గుర్తుకొస్తున్నాయి;-సత్యవాణి

  వారు వెళ్ళీవెళ్ళగానే,ముగ్గుగిన్నె చేతపట్టుకొంటే,బారెడు పొద్దేదాకావరకూ ,అమ్మ ఇంకచాలు లోపలికి రమ్మని అదిలించేవరకూ పక్కింటివరకూ ముగ్గులపర్వం సాగేది.
       ఆతర్వాత తెల్లారేసరికి,హరిదాసు,బుడబుడక్కలవాడూ,జంగందేవరావస్తే, ఆపైన గంగిరెద్దుల మేళం సందడిచేసేది.
    
     పండగకోసం అమ్మాపిన్నీ, పిల్లలకోసం,ఇంటికొచ్చే అతిథులకోసం,కాయాకూరా తేచ్చిపడేసే రైతులకోసం ఏవేవో పిండివంటలు పండగనాటివరకూ ప్రతీరోజూ ఏదో ఒకటి చెేస్తూనే వుండేవారు. బస్తాడు బియ్యం ఆడించి ,అడిగినవారికి లేదనకుండా వేయడానికి ముందుగదిలో పడేసేవారు.
     ఇక పండగ పరుగుపరుగున వచ్చి ముంగిళ్ళలో వాలేది భోగి.భోగినాడు తెల్లవారకుండా తలంట్లూ,భోగీమంటలూ,,పిండివటలూ,క్రొత్తబట్టలూ, సాయంత్రం భోగిపండ్ల పేరంటాలతో ఊరంతా సందడే సందడి.నాలాగే  అత్తారింటినుండి పుట్టిళ్ళకు వచ్చిన ఆడపిల్లలం అందరం,అత్తింటి ముచ్చట్లూ,తమతమ మొగుళ్ళుతీర్చెే ముద్దుమురిపాలూ,మురిపెంగా చెప్పుకొంటూనే,అత్తలమీద అన్నో ఇన్నో నేరాలను  కబుర్లలో కలబోసుకొంటూండగానే   భోగిపండగ హడావిడి హడావిడిగా రోజల్లా సంబరంగా గడచిపోయేది.
      ఇక పెద్దపండుగ అదే,సంకురాత్రి నాటి హడావిడి చెప్పడానికి మాటలు చాలవు. పొద్దున్నే అమ్మ కడవలంతంత గుమ్మడికాయలు పగులకొట్టి, ముక్కలనుచేసి పళ్ళెంలోవేసి అరుగుమీద పెట్టేది."సిన్న గుమ్మడిబద్దెట్టండీ! పెద్దలకెట్టుకోవాల" అంటూ అడుగుతూ వచ్చినవాళ్ళకందరికీ గుమ్మడిముక్కలను పంచేవాళ్ళం.ఇతర కులాలవాళ్ళంతా సంక్రాంతి రోజున "పెద్దలపండుగ 'అంటూ ,మూలన పెట్టడమంటూ,చనిపోయిన వారింటిపెద్ద వారికి కొత్త బట్టలూ, బియ్యం,అరిశలూ,గుమ్మడి బద్దలూ మొదలైనవి ఇంట్లో ఒక మూలన పెట్టి ,పెద్దలను తలుచుకొని,బ్రాహ్మణులకు పొత్తర్లంటూ ఇస్తారు.అలాగే జంగందేవర్లకూ,బుడబుడక్కవారికీ,కోయచెంచులకూ  వారికి కలిగినంతలో ఏదోఒకటి,ఎంతోకొంత తప్పక ఆరోజు దానంచేస్తారు.జంగందేవర శంఖనాదాలూ,బుడబుక్కలవారి డమరుక నాదాలూ, చెంచువారి కంచు పళ్ళెంపై వాద్యాలూ,మురళీవాద్యాలూ,గంగిరెద్దులవారి బాకాలూ,డోలువాద్యాలతో ఊరువారంతా మారుమోగిపోతుండేది.
      పండగకి అత్తారిళ్ళకు దిగబడిన అల్లుళ్ళు అరుగులపై ఆశీనులై ,అలకలు మరచి పోయి,పండగ హడావిడిని ఆస్వాదిస్తూండేవారు.
         భోగినాడు చక్రపొగలి,దద్దోజనంతో సరిపెట్టిన అమ్మ,పెద్దపండుగనాడు మాత్రం సమృధ్ధిగా పులిహారా ,బూర్లూ  ,మా పనిమనషి పైడమ్మకూ, మాపాలికాపులకు,దోబీకీ,బారిక అప్పడికీ, చేతిలో పని అందుకొనేవాళ్ళకూ,పిలిస్తే పలికే వాళ్ళకూ,అలాగే అడిగినవాళ్ళకూ ,అడగని వాళ్ళకూ అమ్మా,పిన్నీ పంచిపెట్టేవారు.
      ఎప్పుడూ రాత్రిమాత్రమే ఊరేగింపుగావచ్చే మాఊరిదేవుడు రామలింగేశ్వరుడూ,దేవేరి ఉమాదేవీ అంగరంగ వైభవంగా పన్నెండుగంటకు ,బహుశా  ఉత్తరాయాణ సంక్రమణం ప్రవేశించాకా అనుకొంటాను ఊరేగుతూ వచ్చివెళ్ళేవాడు.
      మధ్యాహ్నం పండగ భోజనాలైపోయాకా,భుక్తాయాసం తీర్చుకొంటూండగా,అల్లీబిల్లీగా ఆటలాడుతూ,ఊర్లోని మగపిల్లలూ,ఆడపిల్లలూ,రంగురంగులపువ్వులున్న చీటీ గుడ్డలతోకుట్టించిన కొత్త పకీణీలూ,జాకట్లూ కట్టుకొని అమ్మాయిలూ,చీటీగుడ్డతో కుట్టించిన చారలచొక్కాలూ,కాకీ నిక్కర్లూ వేసుకొని మగపిల్లలూ "ఏండీ!బాపనోరూ మేడసూపించరా!అంటూ రామదండుల్లావచ్చి ,పాతడొక్కులావుండే మా సీతారామయ్య తాతగారిమేడా,డొక్కున్నరలావుండే మామేడా చూసి ,మురిసిపోతూ సంబరపడేవారు.మేడఎక్కామన్న ఆనాటి  ఆపిల్లల సంబరం,సందడీ,ఉత్సాహం తలుచుకొంటుంటెే ,నాకు ఈనాటికీ తమాషాగా అనిపిస్తూవుంటుంది.
      ఆనాడు అలా  రెండుమూడు మేడలుమాత్రమేవున్న మాఊర్లో ,ఈనాడు వందకు ఎక్కువగా మేడలున్నాయంటెే నమ్మాలిమరిమీరు.
      పాతరోజులని మధురజ్ఞాపకాలుగా దాచుకొని,'గుర్తుకొస్తున్నాయి 'లో పదిలపరుచుకొంటూ,మీతో నా జ్ఞాపకాలను ఈనాడు ఇలామీతో పంచుకొంటున్నందుకు సంతోషంగావుందినాకు. 
              సంకురాత్రి అభినందనలతో
       
                మీ సత్యవాణి
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం