ఎగిరిందీ ఎగిరిందీ(దేశభక్తి గేయం);-పి.చైతన్య భారతి -- 7013264464
పల్లవి:-
ఎగిరిందీ ఎగిరిందీ మువ్వన్నెల మన జెండా!
నింగిలోన హరివిల్లై నవ్వుతోంది ఈజెండా !
హృదయమంత ఉప్పొంగీ పాడుతోంది గీతాలను 
అవనియంత సంబరమై దేశభక్తి గేయాలను//ఎగిరిందీ//

చరణం:-
విశ్వశాంతి వీచికలు భరతజాతి సంతకమై 
భరతమాత గడ్డపై భాగ్యోదయ సంబరమై 
జాతికీర్తి జగమంతా వెలుగునింపెనీనాడే 
తూరుపు తెలవారెను స్వేచ్చాకిరణాలతో //ఎగిరిందీ //

చరణం:-
ఉద్యమ జ్వాలను రగిలించిన దేశభక్తులెందరో 
అగచాట్లను ఎండగట్టి చైతన్యం నింపినారు
దేశమంత నొక్కటియై ఆంగ్లేయుల తరిమినాము 
బానిస సంకెళ్లను యుక్తితోడ తెంచినాము//ఎగిరిందీ//

చరణం:-
అణువణువున దేశభక్తి సూర్యుళ్ళయి వెలుగుతోంది 
అమావాస్య చీకటిని తరిమేయగ పుట్టింది 
రారండోయ్ పౌరులారా ప్రగతికొరకు పయనిద్దాం!
సమసమాజ స్థాపనకు కదులుదాం ఆశయమై//ఎగిరిందీ//

చరణం:-
హరివిల్లు రంగులన్ని నేలదిగెను మనకోసం 
వాడవాడ సొగసులతో తోరణాలు మనకోసం 
నృత్యాలే సొంపుగాను గీతాలే ఇంపుగాను 
వందేమాతరమంటూ నినదించెను మనకోసం//ఎగిరిందీ //


కామెంట్‌లు