ఆధార్ సమాచారానికి సన్నగిల్లిన భద్రత--: సి.హెచ్.ప్రతాప్
 ఆధార్ కార్డు వినియోగంపై, డేటా గోప్యతపై తొలి నాటి నుండి ఎన్నో సందేహాలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నా వాటిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ వచ్చింది.కిందటి సంవత్సరం డేటా వివిధ సంస్థలకు చేరడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ లో ఆధార్ సర్వర్ లో సమాచారం అత్యంత గోప్యంగా వుంటుందని, దుర్వినియోగం  అవడానికి  ఎటువంటి అవకాశమే లేదని అఫిడవిట్ లో కూడా పేర్కొంది. దేశంలో వివిధ కోర్టులలో దాఖలైన ఇతర పిటిషన్ లో ఆధార్ డేటా గోప్యతపై పలు భయాందోళనలు వ్యక్తం కావడం సర్వసాధారణమై పోయింది.ఒక పక్క ఆధార్ ఏ మాత్రం తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్నా,ఆచరణలో మాత్రం ఆధార్ కార్డు లేక నెంబరు లేనిదే రోజు గడవని పరిస్థితిని మన ప్రభుత్వాలు తీసుకువచ్చాయి.
ఈ నేపథ్యంలోనే మే 27వ తేదిన యుఐడిఎఐ జారీ చేసిన హెచ్చరిక దేశ వ్యాప్తంగా కలకలం రేపి, ఆధార్‌ వినియోగంపై ప్రజానీకంలో ఉన్న భయాలను రెట్టింపు చేసింది. సాధారణ ఆధార్‌ కార్డుకు బదులు మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును మాత్రమే ప్రజలు వినియోగించాలని సూచించింది. మాస్క్‌డ్‌ కార్డును వాడటం వల్ల దుర్వినియోగానికి అసలు అవకాశం ఉండదని, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం సాధ్యమవుతుందని పేర్కొనడం సంచలనం రేపింది. పూర్తి నంబర్‌తో పాటు ఇతర వివరాలు నమోదైన సాధారణ ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీలనే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ప్రజానీకం వాడుతండటంతో దేశ వ్యాప్తంగా గగ్గోలు ప్రారంభమైంది. భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ హెచ్చరిక ద్వారా ఆధార్ లోని డేటా గోప్యత గాలిలో దీపం చందాన వుందన్న పరోక్ష సంకేతాలు పంపినట్ట్లయ్యింది. ఆధార్ డేటాతో పాటు వివిధ బ్యాంకులు, టెలికం సంస్థలకు ప్రజలు సమర్పించే కె వై సి వివరాలు కూడా దుర్వినియోగమౌతున్న సంఘటనలు కోకొల్లలు..   ఈ సమాచారాన్ని ఉపయోగించే బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని కూడా స్వాహా చేయడం,బయోమెట్రిక్ లను చౌర్యం చెసి ఆర్ధిక సహాయాన్ని కొట్టేయడం వంటి వైట్ కాలర్ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి.ప్రజల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి బధ్రత లేదన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమౌతొంది. బ్లాక్ చెయిన్ వంటి ఆత్యాధునిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఆధునిక దేశాలలో డేటా పై గుప్తత పాటిస్తుండగా మన దేశంలో మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన పరిస్థితి వుంది.  ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా కాపాడటం, వారి గోప్యత హక్కుకు భంగం కలిగించకుండా చూడటం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత! ఇప్పటికైనా ఆధార్‌ డేటా దుర్వినియోగం చేయడాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి. ఆ దిశలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి  

కామెంట్‌లు