కోపం;-- యామిజాల జగదీశ్
 అనగనగా ఓ రాజు. అతను మహా కోపిష్టి. అది దుర్గుణమని తెలిసీ దాని నుంచి బయటపడలేక పోతున్నాడు. 
ఓ జ్ఞాని తన దేశానికి వచ్చాడని తెలిసింది. 
ఆయనను కలిసి కోపం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలనుకున్నాడు.
ఒక్కడుగా వెళ్ళి ఆ జ్ఞానిని కలిశాడు. తన లోపాన్ని చెప్పుకుని బయటపడే మార్గాన్ని చెప్పమన్నాడు రాజు.
రాజు చెప్పినదంతా విన్న జ్ఞాని "నా దగ్గర ఓ విచిత్రమైన గ్లాసు ఉంది. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఆ గ్లాసుని నీటితో నింపి తాగుతుండాలి. అలా మూడుసార్లు చొప్పున చేయాలి. క్రమంగా నీ కోపం తగ్గిపోతూ ఒకరోజు మొత్తానికే అది లేకుండా పోతుంది" అని ఆ గ్లాసు రాజుకిస్తాడు.
జ్ఞానికి నమస్కరించి వీడ్కోలు పొందిన రాజు ఆయన చెప్పినట్లే చేయడం మొదలుపెట్టాడు.
రోజులు పోయే కొద్దీ రాజు కోపం తగ్గడమే కాక శాంతస్వభావుడయ్యాడు.
కొంత కాలానికి ఆ జ్ఞాని మళ్ళీ తన రాజ్యానికి వచ్చినట్లు తెలిసి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళాడు. విషయం చెప్పి పాదాభివందనం చేశాడు.
అప్పుడే జ్ఞాని "రాజా! నీతో అబద్ధమాడటం ఇష్టం లేదు. నిజం చెప్తున్నాను. శ్రద్ధగా విను. నేను నీకిచ్చిన గ్లాసు మాయలతోనూ మంత్రాలతోనూ కూడుకున్నదేమీ కాదు. అది మామూలు గ్లాసే. ఎలాంటి ప్రత్యేకతా లేదు. కోపం వచ్చినప్పుడు మూడుసార్లు ఆ గ్లాసుని నింపి నీటిని తాగమన్నాను. అలా చేయడంవల్ల నీకు సమయం కలిసొస్తుంది. కోపం వచ్చినప్పుడు బుర్ర పని చేయదు. యథేచ్ఛగా మాటలు వచ్చేస్తాయి. ఏమంటున్నామో ఆలోచించం. కానీ కోపం తగ్గాక ఆలోచిస్తే ఎంత తప్పు చేసామో అని బాధపడతాం. మూడు సార్లు గ్లాసుని నింపి తాగమనడంవల్ల నీకు కొంత సమయం పడుతుంది. ఈలోపు నీకొచ్చిన కోపం క్రమేపీ తగ్గి ఆలోచించగలవు. ఎప్పుడు ఆలోచనంటూ మొదలవుతుందో అప్పుడక్కడ కోపం తగ్గుతుంది. మన ప్రవర్తన మీద నియంత్రణ ఉంటుంది. పట్టు కోల్పోము. అందుకోసం అలా చెప్పాను. అంతేతప్ప అదేమీ మాయ గ్లాసు కాదు" ఆన్నాడు.
మనకు కోపం వచ్చినా
లేక మనల్నెవరైనా కోపగించుకున్నా అది తగ్గించుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండి మనసుపెట్టి ఆలోచిస్తే తప్పొప్పులు తెలిసొస్తాయి. పరిపక్వతతో మెలిగే వీలుంటుంది. కోపంవల్ల దెబ్బతినేది ప్రశాంతత ఒక్కటే కాదు. ఆరోగ్యంకూడానూ అని తెలుసుకోవాలి. కనుక కోపానికి తావివ్వక ప్రశాంత చిత్తానికి ప్రాధాన్యమివ్వాలి.

కామెంట్‌లు