ప్రణవం పాఠకలోకానికి పిబిఎస్ అమూల్య కాన్క;- - యామిజాల జగదీశ్
 పుస్తకాలంటే నాకు శ్వాస. ధ్యాస. అవును. నాకవి అంతేమరి. అటువంటి పుస్తకాల ప్రపంచంలో చేతిరాతతో వెలువడిన పుస్తకాలు కొన్ని అప్పుడప్పుడూ చూడకపోలేదు. ఇటీవల 182 మంది తెలుగు కవుల చేతిరాతల కవితా సంకలనం " పొయట్రీ వర్క్ షాప్ " అనే శీర్షికతో ఓ పుస్తకం వెలువడింది. అందులో ప్రముఖ గాయక, కవి శిఖామణి పి. బి. శ్రీనివాస్ గారి కవిత కూడా ఉంది. ఆ పుస్తకం వారి కుమారుడు పి.బి. ఫణీందర్ గారికి ఇవ్వడానికి పాత్రికేయ మిత్రుడు కె. భాస్కకర రావుతో కలిసి వెళ్ళాను. పి.బి అంటే ప్రతివాద భయంకరం ఇంటిపేరు. ఈ ఇంటిపేరు గురించి నేనప్పుడూ ఆలోచించలేదు. కానీ మిత్రుడు భాస్కర్ దాని గురించి ప్రస్తావిస్తూ అది మన తెలుగివారి ఇంటి పేరులా లేదనడంతో కాదు వారు తెలుగువారే అన్నాను. కానీ ఎందుకైనా మంచిదని ఫణిందర్ గారితో మాట్లాడితే మీ మిత్రుడు చెప్పిందే కరెక్టు అన్నారు. వారి మూలాలు కాంచీపురం దగ్గర ముడుంబై అని చెప్పారు. ఆరు వందల సంవత్సరాల క్రితం వారు ఆంధ్రప్రాంతానికి వలసపోయారు. తాము శ్రీవైష్ణవులమేనని (తమిళంలో అయ్యంగార్ అని అంటారు) స్పష్టం చేశారు. ఫణిందర్ గారు. అదలా ఉండనిస్తే మాటల ప్రస్తావనలో తమ తండ్రిగారి ప్రణవమ్ పుస్తకం చూపించారు. ఈ పుస్తకం నన్ను అమితాశ్చర్యపరచింది. కారణం పుస్తకం మొత్తమూ చేతిరాతలతోనే సమకూర్చడం. పి.బి. శ్రీనివాస్ గారి రచనలే కాకుండా ఆయనకు అభినందనలు ఆశీస్సులు అందించిన వారి మాటలనూ వారివారి చేతిరాతలతోనూ వారి సంతకాలతోనూ అలంకరించడం అమోఘం. పైగా ముఖచిత్రం నన్ను అమితంగా ఆకట్టుకుంది. అష్ట భాషలలో శ్రీనివాస్ గారు రాసిన కవితలతో దీనిని ముస్తాబు చేయడం ఓ విశేషమే.
ఈ ప్రణవమ్ పుస్తకం సందర్భంగా పి. భానుమతీ రామకృష్ణగారు రాస్తూ
"మధురగాయకుడూ, సహృదయుడూ, బహుభాషా కవిపుంగవుడూ సోదరుడు పి.బి. శ్రీనివాస్ యొక్క ప్రతిభావంతమైన యీ సాధన అమోఘవిజయం పొందాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ విజయీభవ" అని ఆశీర్వదించారు.
ఇక ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ 
"పలికెడిది ప్రణవమట
పలికించెడి వాడు శ్రీనివాసుడట
అన్న రీతిగా గానకళా సార్వభౌములు డాక్టరు పి.బి. శ్రీనివాస్ గారి రచన ప్రణవమ్ – అలాంటి అపురూపమైన రచనపై నేను అభిప్రాయం తెలియపర్చటం దుస్సాహసం. అర్హత లేదు. ఆకళింపు చేసుకునే మెదడు కూడా లేదు. అందుకే శ్రీనివాసు గార్కి రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తున్నాను. ఆయన కృషి పండితలోకం వేనోళ్ళ ప్రశంసిస్తుందన్న ప్రగాఢ విస్వాసంతో " అని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
విశ్వేశ్వరరావు (విశ్వశాంతి) గారు తమ అభిప్రాయ లేఖలో "మనది అరువై నాలుగు (64) కళలు. వాటిని గురించి భారతీయ కళలు అనే వ్యాసం ద్వారా ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణులు డాక్టరు చిట్టూరి సత్యనారాయణగారు ప్రపంచ తెలుగు సమాఖ్య ద్వితీయ మహాసభల ప్రత్యేక సంచికలో వివరించారు. ఒక్కొక్క భాషలో 8 కళల వంతున 8 భాషలలో ప్రఖ్యాత నేపథ్య గాయకులు, నా చిరకాల మిత్రులు పి.బి. శ్రీనివాస్ గారు "ప్రణవం" అనే పేరుతో గేయకవితా రచన చేసారు. ఆ ప్రణవం మన చుట్టూ వున్న ఒక ఉద్యానవనంలాంటిది. ఆ ఉద్యానవనంలోని రకరకాల పుష్పాలు లాగా రకరకాల కళల వివరణ మనముందుకు తీసుకొచ్చిన నా మిత్రుడిని నేను మనసారా అభినందిస్తున్నాను" అన్నారు.
పి.బి. శ్రీనివాస్ ప్రతిభాపాండిత్యాలను ప్రశంసించిన వారిలో లతా మంగేష్కర్, చినజీయర్ స్వామి, జిక్కి, దర్శకుడు ఎస్పీ. ముత్తురామన్, డాక్టర్ సి. సత్యనారాయణ, దాశరథి రంగాచార్యులు (ఉర్దూలో), సంగీత కళైమామణి డాక్టర్ శివచిదంబరం‌, నేపథ్య గాయని చిత్ర, కొంగర జగ్గయ్య, టి.ఎస్. బాలకృష్ణశాస్త్రి తదితరులున్నారు.
ఈ పుస్తకం గురించీ చెప్తూ పి.బి. శ్రీనివాస్ గారు "సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం, ఉర్దు, హిందీ, ఇంగ్లీషు భాషలలో రచించిన బహు సహస్రాధిక వర్ణ కవితా ప్రసూన్తాలల్తో కొన్నింటినెంచి, ఇత:పూర్వమే నాలుగు భిన్న చిన్న పొత్తాలను ప్రచురించడం జరిగింది. ప్రణవం అనే శీర్షికతో వెలువడుతున్న ఈ కవన సంగ్రహం, ఎనిమిది భాషలలోనూ సాగిన ప్రత్యేక రచనల సంకలనం అని ఆయన తమ ముందుమాటలో పేర్కొన్నారు. ఈ విషయాన్నిసైతం ఆయన ఎనిమిది భాషలలో రాసారు.
బహుభాషలలో పాటలు పాడి మధుర గాయకుడిగా పేరుప్రఖ్యాతులు గడించిన బహుభాషా కోవిదుడు పి.బి.శ్రీనివాస్ ఎనిమిది భాషలలో కవి కావడం విశేషం. 
దాదాపు మూడున్నర లక్షల కవితలను రాసి వాటిని స్వరపరచిన పిబిఎస్ నూతన ఛందః సృష్టికర్త. 
ఇంగ్లీష్ గానం చేసిన తొలి తెలుగు గాయకుడిగా ఖ్యాతి పొందిన ఈయనను అమెరికా మాజీ  అధ్యక్షుడు నిక్సన్, చంద్రుడిపై కాలు మోపిన ఆంస్ట్రంగ్ ప్రశంసించారు. అందుకున్న కవి-గాయకులు పి.బి.శ్రీనివాస్.
 పిబిఎస్ అష్టభాషా కవితా సంకలనం "ప్రణవం" ప్రపంచంలోనే తొలి‌ అష్టభాషా కావ్యమవడం విశేషం.
భాషకు ఎనిమిది చొప్పున ఎమినిది భాషలకూ ఎనిమిది‌ వేఱు వేఱు ఇతివృత్తాల కవితలను ఈ ప్రణవంలో పొదిగారు. 
ఒక్క ఆంగ్ల భాషకు తప్ప మిగిలిన ఏడు భాషల కవితలను ఇంగ్లీష్ లిపిలో రాస్తూ,‌ వాటి ఆంగ్లానువాదాన్ని ఆయనే సమర్పించారు. 
ఎనిమిది భాషలలోనూ ఆయన చేతిరాతను చూడవచ్చు. ప్రపంచ సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నం, ప్రయోగమూ ఇంకెక్కడా చేసినట్టు నా ఎరుకలో లేదు. ఇదొక అద్భుత సృష్టి.
అలాగే తమకు పరిచితులైన కొందరు ప్రముఖుల గురించి కూడా పిబిఎస్ ఇంగ్లీషులో పేర్కొనడం గమనార్హం.
ప్రముఖ నటులు టి.ఎల్. కాంతారావుగారు చెప్పినట్లు పిబిఎస్ గారి వేషధారణ ప్రత్యేకం. ఆయన మా ఇంటికొచ్చిన ప్రతిసారి ఓ కొత్త టోపీ పెట్టుకునే వారు. జేబు నిండా కొన్ని పెన్నులుండేవి. చేతిలో పుస్తకాలు సరేసరి. ఆయన పెన్నులలో ఒకటి ఫణిందర్ గారి దగ్గరుంది. ఆ పెన్ను SHEFFER. ఈ పెన్నుతోనే ఆయనకిచ్చిన పొయిట్రీ వర్క్ షాప్ పుస్తకంలో నా సంతకం చేసిచ్చాను.
ఆయన రాసిన కవితలను మా నాన్న యామిజాల పద్మనాభ స్వామిగారికి చూపించి రాగయుక్తంగా ఆలపించి వినిపించిన సందర్భాలలో నేను పక్కనే ఉండటమే కాక ఒకటి రెండుసార్లు నాకిష్టమైన పాటలు పాడించుకోవడం నా భాగ్యమే. 
ప్రణవం పుస్తకం ఇప్పుడు అందుబాటులో లేదు. ఎక్కడైనా దొరికే అవకాశం ఉందాని అడిగితే ఫణిందర్ గారిచ్చిన జవాబు....
AAKRUTHI DOESN'T HAVE ANY BOOKS..THEY JUST HELPED IN RELEASING THE BOOK..AND IT WAS NOT GIVEN FOR SALE TO ANYBODY AS WE WERE PUBLISHERS. INFACT WE HAD AN IDEA TO REPRINT 2 ND REVISED EDITION..!!! ప్రణవం రివైజ్డ్ ఎడిషన్ కోసం ఎదురుచూస్తున్నాను.


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం