*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0226)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
పూర్తయిన శివాశివుల వివాహ సంరంభం - వధూవరులు నివాస భవనానికి వెళ్ళడం - రతీ దేవి ప్రార్థన - కామదేవునకు జీవన దానం - వధూవరులు మృష్టాన్నమును తినిపించుకొనడం - శివుడు జనావాసములకు తిరిగి వెళ్ళడం.
*నారదా! కామదేవుడు పునరుజ్జీవితుడు అయి, బాహ్య ప్రపంచం లోకి వచ్చాక, దేవతాసమూహం అంతా శివ పార్వతులను ఉత్తమ సింహాసనమున కూర్చోబెట్టారు. ఉమ, శంకరుని వామాంక స్థిత అయ్యింది. వారికి మృష్టాన్నభోజనం కొసరి కొసరి వడ్డించారు, మేనకా హిమవంతుల పరివారం. శవాశివులు, ఒకరికొకరు తీపి తినిపించుకున్నారు. సంతోషించిన అంబ, మల్లికార్జునునికి చిలకలు చుట్టి తాంబూల సేవనము చేయించింది. లోకాచరము ప్రకారము జరుగ వలసిన అన్ని కార్యములు యధావిధిగా జరిపించారు, మేనకా హిమవంతులు. ఆతరువాత, శంభుడు తన నివాసానికి ప్రయాణమయ్యారు. అప్పుడు, దేవర్షులు, మునులు చదువుతున్న వేదమంత్రాల నడుమ పెద్ద ఉత్సవమే జరిగింది.*
*ఆ ఉత్సవ సంరంభంలో ప్రజలు తత, ఆనద్ద, సుషిర, ఘనములు అనే నాలుగు విధాలైన వాయిద్యాలు ఉపయోగించి నృత్యాలు చేసారు. తీగలు విస్తృతంగా ఉపయోగించే వీణ, సితార మొదలగు "తత" వాయిద్యాలు, చర్మముతో కట్టబడి, బిగించబడిన డోలు, మృదంగము, నగరా మొదలగు "ఆనద్ద" వాయిద్యాలు, కన్నాలు ఉండి గాలి సహాయంతో స్వరములు పలికే వేణువు, శంఖము, విజిల్ మొదలైన "సుషిర" వాయిద్యాలు, కంచు, ఇత్తడి తో చేయబడిన కంచతాళములు, గజ్జెలు మొదలైన "ఘన" వాయిద్యాలు ఆ మహాదేవుని మహోత్సవం లో వాడబడ్డాయి.*
*ఇంతటి ఘనమైన ఉత్సవ సంబరం తో తన విడిదికి చేరిన మహాదేవుడు, భక్తజన సంరక్షకుడు అయిన శంకరుడు లోకాచారము పాటించి దేవర్షులకు, మహర్షులకు, మునులకు, విష్ణు దేవునికి, నాకు కూడా ప్రణామము చేసారు.అప్పుడు అక్కడ,అన్ని విఘ్నములు నశింపజేసి శుభములను కూర్చే వేదధ్వనులు, జయజయ కారాలు, మిన్నంటాయి. తరువాత, నేను విష్ణువు, మిగిలిన దేవతలు ఈశానుని పూజించి, వారి ఆజ్ఞను అనుసరించి మా మా నివాస స్థానలకు వెళ్ళాము.*
*ఈ విధంగా శివాశివుల కళ్యాణం సుసంపన్నం అయ్యింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు