లుల్లి వాము జిలకర ఉప్పు తో తెలగపిండి వడియాలు (నువ్వులను ఆడించగా మిగిలిన పిండిని నీటిలో నానబెట్టి, నీటి నుంచి తీసి ఒక గుడ్డలో పెట్టి పైన బరువును పెడితే పిండిలోని నీరంతా పోతుంది, ఆ పిండికి ఉప్పు, కారం, జిలకర, వాము, వెల్లుల్లి కలిపి ఒక గుడ్డమీద ముద్దలుగా పెట్టి, ఎండబెట్టి), పనసపొట్టు  పచ్చిమిర్చి మినపపప్పు కారం పసుపు జిలకర ఉప్పుతో పనసపొట్టు వడియాలు (మినపపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జిలకర అన్నింటినీ కలిపి రుబ్బి, రుబ్బిన పిండికి పనసపొట్టు, పసుపు, నూనెలను కలిపి, ఒక గుడ్డ మీద ముద్దలుగా పెట్టి ఎండబెట్టి) పెట్టుకొంటారు. 
పెసరపప్పు పచ్చిమిర్చి జిలకర ఉప్పుతో పెసరపిండి వడియాలు (నానబెట్టిన పెసరపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిర్చి, జిలకర వేసి మెత్తగా రుబ్బి, ఆ పిండిని కొంత, కొంత చేతితో తీసుకొని ఒక గుడ్డ మీద ముద్దలుగా వేసి, ఎండబెట్టాలి), బియ్యపు పిండి సగ్గుబియ్యం కారం జిలకర నూపప్పు ఉప్పుతో పిండి వడియాలు (బియ్యాన్ని నానబెట్టి, దంచి, ఒక గుండిగలో నీళ్ళను ఎసరుపెట్టి, మరిగిన తరువాత అందులో బియ్యం పిండి, ఉప్పు, కారం, జిలకర, సగ్గుబియ్యం లను కలిపి ఉడికిన తరువాత దించి, ఒక మైకా కవరు మీద తడిగుడ్డను వేసి పిండిని ముద్దలుగా పెట్టి, ఎండబెట్టి, డబ్బాలో పెట్టుకుంటారు లేదా బియ్యాన్ని నానబెట్టి దంచి, జల్లించి, ఈ పిండిలో ఉప్పు, కారం, నూపప్పు, జిలకరలను కలిపి, తరువాత ఒక గిన్నెలో ఎసరు పెట్టి, ఎసరు మరిగిన తరువాత అందులో సగ్గు బియ్యాన్ని వేసి ఉడికించి, అందులో అన్నీ వేసి కలిపిన పిండిని పోసి ఉడికించి, దానిని చిన్న ముద్దలుగా ఒక గుడ్డ మీద పెట్టి, ఎండబెట్టి కాని, లేదా బియ్యాన్ని నానబెట్టి, దంచి, జల్లించి, ఆ పిండికి నూపప్పు, జిలకర, ఉప్పు, కారం, వాము లను కలిపి, తరువాత ఒక గిన్నెలో నీటిని ఎసరు పెట్టి, ఎసరు మరిగిన తరువాత అందులో పిండిని పోసి కలిపి ఉడికించి, ఒక గుడ్డ మీద పిండిని ముద్దలుగా పెట్టి, ఎండబెట్టి కాని, లేదా నానబెట్టిన మినపపప్పు, పచ్చిమిర్చి, వాము, ఉప్పు అన్నింటినీ కలిపి రుబ్బి, రుబ్బిన పిండిని ఉడికించిన సగ్గుబియ్యం జావకు కలిపి, ఒక గుడ్డ మీద చిన్న చిన్న ముద్దలుగా పెట్టి ఎండబెట్టి కాని) పెట్టుకొంటారు.  మినపపప్పు పొట్టు పచ్చిమిర్చి ఇంగువ ఉప్పుతో మినపచెవ్వు వడియాలు (మినపపప్పును నానబెడితే పొట్టు వేరవుతుంది. తరువాత దానికి పచ్చిమిర్చి, ఉప్పు, జిలకర అన్నింటినీ కలిపి రుబ్బి, ఒక గుడ్డ మీద ముద్దలుగా పెట్టి ఎండబెట్టి) పెడతారు. 
బూడిదగుమ్మడి కాయలు పచ్చిమిర్చిలేదా కారం లేదా రెండు కలిపి, మినపపప్పు అల్లం జిలకర ఉప్పు తో బూడిదగుమ్మడి వడియాలు (బూడిద గుమ్మడికాయ ముక్కలను దంచి, ఒక గుడ్డలో పెట్టి, పైన బరువును పెడితే నీరంతా పోతుంది. తరువాత ఆ ముక్కలు, నానబెట్టిన మినపపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, జిలకర, అల్లం అన్నింటినీ కలిపి రుబ్బి, ఒక గుడ్ద మీద ముద్దలుగా పెట్టి ఎండబెడతారు. రేగుపండ్లు బియ్యపు పిండి నూపప్పు మినపపప్పు పచ్చిమిర్చి  లేదా కారం వాము జిలకర అల్లం ఉప్పుతో రేగుపండ్ల వడియాలు (మినపపప్పు, అల్లం, పచ్చిమిర్చి, జిలకర అన్నింటినీ కలిపి రుబ్బి, ఈ మిశ్రమానికి రేగుపండ్ల గుజ్జును కలిపి, ఒక గుడ్డ మీద ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా పెట్టి ఎండబెట్టి) చేసుకొంటారు. వడియాలను నూనెలో వేయించుకొని తింటారు.
కాకరకాయలు, వంకాయలు, ఉస్తి కాయలు, బెండకాయలు, మిరపకాయలు, చేపలు, రొయ్యలు, మాంసం  లాంటివెన్నో ఉప్పు మజ్జిగ లో ఊరబెట్టి, కొన్నింటిని ఉడకబెట్టి మరికొన్నింటికి ఉప్పు పసుపు కలిపి ఎండబెట్టి వరుగులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే.
పచ్చళ్ల లాగే వడియాలు పెట్టుకోవడంలో కూడా నియమనిష్టలు పాటిస్తారు. పున్నమికి ముందు, సోమవారం వడియాలు పెట్టకపోవడం (పున్నమికి ముందు, సోమవారాలలో పెడితే కీడు జరుగుతుందని నమ్మకం) ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు. శుక్రవారం సాధారణంగా స్నానం చేసి వడియాలు పెడతారు. మూడు నెలల నుంచి ఆరేడు నెలల దాకా నిలవ ఉంటాయి. ఉల్లిపాయ వడియాలు, పనసపొట్టు వడియాలు, పిండి వడియాలు, బూడిదగుమ్మడి వడియాలు, మినపచెవ్వు వడియాలు, సగ్గుబియ్యం వడియాలు వేసవికాలంలోనూ, క్యాబేజి వడియాలు, గోధుమనూక వడియాలు, రేగుపండ్ల వడియాలు వానాకాలం, చలికాలం లో తినడం ఆనవాయితీ. కారణాలు వెతకాల్సి ఉంది. వీటికి వాతావరణంతో సంబంధమున్నట్టు అనిపిస్తుంది.
అరటి దూటి, క్యాబేజి తో పచ్చళ్లు, వడియాలు చేసుకొంటారు. గుమ్మడికాయతో పులుసు, దప్పళం, వడియాలు, వేపుడు చేసుకొంటారు. పనస తో పనస ఇక్కలు పచ్చి రొయ్యలు కలిపి పులుసు, పనసపొట్టుతో కూర, వడియాలు, వేపుడు చేసుకొంటారు. తెలగపిండి కూర (రక్తం బాగా వస్తుందని పురిటాలికి తప్పకుండా పెడతారు), తెలగపిండి ములగకూర (ఆషాఢమాసంలో తినాలి, ఇంటి అల్లుడికి మాత్రం పెట్టకూడదు, కడుపులోని నులి పురుగులు చనిపోతాయన్న నమ్మకం ఉంది). అలాగే నువ్వులతో నాగుల చవితికి చిమిలి చేసుకొంటారు. మినపపప్పు ప్రీతిపాత్రమైన పప్పుదినుసు. వడియాలతో పాటు పిండివంటలు (అప్పడాలు, ఆవడ, గారెలు, బూరెలు, పొట్టెక్కబుట్టలు, అట్లు, రొట్టెలు, సున్నుండలు, వాసినపోళీ లాంటివి), కూరలు, తోప లో కూడా మినపప్పు వాడకం ఉంది. సగ్గుబియ్యాన్ని వడియాలతోపాటు పిండివంటలు, పాయసంలో కూడా వాడుకొంటారు.   
తూర్పు గోదావరి జిల్లాలో ఆది ఊరుగా ప్రసిద్ధికెక్కిన ఆదుర్రు (పురాతన బౌద్ధారామం కూడా ఉంది) లో అరటిదూటి, ఉల్లిపాయ, క్యాబేజి, గోధుమనూక, పనసపొట్టు, పిండి, బూడిదగుమ్మడి, మినప చెవ్వు, రేగుపండ్ల, సగ్గుబియ్యం వడియాలు పెట్టుకొంటున్నారు. అంటే వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారన్నమాట. 
మరిన్ని విశేషాలతో జానపద పరిశోధకులు, సాహితీ ప్రేమికులు స్పందించగలరని ఆశిస్తున్నాను.
-----------------------------------------------------------, 
నాగపట్ల భక్తవత్సల రెడ్డి 
------------------------------------------------------------
కామెంట్‌లు