ప్రకృతి ధర్మం : సి.హెచ్.ప్రతాప్
 అఖిల ప్రపంచంలో ఈ సృష్టే మహోత్కృష్టమైనది. అందులో మానవ జన్మ అత్యున్నతమైనది. ఎన్నో వేల జన్మలలో ఎంతో పుణ్యం చేసుకొని వుంటే కాని, ఈ దుర్లభమైన మానవ జన్మ లభించదని సకల శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.అంతటి మహోన్నతమైన ఈ మానవ జన్మ మనుగడకు ఆ భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదమే ఈ ప్రకృతి. వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఆ ప్రకృతే ఈ మనిషిని సంరక్షిస్తూ వస్తోంది. మనిషి ఈ ఆధునిక సమాజంలో నిండు నూరేళ్ళు నవ్వుతూ వుండాలంటే పరిపూర్ణ ఆరోగ్యంతో వుండాలి.  మానవులందరికి మార్గదర్శి ఈ ప్రకృతిమాతే. సకల జంతుజాలమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రకృతితో మమేకమై జీవించే జంతుజాలం ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడిన దాఖలాలు లేవు. అదే ప్రకృతిని విస్మరించడంతో పాటు ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా జీవించే మానవుడు నేడు అనేక భయంకర అనారోగ్యాలకు గురవుతు మానసికంగా, శారిరకంగా చిత్రవధ అనుభవిస్తున్నాడు.
ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి. మనల్ని పోషిస్తుంది, మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, మనం ధరించే బట్టలు, మనం నివసించే ఇల్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన బహుమతిగా మనం పరిగణించాలి.
దానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఇక మన దేశానికి వస్తే, సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తి చెందినప్పుడు, ప్రకృతిని, సకల జీవకోటిని ధర్మంలో మమేకం చేశారు.ఆగ్నికి ఒక దేవతా మూర్తిని, మట్టికి, గాలికి, నీరుకి అన్ని భూతాలను దేవుడిలా కొలిచేవారు.పంటలు నాశనం చేసే ఎలుకలను చంపే పాములను నాగరాజులుగా కొలిచారు. గ్రద్దలను గరుత్మంతుడులా, శరీరానికి ఉపయోగ పడే వేపని అమ్మవారిగా, ప్రతీ జీవిలోనూ దైవత్వము ఉందని చెప్పారు. “వృక్షో రక్షతి రక్షితః” అని నొక్కి వక్కాణించారు.
 ఈ ప్రకృతి ధర్మం అందరిది, మనందరిది. ఆరోగ్యం మన మనస్సుకు సంబంధించింది. మనస్సు మనిషికి సంబంధించింది. మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం వుంది. ఇది జన్మ జన్మల పెనుబంధం! ఆ అనుబంధం నుంచి విడిపోయిన వాడే అనారోగ్యవంతుడు. కాబట్టి ప్రకృతి ధర్మాలకు లోబడే మానవులు జీవించాలన్న విషయం స్పష్టం అవుతోంది.

కామెంట్‌లు