ఇది పూర్తిగా రైతులకు సంబంధించింది. తమ వ్యవసాయానికి బాసటగా నిలిచి, తమకు ఎనలేని సేవలు అందించిన పశువులను గౌరవించే పండుగ-కనుమ లేక పసుల పండుగ. సర్వము వాసుదేవ స్వరూపమే, అనే మహోన్నత సిద్ధాంతాన్ని ఆచరించి చూపే తత్వనిధి ఈ పండుగ. ఈ ఏర్పాటు చేసిన మహాత్ముడు చిర స్మరణీయుడు. మునుపటి కాలంలో గోథనమే దేశానికి నిజమైన ధనం. అందుకే చాలా భాషల్లో పశువుల్ని సొమ్ములని, ధనం అని అంటారు.
ఈరోజు రైతులు ఉదయాన్నే లేచి, పశువుల కొట్టాల ముందు పాలు పోసి పొంగళ్ళు వండుతారు. పశువుల్ని శుభ్రంగా కడిగి, ముఖాలకు, కొమ్ములకు, తోకలకు, గిట్టలకు పసుపు కుంకుమ పెడతారు. పూల హారాలు వేస్తారు. పాల పొంగలి , పశువుల పొంగలి అంటూ గట్టిగా కేకలు వేస్తారు. ఆ పొంగలి దేవతలకు నైవేద్యం పెట్టాక, కొంత పశువులకు తినిపించి, కొంత భాగంలో కుంకుమ పసుపు కలిపి ఆ అన్నాన్ని పొలాలలో చల్లుతారు. అందువల్ల దుష్ట శక్తులు దూరమై పంట పొలాలు బాగా పంటనిస్తాయని నమ్మకం.
గంగిరెద్దుల ఆటపాటలు సాయంకాలం ఉంటాయి. గ్రామాలలో ఎద్దుల పోటీలు, కోడి పందాలు, పొట్టేళ్ల పందేలు, పశువుల ఊరేగింపులు జరుపుతారు.
వ్యవసాయ దారుడికి పశువులే సంపద. వాటి శ్రమ ద్వారా పంట చేతికి వచ్చిన సంక్రాంతి సమయంలో కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండి పెట్టే ఆచారం ఏర్పడింది. పంటలు పండేటట్టుగా చేసే భగవంతునికి, పొలాన్ని దున్నే ఎద్దులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపే మంచి పండుగ ఇది.
సంక్రాంతి మూడో రోజు కనుమ పండుగ. అంటే పశువుల పండుగ. మకర సంక్రాంతి మరునాటి పండుగ కనుమ పండుగ.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి