57 ప్రదేశాలతో సాగిన సీసపద్యం;-- యామిజాల జగదీశ్
ఉత్తర హరివంశము -  ఉత్తమోత్తమ ప్రబంధాలలో ఒకటి. దీని కర్త నాచన సోమనాథుడు. సకల భాషాభూషణుడైన మహాకవి నాచనసోమనాథుడు. సర్వశాస్త్ర పారంగతుడు. సంస్కృతంలో హరివంశం ఒక్కటే ఉంది. రామాయణానికి ఉత్తర రామాయణం ఉన్నట్టు హరివంశానికి ఉత్తర హరివంశం అని విడిగా లేదు. కావీ తెలుగు ఉత్తర హరివంశంలో సంస్కృత హరివంశంలోని కథలే కనిపిస్తాయి. అటువంటప్పుడు దీనికి నాచన సోముడు ఉత్తర హరివంశం అని ఎందుకు పేరు పెట్టాడన్నది ఇప్పటికీ జవాబు లేదు. ఏదేమైనా ఇది ఒక గొప్ప కావ్యం. నాచన సోముడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవిగా పరిగణిస్తారు. సోముడు కాలానికి సంబంధించి పరిశోధకుల్లో వాదోపవాదాలు లేకపోలేదు. తిక్కనకు శిష్యుడైన నాచన సోమనాథుడు తన త్తర హరివంశాన్ని హరిహరనాథునికి అంకితం చేసాడు. నాచన గారి పుత్రుడవడంతో ఈయనను నాచన సోమనాథుడు అని అన్నారు. సోమన కడప జిల్లాకు చెందిన వారు. సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణసనాథుడు అనే బిరుదులు ఉన్న నాచన సోముడు తిక్కన అడుగుజాడల్లో నడచినవారు, హరిహరాద్వైతప్రతిపాదకుడు. నాచనసోముడు మనసు కృష్ణునిపట్ల కొంత మొగ్గుచూపించాడని ఆయన రచనా తీరుబట్టి తెలుస్తుంది. ఉత్తర హరివంశంలో దేవతలైన శివకేశవులు, మహర్షులు చోటుచేసుకున్నారు. వీరిని కీర్తిస్తూ ఇతర పాత్రలతో చెప్పించిన పద్యాలు ఇందులో కనిపిస్తాయి. సోమన రచనల్లో సామెతలు అనేకమున్నాయి. అలాగే అపూర్వ పద ప్రయోగాలు కూడా ఉన్నాయి. శబ్దాలంకారాలకు, శబ్ద చమత్కృతులకు అధిక ప్రాధాన్యమిచ్చిన సోమన అయిదవ ఆశ్వాసంలో ఓ సీసపద్యం వివిధ దేశాల పేర్లతో నడిపించడం ఆయన రచనా చమత్కారానికి నిదర్శనం.
ఆ పద్యం చూద్దాం...

సీ. పాంచాల పాండ్య బర్బర కిరాతాభీర/
కురు విదేహ విదర్భ కుకుర గౌళ/
గాంధార మగధ కొంకణ కళింద పుళింద/
సింధు సౌవీరాంధ్ర చేర చోళ/
సాముద్ర సాల్వ కోసల కళింగ కుళింగ/
వత్స సౌరాష్ట్రాంగ వంగ మత్స్య/
సూరసేన సుధేష్ణ సుహ్న కాశ కరూశ/
లాట కర్ణాట మాళవ వరాట/

తే.గీ. కుంత లావంతి ఘూర్జర కుహ్మక త్రి/
గర్త బహుధాన యవన టేంకణ దశార్ణ/
పుండ్ర బహ్లిక ద్రవిడ కాంభోజ హూణ/
కేకయ వసాతి కాశ్మీర కేరళములు  //

ఈ పద్యాన్ని యాభై ఏడు దేశాల పేర్లతో నడిపించాడు నాచన సోముడు. అవి,  పాంచాల, పాండ్య, బర్బర, కిరాత, అభీర, కురు, విదేహ, విదర్భ, కుకుర, గౌళ, గాంధార, మగధ, కొంకణ, కళింద, పుళింద, సింధు, సౌవీర, ఆంధ్ర, చేది, చోళ, సాముద్ర, సాల్వ, కోసల, కళింగ, కుళింగ, వత్స, సౌరాష్ట్ర, అంగ, వంగ, మత్స్య, శూరసేన, సుధేష్ణ, సుహ్మ, కాశ, కరూళ, లాట, కర్ణాట, మాళవ, వరాట, కుంతల, అవంతి, ఘూర్జర, కుహ్మక, త్రిగర్త, బహుధాన్య, యవన, టేంకణ, దశార్ణ, పుండ్ర, బాహ్లిక, ద్రవిడ, కాంభోజ, హూణ, కేకయ, వసాతి, కాశ్మీర, కేరళము.
సోమన రచనలో నగరజీవనం ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. అలాగే తన కాలంనాటి వాస్తువిశేషాలను, నమ్మకాలను, ఆటపాటలను, లలిత కళలను ప్రస్తావించిన నాచన సోముడు తన రచనా ప్రభావంతో తదనంతర రచయితలపై చెరగని ముద్ర వేశారు.


కామెంట్‌లు