కళ్ళు తెరిపించిన మాటలు;-- యామిజాల జగదీశ్
 ఒకరోజు నేనొక కోకిలతో మాట్లాడుతూ చెప్పాను..."నీ స్వరమెంత ఇష్టమో తెలుసా. బలే పాడతావు....ఎంతసేపన్నా వినాలనిపిస్తుంది. కానీ నువ్వు నల్లగా లేకుండా ఎర్రగానో తెల్లగానో ఉంటే నీమీద నాకు మరింత ఇష్టం ఉండేది" అని.
అలాగే సముద్రంతో అన్నాను కదా "నిన్ను చూడటానికి వచ్చే లక్షల మందిలో నేనూ ఒకడిని. నీమీద కవితలు రాశాను. చదివిన ఒకరిద్దరు బాగుందన్నారు. అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఉప్పగా ఎందుకు న్నావు? తీయగా మధురంగా ఉండొచ్చుగా? అందరం నిన్నే రుచి చూసి తరిస్తాం" అని.
అనంతరం అక్కడ్నుంచి బయలుదేరిన అయిదు నిముషాలకు ఓ పూలతోటకు చేరాను. అక్కడ రకరకాల గులాబీ పువ్వులు కనిపించాయి. అన్నీ ఎంత బాగున్నాయో. వాటి పరిమళాన్ని ఆఘ్రాణించాను. మాటలకందనంత అందం ఈ గులాబీలవి. నన్ను కట్టిపడేశాయి... అయితే "ఏంలాభం పువ్వుల్లారా? మీరందరూ మీ మొక్కలను ఎవరో ఏదో చేసేస్తారన్నట్టుగా భయపడి ముళ్ళను అంగరక్షకుల్లా పెట్టుకున్నారేంటీ.... మిమ్మల్నేమీ నేను కోయడం లేదుగా...చూసి తరించడానికొచ్చాను. ముళ్ళు లేకపో యుంటే మీ దగ్గరకొచ్చి మృదువుగా మిమ్మల్నందరినీ స్పర్శించేవాడిని. పరవశించేవాడిని కదా" అని చెప్పాను.
తర్వాత ఓ పది అడుగులు ముందుకి వేసానో లేదో "ఆగు ఒక్కసారి. మేం చెప్పేది విను" అనడంతో ఆగాను.
కోకిలా సముద్రమూ గులాబీ మూడూ కలిసి ఓ విచిత్రాకారంలో నా ముందు ప్రత్యక్షమయ్యాయి.  అవి ఒక్కటిగా చెప్పసాగాయి...
"ఒరేయ్...మనిషీ! నీకు ఇతరులలో ఉన్న మంచిని ఆస్వాదించడం తెలుస్తున్నా నీలో ఉన్న పెను లోపంతో నిన్ను నువ్వు అందరి నుంచీ దూరం చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా" అనడంతో "ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదు" అన్నాను.
ఆప్పుడవి "నీకున్న దుర్గుణమల్లా 
ఎంతసేపూ ఎదుటివారిలో ఉన్న లోపాలను ఎంచడమే. వాటిని కనిపెట్టింది నువ్వొక్కడివే అన్నట్టుగా వేలెత్తి చూపిస్తుంటావు. మంచిని పొగిడినట్టే పొగిడి లోపాలను చెప్తూ  నిందిస్తావు. ఇది మనసుకీ ఆరోగ్యానికీ మంచిది కాదు. ముళ్ళున్నా యంటావు....ఉప్పంటావు...నల్లంటావు...ఇలాంటివి మాని మంచిని గ్రహించడం అలవాటు చేసుకో ఈరోజు నుంచైనా.... నువ్వు లోపాలెంచడం మానేస్తే నిన్నందరూ మెచ్చుకుంటారు...నీతో కలసిమెలసి మాట్లాడతారు....మానవత్వం అనేది నీలో పోకుండా చూసుకో....అది నీలో లేకుంటే నువ్వెంత అందంగా ముస్తాబైనా దమ్మిడీకి పనికిరావు. నువ్వేం రాసినా చెప్పినా ప్రయోజనం ఉండదు. మంచి మనసే అందమనే నిజాన్ని తెలుసుకో" అనడంతో సిగ్గుతో తలవంచాను మరొక్క మాట మాటాడక. నిజమేగా వాటి మాటలు. కళ్ళు తెరిచాను ఆ క్షణంలో.

కామెంట్‌లు