సునంద భాషితం ;-వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు--2
అంగార న్యాయము
   ******
అంగారము అంటే బొగ్గు.
మరి అంగార న్యాయము అంటే..ఈ అంగారాన్ని వేడిగా ఉన్నప్పుడు ముట్టుకుంటేనేమో కాలుతుంది. చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటేనేమో చేతి నిండా మసి అంటుతుంది.అయినా అలా అంటుతుందని అంగారమును వదిలేయలేము.
ఇంట్లో వంటకు,ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు విద్యుత్ ఉత్పత్తికి ఇంకా అనేక రకాలైన వస్తువుల తయారీలో అవసరాలలో ఉపయోగించే ముఖ్యమైన ఖనిజము అంగారమే.సింగరేణి , రామగుండం థర్మల్ విద్యుత్తు పవర్ ఇచ్చి ఇళ్ళలో వెలుగులు నింపేది ఈ అంగారమే.
అందుకే అంగారాన్ని "నల్ల బంగారం" అని కూడా అంటారు. మసి అంటినా,కాలినా పట్టించుకోకుండా వాడుకోవడమే అంగార న్యాయము.
"తలలో నాలుకలా" అందరికీ సాయం చేసే వ్యక్తిలో  ఏవో ఒకటి రెండు ఇబ్బంది లేని దోష గుణాలు ఉన్నా, ఉపయోగపడే మంచి మనసునే గుర్తించాలి.అంగారం లాంటి వ్యక్తి అనుకోవాలి. మరి అంగార న్యాయము అంటే ఇదే కదా.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు