*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 041*
 కందం:
*అల దేవగృహము కడప యి*
*రుల గోవాటముల యందు ద్రోవలలోర*
*చ్చల కొట్టములను నొప్పదు*
*మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా !*
తా:
కుమారా! దేవుని గుడిలో, ఇంటి గడప ముందు, పశువుల కొట్టములలో, నలుగురూ నడిచే దారిలో, నలుగురూ కూర్చుని మాట్లాడుకునే రచ్చ బండల దగ్గర మల మూత్ర విసర్జనము చేయగూడదు......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"లిట్టరింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్" అని, "ఇక్కడ ఉమ్మి వేయరాదు" అని, ఈ తరహా హెచ్చరిక రాసివున్న బోర్డులు మనకు రహదారులకు రెండు పక్కలా, దేవాలయాలు, చర్చులు, మసీదుల దగ్గర, బడుల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అయినా, వింత కాకపోతే, మన ఇంట్లో మనం ఉమ్మి వేసుకుంటామా! చెత్త వేసుకుంటామా! వేసుకోము కదా! మరి మనము నడిచే రోడ్డు మీద, ఉమ్మి, చెత్త, పండ్ల తొక్కలు ఎందుకు వేస్తున్నాము. దేవాలయాలు, అందరూ గౌరవించి, ఆదరించే ప్రదేశాలలో మనం మర్యాదగా, నలుగురూ మెచ్చుకునే విధంగా కాకపోతే కనీసం అవతలి వారికి ఇబ్బంది కలగకుండా ఉండగలగాలి కదా! ఈ మాత్రం విజ్ఞత మనం ప్రదర్శించ లేమా! ఇది అంత ఆచరణ సాధ్యం కాని విషయమా! కాదు అని నా, మరియు చాలమంది అభిప్రాయం. నలుగురికీ ఆనందం కలిగించక పోయినా పరవాలేదు, కానీ ఎవరికీ ఇబ్బంది కలుగకుండా నడుచుకునే మంచి ఆలోచన మనకు ఇవ్వమని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు