*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 044*
 కందం:
*పాపపు బని మది దలపకు*
*చేపట్టిన వారి విడువ జేయకు కీడున్*
*లోపల తలపకు, క్రూరుల*
*ప్రాపును మరి నమ్మబోకు, రహిని కుమారా !*
తా:
కుమారా! చెడ్డ పని చేయాలి అని మనసులో కూడా అనుకోకు. నీవు చేరదీసిన వారిని ఎప్పుడూ విడిచి పెట్టకు. ఎదుటి వారికి చెడు చేయాలి అనే ఆలోచనలను రానీయకు. చెడుదారిలో వెళ్ళేవారు, నిన్ను దగ్గరగా తీసుకున్నా, వారిని, వారు ఇచ్చిన చోటును నమ్మవద్దు......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"గయోపాఖ్యానం" ఇది కృష్ణార్జునుల మధ్యనే యుద్ధం దాకా తీసుకు వెళ్ళింది. "పట్టి విడువ రాదూ" అని త్యాగరాజు గారి కీర్తన. మనం ఆశ్రయం కల్పించిన వ్యక్తిని, మనని శరణు అడుగుతూ వచ్చిన మనిషికి అభయం ఇచ్చిన తరువాత, అవతల మనకు ఎదురుబడే ప్రత్యర్ధి ఎంతటి వాడైనా వెనకడుగు వేయకూడదు, అని గయోపాఖ్యానం తెలుపుతుంది. అభయం ఇచ్చిన గయుని రక్షించడానికి తన బావ, ప్రత్యక్ష పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణుని తోనే యుద్ధానికి దిగుతాడు గాండీవ ధారి. అలాగే, విభీషణుని, రావణ బ్రహ్మ ఎంతో ప్రేమగా ఆదరంతో చూచుకుంటూ ఉంటాడు. కానీ, రావణుడు, సీతమ్మవారిని చెర పట్టడం, హనుమ రాయబారం వినక పోవడం చూచిన విభీషణుడు, తన ప్రియమైన అన్నను వదలి, రామభద్రుని చెంత చేరాడు, కదా! అందువల్ల, చెడ్డ ఆలోచనులు చేయకుండా, చెడు దారిలో వెళ్ళకుండా, మంచి మార్గాన్ని పట్టుకుని జీవతగమనం సాగేలా మనకందరకు అనుగ్రహించమని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు