వొట్టి తెల్లకాగితాలపై
అక్షరాలు పేర్చి
ముద్రించడంతో
పుస్తకం
పనైపోయిందనుకోవడానికి
వీల్లేదు !
పుస్తకం కొందరిని
రెక్కలవసరం లేకుండానే
ఆకాశంలో ఎగరనిస్తుంది !
పుస్తకం కొందరికి
రూట్ మ్యాపులా
ఎటు పోవాలో
దారి చూపిస్తుంది !
పుస్తకం కొందరికి
లైట్ హౌసులా నమ్మకం
కల్పిస్తుంది !
కాగితాన్ని ముద్దాడే మాటలు
ప్రేమను వెల్లడిస్తాయి!
హత్తుకుని పరవశింప చేస్తాయి!
సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి!
గాయాలకు ఔషధమై నయం చేస్తాయి!
అక్షరాల కూర్పుకున్న శక్తి
గణనీయం!!
మాట
విత్తనమై మొక్కై మానై
నీడై తోడవడం
ఓ అద్భుత ప్రక్రియ !!
ఓ మాట వయస్సుని
మనం తెలుసుకోవడం
అంత తేలిక కాదు !
చదివే ప్రతి ఒక్కరూ
పుస్తకంతో మమేకమై
కొత్త రూపమెత్తుతారు !
అందుకే అంటాను
అక్షరాలన్నింటినీ
అక్కున చేర్చుకున్న
పుస్తకం సామాన్యమైంది కాదు,
అదొక మేజిక్కు!!
ఆ మేజిక్కుతో పొందే
ఆనందం వల్లే
పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ
చదువుతుంటాం !!
తరిస్తుంటాం !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి