సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-20
ఊర్ణనాభి న్యాయము *
   ******
ఊర్ణ నాభః లేదా ఊర్ణ నాభి అంటే సాలె పురుగు.
సాలె పురుగు తన నోటిలో నుండి దారమును తీసి అందమైన గూడు అల్లుకుంటుంది. మరి కొంత కాలానికి ఆ గూడును తానే మింగి నిర్వికారముగా ఉంటుంది.
పెద్ద వాళ్ళు ఆధ్యాత్మిక దృష్టితో చూసే వారు కొందరు ఈ న్యాయమును  సృష్టి కర్తకు ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ జగతిని సృష్టించేది ఆయనే.తిరిగి లయింపజేసేది అనగా నాశనము చేసేది ఆయనే అంటారు.
అంటే సృష్టి స్థితి లయ కారకుడైన సృష్టి కర్త ఈ ప్రపంచంలోకి ఊపిరి ఇచ్చి పంపేది. ఊపిరి తీసుకునేది ఆయనే అంటారు.
అలాగే ఈ జగం అంతా బ్రహ్మమయమే. సృష్టిగా వ్యాపించేదీ తానే తనలో లయము చేసుకునేదీ తానే చెప్తారు ఆధ్యాత్మిక వాదులు.
అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు  అర్జునునితో ఈ జగద్రచనా వ్యాపారమునకు అధ్యక్షుడిని నేనే నా మాయా శక్తి ఈ విశ్వమును సృజించి,పోషించి, లయము చేస్తుంది అంటాడు.
ఏది ఏమైనా  సామాన్య మానవ జీవితానికి ఈ న్యాయాన్ని అన్వయించి చూస్తే మనకు ఒకటి బోధపడుతుంది.
 "తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న అందమైన జీవితాన్ని అనాలోచితంగా, చేజేతులా నాశనం చేసుకునే వారి గురించి" కూడా ఈ ఊర్ణ నాభి న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు