భోగి అంటే సుఖం కలది. మకర సంక్రమణానికి వెనుకటి 30 రోజులు ధనుర్మాసం. అప్పుడు సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తులు తెల్లవారుజామునే మేల్కొని, స్నానాధికం నిర్వహించి దేవాలయాల్లో పూజలు, భజనలు నిర్వహిస్తారు. గ్రామాల్లో భజనలు చేస్తారు. చలికాలం కనుక భోగి మంటలు వేస్తారు. ఈ మంటల్లో పాత వస్తువులు-చేపలు మొదలగునవి వేస్తారు. సంక్రాంతి నుండి కొత్తవి వాడుతారు. ఇంటి ముందు అలికి అందంగా ముగ్గులు వేస్తారు. ఆవు పేడతో ముద్దలు చేసి వాటిపై గుమ్మడి పువ్వులు పెట్టి, పసుపు కుంకుమలు చల్లి నమస్కరిస్తారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు.
భోగి పండుగ ఇంద్రుని ప్రీతి కొరకు చేసే పండుగ అని కూడా అంటారు. గోదాదేవి మకర సంక్రాంతికి ముందు రోజు శ్రీరంగనాధునిలో వివాహ సంబంధమైన ఐక్యం చంది భోగం పొందింది. కనుక ఆ రోజున భోగి పండుగ అనే ఆచారం ఏర్పడింది. శ్రీ గోదారంగా నాయకుల కళ్యాణం జరుపుతారు. ఈరోజు కొత్త బియ్యం, కొత్త బెల్లంతో భోగి పొంగలి చేస్తారు. దేవునికి సమర్పించి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
తెల్లవారుజామున వేడి నీళ్లతో తలంటు స్నానం చేయడంతో గత ఆరు మాసాల పీడ జీవితం సమస్య పోయిందని, భోగి నుంచి ఆనందమయ జీవితం మొదలైందని భావిస్తారు. వరి కంకుల తోరణాలతో ఇల్లు అలంకరిస్తారు. సాయంకాలం పిల్లలకు పేరంటం చేసి, రేగుపండ్లు, చెరకు ముక్కలు, శనగలు, పూలు రేకులు, చిల్లర నాణాలు కలిపి పిల్లల తలపై పోస్తారు. దీనినే భోగి పండ్లు పోయడం అంటారు. ఇందువల్ల పిల్లలకు ఆరోగ్యం ఆయుషు పెరుగుతుందని నమ్మకం.
సంక్రాంతి పెద్ద పండుగ మొదటిరోజు భోగి పండుగ.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి