చిరంజీవి భరత శర్మ "శతావధాన మహాక్రతువు"---శంకరప్రియ., శీల ,--సంచారవాణి: 99127 67098
 👌శతావధానమ్మును
జయప్రద మొనరించిన
     "బాల భాస్కర"! మీకు!
శివమస్తు! శ్రీరస్తు!
👌"పుంభావ సరస్వతి"
స్వరూపముగా నున్న
       మీకు అభినందనలు!
శివమస్తు! శ్రీరస్తు!
      (.. శివమస్తు పదాలు., శంకర ప్రియ.,)
 
👌చిరంజీవి భరత శర్మ.. "అవధాన బాల భాస్కర", మరియు, "అవధాన బాల సరస్వతి" బిరుదాంకితులు! తిరుపతి వాస్తవ్యు లైన, శ్రీ ఉప్పల ధడియం రాజీవ లోచన శర్మ, శైలజ దంపతులు.. తల్లిదండ్రులు! చిరంజీవి ప్రప్రథమముగా శతావధానం కార్యక్రమము..
అంతర్జాల వేదిక గా ఆంగ్ల నూతన సంవత్సర ఆగమన వేళ... అనగా "జనవరి 1వ. తేదీ నుండి 3వ. తేదీ వరకు"; మూడు రోజుల పాటు మనోరంజకంగా జరిగింది!
👌శతావధాన సభా సంచాలకునిగా "సాహితీ బంధు" తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ  వ్యవహరించారు! వారు..  అవధాన కార్యక్రమాన్ని ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపిన తీరు అద్వితీయము! అనిర్వచనీయము! శతావధాన కార్యక్రమములో.. ఎందరో అవధానులు  మేధావులు రచయితలు పాల్గొన్నారు! 
        ఇందులో పాల్గొనిన పృచ్ఛకులు అడిగిన సమస్యలు, దత్తపదులు, ఆశువులు, వర్ణనాంశములు.. మున్నగు వాటికి; భరతశర్మ సమాధాన మిచ్చారు! తనకు.. తొలిసారి శతావధానము చేస్తున్నాననే  సంశయం కానీ బెరుకును గానీ చూపకుండా.. ప్రతీ పృచ్ఛకుని ప్రశ్నలకు అడిగినదే; తడవుగా ప్రౌఢ సమాసపు పద ప్రయోగములతో చక్కని పూరణలు కావించారు! అతి తక్కువ సమయంలో.. వేగవంతంగా శతావధానము పూర్తిచేసి; పెద్దలందరి మన్ననలను పొందారు!
👌భరతశర్మ నవ్వురాజిల్లెడి మోముతో, పదహారేళ్ళ వయస్సులో.. "శతావధాన క్రతువు"ను పరిపుష్టo కావించారు! ఈ సందర్భములో.. చిరంజీవి ఆశుకవితా ధార, ధారణ, పద్య పూరణము.. పృచ్ఛకు లందరినీ ఆశ్చర్య చకితులను చేసింది!
ఇంతఁటి మహా యజ్ఞమునకు ఆధ్వర్యము వహించారు, బ్రహ్మశ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్యం శర్మ! వారియొక్క నిబద్ధత, కార్యదీక్షా దక్షత, సహనశీలత.. ముఖ్యముగా పేర్కొన దగినవి!
     అవధాని "కొదమ సింహపు పిల్ల"వలె..  ధైర్యమును స్థైర్యమును, ప్రదర్శించారు! శతావధానం "మహా క్రతువు"ను, నిర్విఘ్నముగా సంపూర్ణము కావించారు! ఈ సందర్భముగా; "శతావధాని" భరతశర్మకు శుభాశీస్సులు! శివమస్తు! శ్రీరస్తు!
 ⚜️శుభాభినందనలు
      🚩ఉత్పలమాల పద్యము
👌మత్త కరీంద్ర బృందముల మధ్య
మృగేంద్రపుకూన స్వేచ్ఛమై
      పెత్తనమాచరించి భుజవీర్యము చూపుచు బొబ్బరించునా
         నిత్తరి నీవధానమున నెల్లరి వాంఛలనెల్ల దీర్చగా
       తత్తరపాటులేక భరతా కవనమ్మున బొబ్బరించితో!!
      (.."మధురకవి" డా. ఉపాధ్యాయుల గౌరీశంకర రావు.,)
 
🚩కందపద్యము
     చిచ్ఛర పిడుగై చెలగుచు,
     అచ్చెరువొందగ కవుల్, సునాయాసంబున్,
     ముచ్చటగా పద్యములను
      క్రుచ్చుచు విరజిమ్మినావు, కోరిన వెంటన్!
        ( ...."కవిశ్రీ" సత్తిబాబు.,)
         🚩ఆట వెలది
     ఆశు పద్య మనగ ఆశుగ వేగమై
     చిత్తమలర జేసె దత్త పదులు
     పద్య పూరణములు ప్రౌఢ రీతిన సాగె
     భద్ర కీర్తి నలరు భరతశర్మ!
      ( ...దండిభొట్ల దత్తాత్రేయశర్మ.,)
      🚩తేటగీతి
     విద్య, వినయము గల్గిన విజ్ఞుడితడు
      శతవధాని,భరత శర్మ , జయము పొందె!
       కెరలు ధారను ధారణన్ కేసరి! నవ
       సాహితీఖ్యాతి అతనికే సరి! ఘనముగ!!
       ( ..."శతావధాని" జాన దుర్గా మల్లికార్జున రావు.,)

కామెంట్‌లు
శంకరప్రియగారూ చాల చక్కగా కార్యక్రమాన్ని విశ్లేషించారు అభినందనలు ఒకటి మాత్రం యథార్థం ఎంతో అనుభవం ఉన్న శతావధానులకు ధీటుగా ఈ అవధానం సాగింది యూ ట్యూబ్ నానీస్ మహతీ చానల్ లో వీక్షించిన వారికి ఇది ప్రప్రథమ అవధానమంటే ఈ ఒక్కరూ నమ్మనంత గొప్పగా చేసాడు చిరంజీవి భరతశర్మ. యశోభివృద్ధిరస్తు.
A.Satyanarayana Reddy చెప్పారు…
శతావధాని చి.భరత్ శర్మకు శుభాశిస్సులు
చ: నిలువగ వాణియే భరతు నిర్మల చిత్తము నందునెమ్మితో
చెలగెను పద్యపూరణల చెన్నగు రీతిని చెంగలించుచున్
పలుకుల తల్లి సూనుఁ గని పండితులెల్లరు ప్రస్తుతింపగా
నిలుచును కీర్తి చంద్రికలు నిండు శశాంకుని వెన్నెలట్లుగా --
క: దినదిన ప్రవర్ధమానము
గొని యీభరతుడు, పలుకుల కొల్కి కరుణతో
మనమున నిల్వగ నిత్యము
వినసొంపగు కైతల విను విందొనరించెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి (అసనారె)