కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
 👌కళ్యాణ దంపతులు
శ్రీశివ పార్వతులు
      శుభముల నొసఁగు నెపుడు!
శివమస్తు! శ్రీరస్తు!
👌కల్యాణ దంపతులు
మనకాది దంపతులు
     జయముల నొసఁగు నెపుడు!
శివమస్తు! శ్రీరస్తు!
      
    (...శివమస్తు పదాలు., శంకరప్రియ.,)
👌శ్రీశివ పార్వతులే... కళ్యాణ దంపతులు! సకల మానవాళికి.. శుభములు, కళ్యాణములు, విజయములు, మంగళములు నొసంగు చున్నారు! పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులు.. భక్తమహాశయు లందరికి.. "దివ్య మంగళమూర్తి"గా దర్శన మిచ్చు చున్నారు!
👌విభూతిధారి, పరమశివుడు.. దివ్యసుందర శరీరశోభతో విరాజిల్లుచున్నాడు! శిరసుపైన జటాజూటం.. సువర్ణమయ కిరీటము గాను; నెలవంక.. చూడామణి గాను; మెడలోని నాగాభరణము.. కంఠహారము గాను; తాను ధరించిన గజచర్మము.. పట్టు పీతాంబరము గాను మారింది!
👌శ్రీసర్వ మంగళ, పార్వతీ దేవి.. శ్రీమన్మహాదేవుని పరమశివుని "వివాహ మహోత్సవము".. ఆరాధకులకు, సాధకులందరికి.. భోగ మోక్షములను అనుగ్రహించు చున్నది! శివమస్తు! శ్రీరస్తు!
     🚩 తేటగీతి  
🙏హరుని కల్యాణమున్ గాంచి హర్షమొంద,
      మునులు మునిపత్ను లేతెంచె ముదము తోడ!   
      తనకు తానుగ శంభుడే తనదు రూపు,
      మార్చుకొనె నాక్షణంబునన్ మహిమ జూపి! 
       భక్తులెల్లరు మెచ్చెడు భంగి యొప్ప
       కాంతులీనెడు రీతి శ్రీకంఠుడిట్లు
         🚩సీస పద్యము:
🙏గాత్రంపు భస్మంబు గంధంబుగా మారి    
      కమ్మని వాసనల్ కమ్ము కొనియె,
     కరిచర్మమేమారి కనకాంబరంబుగా
     కాలకంఠునిమేన కాంతులీనె,
     కంఠసీమనుగల కాలనాగేంద్రంబు,
     ఆణిముత్యంబుల హారమయ్యె!
       కామారి జూటము కనకకిరీటమై,
      నెలవంక మణితోడ నిగిడి మెరసె!
         🚩తేట గీతి
🙏సప్తమాతృక లాదిగా సకల సురలు,
     పేర్మి నేతెంచి చేయగా బెండ్లి కొమరు,
        అంత నాశివు డవ్వారి యాశ దీర!
      దివ్య మంగళ మూర్తియై దివిని వెలిగె!!
     ( శ్రీకాశీవిశ్వనాథ ప్రతిపత్తి., "భక్త కవిరత్న" భమిడిపాటి కాళిదాసు., )

కామెంట్‌లు