,"'గుర్తుకొస్తున్నాయి" కనుమపండగ;- సత్యవాణి కుంటముక్కుల 8639660566

  సంక్రాంతీ,భోగి ,కనుమ పడగలు మన ఆధ్రులకు విషేషమైన పండగలు.అన్ని కులాలవారికీ ఆటవిడుపు ఆ మూడురోజులూ.
      మా రౌతులపూడిలో కోళ్ళపందేలగురించి పెద్దగా చెప్పలేముగానీ,పెద్దపెద్ద ఇనుపగోళీలతో గుండాట ఆడేవారు మగవాళ్ళు..ఆ ఆట ఆడడానికి వయసునియమంలేదు. పెద్దవాళ్ళు ఇనుప గోళీలతో ఆడితే,చిన్నపిల్లలు గాజుగోళీలతో ఆడేవారు.ఆటకు జానా,బెత్తా,మూరా అని కొలతలు కూడావుంటాయి.డబ్బులుకూడా పందేలు కాసేవారు.
ఏది ఏమైనా,ఏ ఏ ఆటలు ఆడినా, శ్రమజీవులైన మగవాళ్ళకి ఆ పండగ మూడురోజులూ ఆటవిడుపే.
     
 మాకు.ఇంక కనుమనాడు మినుము తినాలని అమ్మ వండే గారెలపిండివంట ఒకటే మిగిలి వుండేది. కనుమనాడు ఆపిండివంట కూడా చేయడం అయితే, పండగ పిండివంటలు పూర్తైనట్లే. అలాగే ఆఏడాదికి సంకురాత్రి సంబరాలు ముగిసినట్లే.  కనుమపండగ తను వెళ్ళిపోతూ తనతోపాటు ముక్కనుమనాడు సందడినీ,సంబరాలనీ,ఇంటికి వచ్చిన చుట్టాలనూ,పట్టాలనూ తీసికొని వెళ్ళిపోతుంది, కనుమనాడే ఇంటికొచ్చిన బంధువులు  పెట్టేబేడా సర్దేసుకోడంమొదలుపెడతారు.
ఎందుకంటే,కనుమనాడు కాకైనా కదలదు అని ఇంటివాళ్ళు పంపించరుకనుక.
ముక్కనుమకు కూడా ఇలాటిదే ఏదో 
 ఒక సామెతవుంటే ఎంతబాగుండును , బంధువులంతా ఇంకోరోజు వుందురుకదా! 
                  సంక్రాంతినాడు సాయంత్రం పెద్దపండుగ హడావిడి ఐపోయాకా,పాలికాపులు వచ్చి,పెద్ద చెంబుతో గానుగనూనెతో పాటుగా నూనెమడ్డి,అంటే నువ్వులు నూనె ఆడించినప్పుడు నూనె అడుగున చేరిన చిక్కటి పదార్దమన్నమాట అదీ,పసుపు కుంకుమ పట్టికెళ్ళి,దుక్కిదున్నే పోతులకు నూనె మడ్డి రాసేవారు. దుక్కుటెద్దులను ఏటిలో స్నానమాడించేవారు.గంపలాది బంతిపువ్వులు పాలికాపులు తెచ్చిపోస్తేమేము దండలుగా గుచ్చినవి పట్టికెళ్ళి,
పశువుల మెడలలో వేసి,మొఖానికి పసుపులురాసి బొట్లుపెట్టి వాటిని ముస్తాబుచేసేవారు.ఏటికేడాదీ వాటిచేత చాకిరీ చేయించుకొన్నందుకు ఈ కనుమనాడు వాటికి ,మనకృతజ్ఞత ఈ విధగా తెలియజేస్తామని మా చిన్నాన్న చెప్పేవాడు.పాలికిపులకు కూడా ఆరోజు మంచి భరాతాలే కిట్టేవి.
              ఈ కనుమనాడు కూడా అప్పన్నెద్దును అంటే తోటపెద్దు అనే  ఏనుగంత ఎద్దును తీసుకొని గుంపు  మద్యలో నిలబెట్టి, ఒకడు "సింహాదిరప్పన్న సిరిగలిగినాడు-  ,పట్టితే పాదాలు వరములిస్తాడు "అంటూ నెమలి కన్నుల చీపురు పట్టుకొని పాడుతుంటే,చూట్టూ  
వున్నవాళ్ళు పెద్దపెద్ద కంచుతాళాలు మోగిస్తూ ,పాటగాడు చెప్పిందే పదే పదే చెపుతూ పాడేవారు.ఆతాళాల శబ్దం చెవుల తుప్పు వదలకొడితే,ఆపాట గుండేల్లో మారుమోగేది.మాపిన్ని అప్పన్న ఎద్దు పాదాలు కడగడానికి బిందెడు నీళ్ళిస్తే,మా అమ్మ  పసుపూకుంకుంకం పళ్ళెండు బియ్యంలో  ఒ అరకేజీ బెల్లంముక్క,కూరగాయలూ పెట్టి తెచ్చేది . ఆబిందెడు నీళ్ళతో ఎద్దు కాళ్ళుకడిగి ,మొఖానికి పసుపురాసి,బొట్టుపెట్టి,అమ్మ ఇచ్చిన బియ్యపళ్ళెం తోటపెద్దు ముందుపెడితే, దాని ముక్కుశోణాలనుంచి బుసలు వదులుతూ, అది తింటుంటే పళ్ళెంలో బియ్యం అంతదూరం చెదిరి చెదిరిపడేవి.అమ్మ దాన్ని ముట్టుకుని ధైర్యంగా దణ్ణంపెట్టి ,హారతిచ్చేది.మమ్మల్నికూడా దణ్ణం పెట్టుకోమనేది.మేంకూడా భయం భయంగా ముట్టుకొని దణ్ణంపెట్టేవాళ్ళంకానీ, "వాటీజ్ దిస్ నాన్ సెన్స్.ఎద్దుకు దణ్ణంపెట్టడమేమిటి ?"అనేవాళ్ళంకాదు. ఎందుకంటే,ఈ అప్పన్న ఎద్దువల్లే గ్రామంలోని పశుసంపద వృధ్ధిచెందుతుందని అమ్మచెప్పిందికనుక. సరే అందరి దణ్ణాలకార్యక్రమం పూర్తయ్యాకా,అప్పన్నమొఖంమీదనుండి తీసిన పసుపూకుంకం కాస్తతీసి పళ్ళెంలోవేసి,పాటబృదం కదులుతుంటే,ఎద్దుకు మెడలో, నడుముకూ కట్టిన పెద్ద పెద్ద గంటలు మోగించుకొంటూ,"రాజు కదలె రవితేజము లదరగ" అన్నట్లు ఇంటిటి దగ్గరా తనదర్పాన్ని ప్రదర్శించి అటునుంచటే, బృదగానం తోడుగా ఉప్పాడ సముద్ర స్ణనానికి బయలుదేరెళ్ళేది మాఊరి తోటపెద్దు.
         ఆ కోలాహలం దూరం అవుతూండగానే ,డప్పులు వాయించుకొంటూ గ్రామనౌకరు మాదిగప్పడు మామూలుకొచ్చేవాడు. అలాగే యజమానులకూ,పాలికాపులకూ ఏడాదంతా చెప్పులుకుట్టే వాళ్ళూ,ఇంకా అనేకరకాలుగా రైతులకు సహాయపడేవాళ్ళూ వచ్చి,అమ్మపంచె బూర్లూపులిహారలే కాకుండా మా చిన్నాన్న యిచ్చే మామూళ్ళుకూడా పట్టికెళ్ళేవారు.
            ఆ వెంటనే తెల్లవారఝామున భజనపాటలు పాడే భజన బృదాలు పాటలను  పోటీగాపాడుకొంటూవచ్చి,పప్పూ,బియ్యం,కూరలూ మొదలైనవి సేకరించుకెళ్ళేవారు. సందడిలో సడేమియా అన్నట్లు,"ఏవండీ !బేపనోరు! మేడసూత్తామండీ!అంటూ మళ్ళీ వెలమల పిల్లలు దండిగిగా బుస్తాబులై వచ్చేవారు.వాళ్ళ ముస్తాబులు మాటచెప్పాలిమీకు. ముక్కుకు రెండువైపులా,బేసర్లూ,పాపిట్లో మొగలిరేకుా,ఈ పక్కా, ఆపక్కా సూర్యుడూ,చంద్రుడూ,  చెవులకు ఎత్తుగొలుసులూ బుట్టలూ,నెత్తివెనకాల కాళిందిమీద నాట్యంచేసే కృష్ణుడుబొమ్మకలిగిన మువ్వలనాగరం,, జడపొడుగునా చేమంతిబిళ్ళలూ,జడకొసన జడగంటలూ ,మెళ్ళో కాసులుగుచ్చిన నల్లటి మొలతాటిదండ.మెడకు పట్టినట్టుండే పట్టెడ,జిగినీ గొలుసూ .అబ్బో వాళ్ళుధరించిన ఆబంగారాలూ, బంగారంలాంటి స్వఛ్ఛమైన మనసులు,ఆ అమాయకత్వం,చూసితీరాలి,కానీ చెపితే తెలియదు.కట్టుకొన్నవి చీటీగుడ్డపువ్వుల పరికినీలు జాకట్లయినా బెనారస్ పట్టుబట్టలు కట్టుకొన్నంత సతోషం వాళ్ళమొహాలలో తాడవిస్తీండేది.
                  సరే రాత్రినిద్రల్లో పడేవరకూ పాటలు, ఆటలు, మాటలు ,వాదనలు ప్రతివాదనలు అలకలు,అవితీర్చడాలు హబ్బో ఆ హడావిడి చెప్పడానికి వీలుకాదు.మర్నాడు బంధువు వెళ్ళిపోతారని చింత ఇంట్లోవాళ్ళకీ,ఇంటివాళ్ళనందరినీ వదిలి వెళ్ళిపోవాలనే దిగులు వెళ్ళేబంధువులకు.మొత్తానికి దిగులు దిగులుగా తెల్లారితే, తినో తినకో, బస్సు టైములను  బట్టి కొంతమంది బయలుదేరితే, బండిల్లో పండగకొచ్చిన మా అత్తయ్యలవంటి వారు మాత్రం,
హాయిగా ,స్థిమితంగాతిని ,తీరిగ్గా బండిలెక్కేవారు.వెళ్ళిపోతున్నప్పుడు,దిగబెట్టేటప్పుడు,ఇంటి వాళ్ళు కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటే, వెళ్ళేవాళ్ళు కళ్ళమ్మటా ,ముక్కమ్మటా కారిననీళ్ళు కొత్తచీరకు తుడుచుకొంటూ,
వెళుతున్నామని చెప్పలేక ,చెప్పలేక చెప్పి ప్రయాణసాధనం ఎక్కేవారు."ఆ..మళ్ళీ ఎంతలో వస్తుందీ సంక్రాంతి ?,మళ్ళీ ఎంతలో కలుసుకుంటాం అనుకొంటూ  మనసునూరడించుకొనేవారు అందరూ! 'ఎరువువారి నగలు ఎరువిచ్చినవారు పట్టికెళితే,చిన్నబోయింది చిట్టెమ్మ మొఖం' అన్నట్లు
ఇల్లంతా చిన్నబోయేది- ఇంటివారి మనసు మూగబోయేది.
           
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం