🙏"శివ"నామ స్మరణమ్ము
శ్రేయస్సుల నొసంగు!
సకల మానవాళికి!
శంకర ప్రియులార!
🙏ఆరాధకుల కెపుడు
ఆపదలు పోగొట్టు!
"హర"నామ స్మరణమ్ము!
శంకర ప్రియులార!
( శంకరప్రియ పదాలు., )
👌శ్రీసాంబ సదాశివుడు.. అనంత కళ్యాణగుణ సంపన్నుడు! అఖిలాండకోటి బ్రహ్మాoడ నాయకుడు!
ఆరాధకులకు.. సగుణ, సాకార స్వరూపుడు! ఆపద మ్రొక్కుల వాడు! అనాధ రక్షకుడు!
👌శ్రీమత్ పరమశివుడే.. అర్థ నారీశ్వరుడు! అనంతకోటి రూపములతో విరాజిల్లు చున్నాడు! అట్లే, అనంత కోటి నామములతో.. పిలువబడు చున్నాడు! అవియే.. భవ.. మృడ.. హర.. శర్వ.. శంభు.. రుద్ర.. లింగ.. భర్గ.. దేవ.. మున్నగునవి, వేలకొలది నామములు! వాటిని భక్తి ప్రపత్తులతో స్మరించడం వలన; భక్త మహాశయులకు... సర్వ శుభములు, విజయములు.. కలుగును! సమస్త దోషములు, పాపములు.. తొలగును!
👌పార్వతీపతి, చంద్ర మౌళి యగు, "సాంబశివుని యొక్క నామస్మరణము చేసిన నాడే జీవనము! ఆవిధంగా చేయనినాడే మరణము!" అని; మంత్రద్రష్ట లైన, మన మహర్షుల వాక్కు!
🚩సీసపద్యము
🙏హర హరా! యన్నచో హరియించు పాపాలు!
శివ శివా! యన్నచో శివము గలుగు!
భవ భవా! యన్నచో భవ బంధములు పోవు!
మృడ మృడా!యన్నచో జడత దొలగు!
శంభు శంభూ!యన్న శమియించు దుఃఖముల్
శర్వ శర్వా! యన్న సఫలమగును
రాజ రాజా!యన్న రాగముల్ శమియించు
చంద్ర చూడా! యన్న శక్తికలుగు
🚩తేటగీతి
పార్వతీ పతి!యన్నచో భవ్య మగును!
చంద్ర మౌళీశ్వరా! యన్న చరిత నిలుచు!
శరణు విశ్వేశ్వరా!యన్న జయము గలుగు!
అర్ధ నారీశ్వరా! యన్న అఖిలమగును!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి