సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు -18
ఉలూఖల శేషన్యాయమ
******
ఉలూఖలము అంటే తెలిసిందే రోలు అని. శేషము అంటే మిగిలినది అని అర్థం.
రోటిలో ఏదైనా దంచితే మిగిలినది చేతితో రాదు కదా!.అందులో తలదూర్చి నాకడాన్ని గురించి వ్యంగ్యంగా లేదా హాస్యంగా చెప్పుకునే న్యాయమునే ఉలూఖల శేష న్యాయము అంటారు.
 దీనికో హాస్య కథ ఉన్నది. ఓ కొత్త అల్లుడు అత్తాగారింటికి వెళ్ళాడు.వాళ్ళు చాలా మర్యాదలు చేశారు.రకరకాల పిండివంటలతో పాటు పప్పు బెల్లంతో కలిపి రోట్లో దంచి చేసిన భక్షం కూడా పెట్టారు.ఆ  భక్షం బాగా నచ్చింది కానీ మొగమాటముతో అత్తగారు పెట్టినవి  తినడానికి బెట్టు చేస్తాడు. కానీ మనసులో తినాలని కోరికేమో బలంగా ఉంది. మనసు ఆగక ఎవరూ లేనిది చూసి రోటిలో తలదూర్చి అందులో దంచగా మిగిలింది నాకాడట.
అది గమనించిన వాళ్ళు సరదాగా, హాస్యంగా చెప్పుకునే న్యాయమునే ఉలూఖల శేష న్యాయము అంటారు.
ఇలా మొగమాటంతో కొన్నింటిని పైకి లేనిపోని గాంభీర్యాన్ని చూపిస్తూ,అది తన గొప్పనుకొని వద్దన్నా  లోలోపలి కోరిక మాత్రం ఆగనివ్వదు.
అదిగో అలాంటప్పుడే ఇష్టమైన వాటిని ఎవరూ చూడకుండా తినడం, నచ్చినట్లు చేయడం చూస్తుంటాం.అలా చేసిన వారిని రహస్యంగా గమనించిన వాళ్ళు ఇలా వెక్కిరింపుగా, సరదాగా అనుకునే న్యాయమే ఉలూఖల శేష న్యాయము.
ఇలాంటివి మన నిత్య జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాం.ఒకోసారి అందులో మనం కూడా ఉంటాం.అలాంటప్పుడు ఈ న్యాయాన్ని గుర్తు చేసుకుందాం.ఇక పెదవులపై చిరునవ్వు విరియకుండా వుంటుందా!?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు