*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0215)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుని నారదుని తో దేవతలకు ఆహ్వానం పంపటం - వారందరితో కలసి శివుడు - మంగళాచరణము, గ్రహ పూజలు చేసి - కైలాసమునుండి కదలుట*
*నారదా! సప్తర్షులు తెచ్చిన వివాహ పత్రికను తీసుకొన్న మహేశ్వరుడు, పరమానందముతో సప్తర్షులతో, "మహానుభావులారా! మీరు నా ఆజ్ఞ చెల్లించే విషయంలో, మేనకా హిమవంతులను ఒప్పించి, వివాహ పత్రిక తెచ్చి చాలా గొప్ప సహాయం చేసారు." అని చెప్పి వారందరినీ ఉచిత రీతి సత్కరించి, తన వివాహానికి రమ్మని వారిని ఆహ్వానించారు. తరువాత, నారదా, మహేశ్వరుని తలపు వల్ల నీవు ఆయన వద్దకు చేరి, తలవంచి నమస్కరించి నిలబడ్డావు. నిన్ను చూచిన శంభుడు "నారదా! నా తరుపున నీవు దేవతలందరినీ నా వివాహానికి ఆహ్వానించి రా!" అని చెప్పగా, పేరు పేరున అందరి గృహాలకు వెళ్ళి వారిని సబాంధుకంగా శివుని వివాహ మహోత్సవానికి ఆహ్వానించి తిరిగి స్వామి సన్నధిలో నిలుచున్నావు.*
*శంకరుని ఆహ్వానం మేరకు, లక్ష్మీ దేవి తో విష్ణువు, సరస్వతీ దేవి తో నేను, ఇంద్రాది దేవతలు, రుషులు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు అందరూ కైలాసానికి తరలి రాగా, శివ మహాదేవుడు, వారి వారి అర్హతను బట్టి ఆదరణ చేసి, ఉచితాసనములపైన కూర్చుండ చేసారు. నన్ను, వివాహం జరిపించమని బ్రహ్మ స్థానంలో కూర్చుండ బెట్టారు.*
*లక్ష్మీ, సరస్వతీ, అరుంధతీ తో కూడి సప్తర్షుల భార్యలు స్వామిని పెండ్లికి తయారు చేసారు. స్వామి సహజమైన అలంకారములు అన్నీ కూడా ఆభరణాలుగా మారి పోయి, స్వామి సర్వాలంకార భూషితుడుగా కనిపిస్తున్నారు. మూడవ కన్ను తిలకము అయ్యింది. భస్మ లేపనము చందనాగరు లేపనము అయ్యింది. గజ చర్మాలు పట్టు వస్త్రాలు అయ్యాయి. అప్పుడు దేవతలందరితో కలసి, విష్ణు దేవుడు, " శరణాగత వత్సలా! దేవదేవా! గృహ్యాసూత్రోక్త విధికి అనుగుణముగా గిరిజా కుమారి అగు పార్వతీ దేవి తో మీ వివాహము జరిపింపుడు. మీ ఇరువురి వివాహము ద్వారా లోకములో వివాహ ప్రక్రియ సంపన్నము అయి ఖ్యాతి పొందుతుంది. నాందీ ముఖముగా శాంతి ప్రక్రియ జరిపింపుడు. పితృదేవతలను ఆహ్వానించి, వారిని తృప్తి పరచి, వారి ఆశీస్సులు అందుకుని ఈ అనంత విశ్వములో మీ ఖ్యాతి విస్తరింప చేయండి" అని ప్రార్థన చేసారు.*
*భగవంతుడు అయిన విష్ణువు మాటలు విన్న శివుడు, లోకాచార పరాయణుడు, విధి పూర్వకంగా అన్ని కార్యములను చేసారు. సప్తర్షులు వైవాహిక మంగళాచరణమును జరిపించారు. నాయొక్క, శంభుని యొక్క ప్రేరణ చేత ఆ స్వామి విఘ్న శాంతి కోసం, ప్రేమతో గ్రహములందు తిరుగుతూ ఉన్న దేవతలు అందరినీ పూజించారు. లౌకిక, వైదిక కర్మలను ఉచితమైన పద్ధతిలో చేసి శంభుడు సంతోషపడి, దేవగణములతో కైలాసమును వీడి, హిమవంతుని పురానికి బయలు దేరాడు. దేవతలు అందరూ గొప్ప ఉత్సవము చేస్తూ, మంగళవాయిద్యాలతో స్వామి వెంట కదిలారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు