*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0224)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శివాశివుల వివాహ సంరంభం ప్రారంభం - హిమాచలుడు, శివుని గోత్రము అడగడం - నారదుని సమాధానం - కన్యాదానం చేసి వరకట్నం ఇవ్వడం - మహాదేవుని అభిషేకం.
*శివాశివుల కళ్యాణం*
*నారదా! ఇప్పుడు హిమాచలుడు, గర్గ మహాముని చెప్పగా కన్యాదాన కార్యక్రమం మొదలు పెట్టాడు. శుభ్రమైన బంగారు వస్త్రాలు ధరించిన మేనక హిమాచలునికి ఎడమ ప్రక్కన కూర్చుంది. శైలరాజు నీరు మొదలైన పదార్ధాలతో వరుడైన శంభుని పూజ చేసాడు. మంచి బట్టలు, చందనాగరులు ఆ స్వామికి సమర్పించి, తిథి, వార నక్షత్రాల కీర్తన చేయవలసిందిగా బ్రాహ్మణులను అడిగాడు. పురోహితులు ఉచ్ఛ స్వరముతో తిథి వారాలను కీర్తిస్తూ "తథాస్తు" అన్నారు. అప్పుడు గిరిరాజు, ఈశానునితో "మహాదేవా! మీ గోత్రము, కులము, ప్రవర, నామము, వేదము శాఖను తెలిజేయండి" అని అడిగాడు.*
*గిరిరాజు మాటలు విన్న శంభుడు గంభీరంగా మౌనంగా ఉండిపోయారు. భగవానుని మౌనాన్ని గమనించి, పరమేశ్వరుని కి అత్యంత ప్రియుడవు అయి, వేదవేద్యడవు అయిన నారదా! నీవు హిమాచలునితో ఇలా అన్నావు. "గిరి శ్రేష్టా! నీవు ఈ బాహ్య ప్రపంచంలోనే ఉంటున్నావు గానీ, అంతర్మఖుడవు కాలేదు. నీవు శంభుని గోత్రనామాలు అడగడం ఎంతైనా హాస్యాస్పదంగా ఉంది. పర్వత రాజా! ఎవరి గోత్రనామాలు అడుగుతున్నావు. శంకరుని గోత్రనామాలు, విష్ణువు, బ్రహ్మ, నాకు కూడా తెలియనివి. కాళి తపస్సు ఫలితంగా నీవు శివుని నీ ఇంట చూడ గలుగుతున్నావు. ఈ స్వామికి రూపములేదు. అన్ని రూపాలు ఆయనవే. పేరు, గోత్రము లేదు. అన్ని పేర్లు, గోత్రములు ఆయనవే. ఈ స్వామి నిర్గుణుడు. అయినా సగుణుడే. కులహీనుడు, కులీనుడు కూడా. ఎంత గొప్ప వారైనా శంభుని తెలుసుకో లేరు."* 
*"ఓ శివా తండ్రీ! నీ అనుమానాలు అన్నీ వదలి, నీ కుమార్తె ను శంభుని చేతిలో పెట్టు. లీలా రూపమును ధరించగల సగుణ మహేశ్వరుని గోత్రము, కులము నాదమే. నాదరూపుడే శివుడు. నాదమయుడు శివుడు. ఇది ఎల్లప్పుడూ సత్యము. సృష్టి ప్రారంభంలో సగుణరూపమును ధరించిన మహేశ్వరుని నుండి, మొట్టమొదట నాదమే పుట్టినది. కనుక, ఆ స్వామి ఇచ్చిన ప్రేరణతో నేను " మహతి"ని మీటుతున్నాను. నీవు నీ భ్రమలు అన్నిటినీ వదలి, మనసులో శంకరుని నిలుపుకొని, ఆయన కోసమే జన్మించిన ఉమను ఆయనకు ధారాదత్తం చేయి."* 
*నారద! పర్వతరాజు తో నీ మాటలు విన్న విష్ణువు, నేను, ఇతర దేవతలు కూడా ఎంతో ఆనందించాము. పార్వతి చేసిన తపస్సు ఫలితంగా మనం ఆ స్వామిని సుందర సగుణ రూపంలో చూస్తున్నాము అని సంతోషంగా ఉన్నారు. తరువాత, శంకర ప్రేరేపితుడై హిమాచలుడు మహాదేవునితో "ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర | భార్యార్ధం పరిగృహ్ణీష్వ ప్రసీద సకలేశ్వర ||" - "పరమేశ్వరా! నేను ఈ కన్యను మీకు ఒసగుచున్నాను. మీరు ఈమెను భార్యగా స్వీకరించండి. ఈ కన్యాదానము స్వీకరించి, మీరు సంతుష్టులు అవ్వండి" అని చెపుతూ పార్వతిని ఇచ్చి కన్యాదానము చేసాడు. పార్వతి చేతిని శివుని చేతిలో ఉంచుతూ ఎంతో అనందమును అనుభవించాడు, గిరిరాజు.*
*తన ఉమను తిరిగి కన్యాదాన రూపంలో పొందిన శివభగవానుడు కూడా ఎంతో సంతోషించారు. గిరిజ చేయి అందుకుంటూ, లోకాచారము పాటిస్తూ, వివాహమునకు వరుడు కన్యను గ్రహించిన తరువాత కామస్తుతికి చెందిన మంత్రము "కోదాత్కస్మా అదాత్కామో దాత్కామాయా దాత్కామో దాతా కామః ప్రతిగ్రహీతా కామైత్తతే | " చెప్పారు. శివాశివుల వివాహం సుసంపన్నమైంది. గిరిరాజు, వరుడైన శివునికి, ధన, కనక, వస్తు, వాహనాలు, వరకట్నం గా సమర్పించాడు. మునులు, బ్రాహ్మణులు వేదహితంగా మహాదేవుని నామము చెపుతూ అభిషేకము చేసారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం