పుస్తకసామ్రాజ్యంలో మధురానుభూతి!!;-- యామిజాల జగదీశ్
 పుస్తకాలు, పుస్తకప్రేమికుల మధ్య గడపటం నిజంగా ఓ పండగే. ఓ ఉత్సవమే. ఓ సంబరమే. ఆ ఆనందం చిదానందం! మహదానందం! సదానందం! 
హైదరాబాదులో ముప్పై అయిదేళ్ళుగా నిర్వహిస్తున్న పుస్తకప్రదర్శనలో ఓ ఇరవై సార్లయినా మిస్సవకుండా వెళ్ళి ఉంటాను. వెళ్తున్న ప్రతిసారీ ఓ కొత్త అనుభవమే. ఈసారి రెండుసార్లు సందర్శించాను. మొదటిసారి 2022 డిసెంబర్ 24న. రెండోసారి డిసెంబర్ 31న. అయితే తొలిసారికంటే మలి సందర్శన మాటలకతీతమైన ఆనందాన్ని ఆస్వాదించాను. 
పుస్తకాలు కొనగలిగే స్థోమత లేకపోయినప్పటికీ పుస్తకాల కడలి మధ్య ఎన్నెన్నో ఆశలతో ఎన్నెన్నో అనుభూతులతో గడుపుతూ పరిచయస్తులను సన్నిహితులను కనిపిస్తే పలకరించడం మహదానందం. అదొక తృప్తి. 
అంతకుముందెన్నడూ పుస్తక ప్రదర్శనకు వెళ్ళని కె. భాస్కరరావుతో కలిసి వెళ్ళి ఓ రెండు వరుసలలో ఉన్న పుస్తకాలయాలను సందర్శిస్తూ కబుర్లాడుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ వస్తుంటే ముందుగా మా అన్నయ్య ఆనంద్ కనిపించాడు. ఓ రెండు కబుర్లు చెప్పి ముందుకెళ్ళగా ప్రముఖ పరిశోధకుడు, రచయిత, ఒకనాటి ఉదయంలో మా సహోద్యోగి సంగిశెట్టి శ్రీనివాస్ కనిపించడంతోనే మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆయనతో కబుర్లు చెప్పి ఫోటోలు తీయించుకుంటుంటే మళ్ళా ఆనంద్ కలిశాడు. మళ్ళీ ముచ్చట్లు. ఫోటోలు. తెలంగాణ కథ - 2021 కథల పుస్తకం "నెనరు" ఇచ్చారు సంగిశెట్టి. అక్కడే ఆనంద్ ఓ పుస్తకం ఇచ్చాడు గాయకుడు పి. బి. శ్రీనివాస్ గారి కుమారులు ఫణిందర్ గారికొక పుస్తకం ఇవ్వమని ఇటీవల ఆవిష్కృతమైన 182 మంది కవుల చేతిరాతల కవితా సంకలనం పుస్తకం ఇచ్చాడు. 
అనంతరం నేనూ భాస్కర్ మరో వరుసలోకి నడిచి వెళ్తుంటే నంబూరి రామలింగేశ్వరరావు ( రాము) మాతో కలిసారు. ఆయనతో కబుర్లాడుతూ పుస్తకాలు చూస్తూ వెళ్తుంటే తెలంగాణా మాసపత్రిక అసోసియేట్ ఎడిటర్ , రచయిత, ఉదయం సహోద్యోగి జగన్ రెడ్డి కనిపించారు. జగన్ తెలంగాణా గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఫోటోలు తీసుకున్నాం. ఎంసిజె చదువుకుంటున్న రోజుల్లో సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణగారు జర్నలిజానికి సంబంధించిన చెప్పిన పాఠం తీరు జగన్ చెప్తుంటే విని ఆనందించాను. ఒకటికి రెండు సార్లు అడిగాను కృష్ణగారు పాఠాలు చెప్పేవారా లేక ఏదో ఒకటి చెప్పేవారా అని! బలే వారంటూ ఆయన ఎలా పాఠాలు చెప్పారో గుర్తుచేసుకున్నారు. ఫోటోలు తీసుకున్నాం నలుగురం.
ఇంతలో సీనియర్ పాత్రికేయులు రచయిత కల్లూరి భాస్కరంగారు కలిశారు. ఆయనతో ఫోటోలూ మాటలూ సాగాయి ఆనందంగా. 
తర్వాత నేనూ భాస్కర్ రాము కలిసి మాటలు చెప్పుకుంటూ వెళ్తే బాలగోపాల్ గారి పుస్తకాలయం కనించగా అక్కడ వసంతలక్ష్మి గారు ఉన్నారు. ఈవిడకూడా పాత్రికేయురాలే. రచయిత్రికూడా. ఆవిడ ఉదయంలో ఎలా పని చేసేవారో మొదటి పేజీ ఎలా తీర్చి దిద్దేవారో గుర్తు చేశాను. ఆవిడ పని తీరు బలే ఆశ్చర్యంగా ఉండేది అప్పట్లో. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకున్నాం. త్రిపురనేని శ్రీనివాస్ రాసిన కవితా సంపుటి ఒకటి కొన్నారు రాము. 
అటు నుంచి ఓ పుస్తకాల దుకాణంలోకి అడుగు పెట్టాం. అక్కడ రాము కొన్ని పుస్తకాలు కొనుక్కుని నన్నొక పుస్తకం తీసుకోమంటే  సుస్మితగారి "మంచి వెన్నెల వేళ" అనే పుస్తకం తీసుకున్నాను రాము కానుకగా! ఐఒసి ఉన్నతాధికారి ఒకరు ఇంగ్లీషులో హిందీ చలనచిత్ర నేపథ్య గాయకుడు కిశోర్ కుమార్ పై రాసిన జీవితచరిత్ర పుస్తకాన్ని రాము కొనుక్కున్నారు. రచయిత సంతకం చేసి రామూకిచ్చిన పుస్తక సన్నివేశాన్ని ఫోటో తీశాను.
"ఉదయం" పత్రికలో ఒకానాకప్పుడు పని చేసిన వారిలో ఓ నలుగురైదుగురే కలిసినా ఎంత ఆనందంగా ఉందో మనసుకి. మనసు తేలికై గాల్లో ఎగిరినట్టనిపించింది. 
చివరగా బయటకు వస్తూ వస్తూ కవి అలిశెట్టి ప్రభాకర్ ఫోటోతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ముందర నిల్చుని నేనూ రామూ భాస్కర్ ఫోటోలు తీసుకున్నాం. 
అదంతా అలా ఉంచితే కవి యాకూబ్ కూడా కనిపిస్తే కరచాలనం చేసి మాట్లాడాను. ఫోటోలు తీసుకున్నాను. 
ఇక ఓ అంగడిలో ఘంటసాలగారి శతవసంతాల పుస్తకంలో మా నాన్నగారి ఫోటో ఉంటే రామూతో తీయించడం మరచిపోలేని అంశం.
మొత్తం మీద ఈసారి పుస్తకప్రదర్శన సందర్శనం ఓ గొప్ప మధురానుభూతిని మిగిల్చింది. 
పుస్తకమా నీకు సలామ్!!కామెంట్‌లు