*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 047*
 కందం:
*తిరుగకు దుర్మార్గులతో*
*నరుగకు గహనాంతరస్థలాదుల కొంటన్*
*జరుగకు శత్రుల మ్రోల*
*న్మరువకు మేల్ హితులయెడల మదిని కుమారా !*
తా:
కుమారా! దుర్మార్గులతో, చెడ్డవారితో తిరుగ వద్దు. అడవులు వంటి ప్రదేశాలలోకి ఒంటరిగా వెళ్ళకు. నీకు శత్రువుగా ఉన్న వారితో కలసి ఉండకు. నీ మనసులో ఎప్పుడూ కూడా నీకు మేలు చేసిన వారిని మరచిపోకు.......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*రామాయణం లో సుగ్రీవుడు రాజు అయ్యాక, సీతాన్వేషణలో కొంత జాప్యం జరిగినప్పుడు లక్ష్మణుడు కర్తవ్యం గుర్తు చేస్తాడు, సుగ్రీవునికి. అందువలన, మంచి చేసిన వారికి ఇచ్చిన మాట ఎప్పుడూ మరపు పొరలలోకి పోకుండా చూసుకోవాలి, మన పక్కన లక్ష్మణుడు ఉండే అవకాశాలు తక్కువ కనుక. ఇక, కైకేయి, మహారాజ్ఞి, యుద్ధంలో సమాలోచనలలో ఎవరినైనా మట్టి కరిపించగల సమర్ధురాలు. అయితే ఏం లాభం. మంథర మాట విని భర్తని పోగొట్టుకుని, కన్నకొడుకు భరతునికి దూరం అయ్యింది. కాబట్టి, చెడు ఆలోచనలకు, చెడ్డ వారికి ఆమడ దూరంలో ఉండాలి. ప్రతి దినం, కావలసిన దాని కంటే, ఎక్కువ మంది మంథరలు మనకు అందుబాటులో ఉంటారు. భీష్మ పితామహుడు. ఈయనకు ఎవరూ, ఎట్టి పరిస్థితుల్లోనూ సాటి రాలేరు. ఈ పితామహుడు, తన తండ్రికి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి, శత్రువులకు సమానమైన కౌరవుల పక్షాన ఉండిపోయాడు. కృష్ణ పరమాత్మ చేతనే శిక్షించబడే పరిస్థితి ఏర్పడింది. అందుకే, ఇటువంటి పరిస్థితులలో మనం ఉండ కుండా చూడమని, కాపాడమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు