ఖాళీ(ఆకాశం)
🌷🙏🌷
వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.
అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు.
అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు.
అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
* * *
వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వచ్చాడు...
"ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు....
తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందాడు....
తిరిగి అందరినీ, అన్నిటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతాడు....
"ఖాళీ" అవడం తథ్యం....
కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే "మెలకువలో నిద్ర" అంటే.
భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."
నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.
"ఖాళీ"గా ఉండడం...
అదే యోగనిద్ర.
భగవద్గీత చరమశ్లోకంలో-
సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.
సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నాడు.
ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.
"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది
* * *
"నేను లేని స్థితి సర్వసమ్మతము"
"తాను ఆహారమగుటయే"
అని భగవాన్ ఉన్నది నలుబదిలో ప్రస్తావించిన వాక్యాలు ఈ "ఖాళీ" ని ఉద్దేశించినవే.
* * *
శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత. కాళీ మాత అనేది ఓ విగ్రహం కాదు,
అర్థరాత్రి... ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధ కారాన్ని(అభేదాన్ని)ఆస్వాదించ డమే కాళీమాత దర్శనం.
పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.
* * *
కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.
వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.
అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం.
* * *
కళ్లు తెరిచే వున్నా సరే - ధ్యాన నిష్ఠలో ఉండగలగడమే సహజ సమాధి.
* * *
వ్యవహారంలో మునిగి వున్నా సరే - తనలో తాను మునిగి ఉండగలగడమే సహజసమాధి.
* * *
మాట్లాడుతూ వున్నా సరే -
మౌనంగా ఉండగలగడమే సహజ సమాధి.
* * *
కరచరణాదులతో పని చేస్తూ వున్నా సరే - అచలంగా ఉండగలగడమే సహజ సమాధి.
* * *
అన్నీ ఉన్నా సరే -
"ఖాళీ"గా ఉండగలగడమే సహజ సమాధి.
* * *
నిజానికి తాను "ఖాళీ" అయిపోతే....
ఆ ఖాళీ ఖాళీగా ఉండదు...
ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.
ఇదే "ఖాళీతత్త్వరహస్యం".
* * *
ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.
ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.
ఏ అనుభవమూ లేకపోవడమే దైవవానుభవం🪷🙏🪷
నేటి సుజ్ఞాన పరిమళం;- సేకరణ తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి