మదిలో మెదిలే భావాలను
అక్షరాలుగా మార్చి
ఊహల పల్లకీ ఎక్కించి
అందమైన ప్రదేశాల చుట్టూ
ఊరేగించి మురిసిపోయే
మనసు నాది
మల్లెతీగలో గుత్తులుగా
విరిసిన మల్లెల పంచే
పరిమళాలను..
గుండెనిండా పీల్చి
అనిర్వచనీయమైన
ఆనందం పొందే
అల్ప సంతోషిని నేను.
సుదూరతీరాల నుండీ
గాలి మోసుకొచ్చే ఆపాత
మధురాల ఆలకించి
చిన్నప్పటి నేస్తాన్ని
కలిసినట్టు సంబరపడే
సంతోషం నాది
సన్నగా కురిసే వాన చినుకులు
తెచ్చిన మేఘసందేశం
చేతులతో అపురూపంగా
పట్టుకుని మనసు నింపుకనే
చిన్ని మనసు నాది
చంటిపాప నన్ను చూసి
బోసినోరంతా విప్పి నవ్వితే
పరమాత్మ దర్శనం అయినట్టు
భావించే భక్తి నాది.
మొగ్గలేసిన మొక్కలు చూసి
చల్లగ ఉదయించే
పగడాల జాబిలిని చూసి
తూర్పున వేకువలో విరిసే
నారింజరంగులు చూసి
అచ్చంగా నాకోసమే అవి
అనుకునే అతిశయం నాది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి