కందం:
*ధీరుడు తన దగు సంపద*
*జారిన యెడ జింత నొందజాలక దా ల*
*క్ష్మీరమణుని వర చరణం*
*భోరుహములు గొలిచి ముక్తిబొందు కుమారా !*
తా:
కుమారా! ధైర్య వంతుడు తన సంపద మొత్తం చేజారిపోయి నష్టపడ్డా కూడా చింత పడకుండా, బాధపడుతూ కూర్చోకుండా, ఆ లక్ష్మీరమణుడు, విష్ణుమూర్తి పద్మపాదాలను పూజించి, శరణు కోరి ముక్తి సాధించుకుంటాడు......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"లక్ష్మి చంచల" - ఎప్పుడూ ఒక చోట నిలకడగా ఉండదు సంపద. ఇవాళ నీదైతే రేపు, మరునాడు ఎవరి దగ్గర ఉంటందో చెప్పలేము, తెలియదు కూడా. అందుకే "ఈ రోజు నీ దగ్గర లౌకికమైన సంపద పుష్కలంగా ఉంది అని విర్రవీగకు నాయనా!" అని పెద్దలు అంటుంటారు. "ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి" అనేది నానుడి. గట్టిగా పదిమంది పదికాలాలు కూర్చుని తింటే కరిగి పోతుంది డబ్బు. ఏ తుపానో, ప్రళయమోవవస్తే ఎగిరి పోతుంది ఇల్లు. ఏ దొంగకో అవసరం అయితే వస్తువులు, బంగారం తీసుకుని వెళతాడు. కానీ, ఏ ప్రళయము కదల్చలేని, ఎంత ఖర్చు చేసినా తరగని, ఏ ఒక్కరూ దొంగిలించలేని వస్తువు భక్తి, పరమాత్ముని సేవ. ఖర్చుచేసిన కొద్దీ పెరిగేది భక్తి. ఎంతసేపు సేవ చేసినా ఇంకొత సేపు చేయాలి అనిపించేది పరమాత్ముని సేవ. అటువంటి స్థిరమైన భక్తి మీద మన మనసును నిలుపుకొని, పరంధాముని సేవలో ఎల్లప్పుడూ నిలిచివుండే భాగ్యాన్ని మనకు కలిగించమని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి