మనసుకు వసంతం వచ్చేవేళ
చీకటి తొలగి పొద్దుపొడిచే వేళ
వెల్లువెత్తిన చెలిమిరాగాలు
హృదయవనంలో ప్రతిధ్వనించేవేళ
కోతకొచ్చిన పైరులు గాలితో సయ్యాటలాడేవేళ
ఫక్కున నవ్వే పచ్చటిపూలు
ముచ్చటగ విరబూసే వేళ
కోయిల పాటకు గువ్వల జంటలు
గొంతుకలిపి పాడే వేళ
మంద్రంగాకురిసే మంచు జల్లుల
ముత్యాల పేటలై మెరిసేవేళ
పాలసంద్రపు పరవళ్ళలా
పసిడి వెలుగులు పరచుకునే వేళ
రాబోయే వెచ్చని క్షణాలకోసం
అవని ఆత్రంగా నిరీక్షించే వేళ
ప్రకృతి కట్టిన పచ్చని చీరకు
పసిడి మెరుపుల అందాలు అద్దే వేళ
మోయలేని హాయితో
మనసు పరిమళించే వేళ
కోటి కలలు సాకారం చేయడానికి
కొత్త క్షణాలను కొంగున కట్టుకుని
మనకోసం వస్తున్న ఉదయానికి
సీతాకోకచిలుకలల్లే హాయిగా
సందడిచేస్తూ....సరాగాలు పాడుతూ
స్వాగతిద్దాం కొంగొత్త వేకువను
శుభాకాంక్షలతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి