కార్ల ప్రియుడి కథనం;-- యామిజాల జగదీశ్
 ఇది ఒక కారు ప్రియుడి కథనం. ఆయనను ఆంధ్రప్రభ ఆఫీసులో "కారు నరసింహారావు" అని పిలిచేవారు. ఆయనతో పరిచయానికి వయస్సు దాదాపు యాభై ఏళ్ళు. మా కుటుంబాలు ఒకప్పుడు మద్రాసులో ఉండేవి. ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరమూ జర్నలిస్టులమే. ఆఫ్ కోర్స్ ఆయన సర్వీసు ఇంగ్లీషులో సాగితే నాదంతా తెలుగుకి పరిమితం. రిటైరయ్యాక కూడా ఇద్దరం ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాం. ఇటీవల మా మధ్య జరిగిన మాటల ప్రస్తావనలో ఆయన కార్ల సంగతి చోటు చేసుకుంది. మా ఇద్దరి మధ్య దాదాపు ఆరేడేళ్ళ తేడా ఉంది. నేను చిన్నవాడిని. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ లక్ష్మీనరసింహారావు. ఆంధ్రప్రభలో పని చేస్తున్న రోజుల్లో ఆయన ఆదివారం అనుబంధానికి కార్ల మీద ఓ అర డజన్ వ్యాసాలు కూడా రాశారు. 
మద్రాసులో ఆయన ఇల్లు బజుల్లారోడ్డులో ఉండేది. ఈ వీధిలోనే ఎన్. టి. రామారావు ఇల్లు ఉండేది. అక్కడి నుంచి ఓ అయిదారిళ్ళవతల ఉన్న ఇంట (14 వ నెంబర్) నేను పుట్టి పెరిగాను.
నరసింహారావుగారిల్లు సొంతమే. వారి ఆవరణలో కృష్ణమూర్తి అనే మెకానికల్ ఇంజనీర్ ఉండేవారు. ఆయన మౌంట్ రోడ్డులో ఉన్న వి.ఎస్.టి. మోటర్సులో మెకానిక్ గా పనిచేస్తుండేవారు. ఆయన రోజుకో కారులో ఇంటికి వస్తుండేవారు. ఆ కార్లను చూసి చూసి నరసింహారావుకీ కార్ల మీద ఓ ఇష్టం ఏర్పడింది. అప్పుడాయన వయస్సు పదమూడు పద్నాలుగేళ్ళు. అయితే ఉద్యోగంలో చేరిన కొంత కాలానికి ఆయన మొదటీసారిగా ఓ కారు కొన్నారు. అది ప్రీమియర్ పద్మిని కారు. అది ఎవరిదో కాదు. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ హాస్య నటుడిగా తనకంటూ ఓ వెలుగు వెలిగిన రాజబాబు కారు.
రాజబాబు 1983లో మరణించిన తర్వాత కారణాంతరాలవల్ల ఆయన కారు అమ్మకానికి వచ్చినట్టు ఓ మెకానిక్ ద్వారా తెలిసింది.
నరసింహారావుగారి తండ్రి నాగేశ్వరరావుగారు కాలం చేశాక ఇల్లు అమ్మగా నరసింహారావు వాటాగా తనకొచ్చిన రెండు లక్షలను ఆంధ్రా బ్యాంకులో వేసుకున్నారు. రాజబాబు కారు కొనెయ్యాలనే ఆరాటంతో నరసింహారావు బ్యాంకు నుంచి నలబై వేలు డ్రా చేసి మెకానిక్ దాసుతో కలిసి రాజబాబు ఇంటికి వెళ్ళారు.ఆయన  భార్య లక్ష్మీఅమ్మలుగారితో బేరం చేసి ముప్పై ఏడు వేలిచ్చి కారు కొన్నారు. అది అమ్మలు పేరిట రిజిస్ట్రేషన్ అయిన కారు.అప్పటికింకా డ్రైవింగ్ పూర్తిగా రాకున్నా కారు కొనడమైతే కొనేశారు. దాని మీద మరో ఇరవై వేలు ఖర్చు చేసి డ్రైవింగ్ నేర్చుకోవడంతోపాటు ఆంధ్రప్రభ ఆఫీసుకి అందులోనే వెళ్తుండేవారు. అంతేకాదు. కుటుంబసభ్యులను సన్నిహితులను కారులో తీసుకువెళ్ళి మద్రాసు నగరమంతా తిప్పుతుండేవారు. ముఖ్యంగా చెన్నై శివార్లలోని మాంగాడులో ఉన్న అమ్మవారి గుడికి తన కారులో తీసుకువెళ్తుండేవారు. 
మాంగాడు అనేది రెండు మాటల కలయిక. మాంగా అంటే మామిడి అని, కాడు అంటే అడవి అనే అర్థం. తమిళంలో కా అక్షరాన్నే  గా అని కూడా పలుకుతారు.ఇక్కడ ఉన్న అమ్మవారు కామాక్షి. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసి కాంచీపురం  ఏకాంబరేశ్వ రుడిని వివాహమాడినట్లు స్థలపురాణ గాథ. ఆదిశంకరులవారు ఇక్కడికి వచ్చి అర్ధమేరు చక్రాన్ని స్థాపించారు. ఇక్కడి కామాక్షి అమ్మవారి ఆలయం చోళుల కాలంనాటి నిర్మాణ శైలికి అద్దంపడుతుంది. ప్రవేశ ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడి అమ్మవారిపై ప్రముఖ సినీ రచయిత వీటూరి ఓ శతకం కూడా రాశారు.
ఇంతలో ఆయనకు హైదరాబాదుకు బదిలీ అయింది. దాంతో ఓ మెకానిక్కుకి అయిదు వందల రూపాయలు ఇచ్చి మద్రాసు నుంచి హైదరాబాదుకి చేరుకున్నారు. అయితే దానికి మరమ్మతులు తరచూ రావడంతో ఇక లాభం లేదనుకుని పదిహేను వేలకు అమ్మేశారు.
ఆ తర్వాత మారుతీ కారు కొన్నారు. దాని ధర నలబై వేలు. నిజానికి అది ముప్పై వేలే అయినప్పటికీ దానికి పెయింట్ వేసి కబుర్లు చెప్పి నలబై వేలకు అమ్మగా కొనేసుకున్న నరసింహారావు ఆ కారును కొంత కాలం నడిపి రిపేరుకి రావడంతో బాగు చేయించుకోవడం కన్నా అమ్మేసి మరొకటి కొనాలనుకున్న ఉద్దేశంతో దానిని పదకొండు వేలకు అమ్మేశారు.
ఇక వరుణ్ మోటర్స్ వారి దగ్గర మారుతీ 800 కారుని యాబై వేల రూపాయలైతే వాడి మాటలకు పడిపోయి అరవై అయిదు వేలకు కొన్నారు. ఆ కారునీ కొత కాలం నడిపిన నరసింహారావు ఇప్పుడున్న సాయినాథపురంలోని అపార్టుమెంట్లో తమ పార్కింగ్ ఏరియాలోకి సైతం కారు పార్క్ చేయడానికి ఎవరో ఒకరి సాయం తీసుకోవలసి వస్తుండేది. ఒక్కొక్కప్పుడు ఆలా సాయం కోరినప్పుడు ఒకరిద్దరు విసుక్కున్నారు కూడా. పైగా స్పాండలైటిస్ తో కారుని ఫ్రీగా నడపలేని స్థితికొచ్చారు. ఇక లాభం లేదనుకుని దానిని ఇరవై వేలకు అమ్మేశారు. ఇలా మూడు కార్లతో కథ నడిపించిన ఆయన ఆ తర్వాత స్కూటరు మీద ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ అది కూడా ఇప్పుడు మానేశారు. అనుకోని రోడ్డు ప్రమాదంతో పిల్లలు ఇక బండి నడపడానికి వీల్లేదని గట్టిగా చెప్పడంతో బండి జోలికి వెళ్ళడం మానేశారు. అంతేకాకుండా ఆ స్కూటరుని మనవరాలికి ఇచ్చేసారు. 
కొసమెరుపేమిటంటే ఇప్పుడసలు కారు టాపిక్ వచ్చినా మాటలు తప్పించేసి ఆధ్యాత్మికంవైపు మళ్ళిస్తున్నారాయన. ఏదైనా ఎవరికైనా ఒకప్పుడు ఒకదానిమీదున్న ఆసక్తి కాలక్రమంలో తగ్గిపోయి మరొకదానిమీద ఇష్టం ఏర్పడటమంటే ఇదేనేమో.కామెంట్‌లు