పోలీసు స్టోరీ...;- ప్రమోద్ ఆవంచ 7013272452
 ఒకరోజు నా మిర్యాలగూడ స్నేహితుడు చిన్న నన్ను సిటిజన్ ఫోరం అనే వాట్సాప్ గ్రూపులో నన్ను జాయిన్ చేసాడు.అప్పటికే చాలా గ్రూపుల్లో ఉన్నాను.వద్దురా అనీ,చెప్పినా వాడు ఆ గ్రూపుకు అడ్మిన్ కాబట్టి నన్ను వదల్లేదు.సరే అనీ ఒకసారి గ్రూపు లోనికి ఒక లుక్కేసా ను.దాదాపు రెండు వందలకు పైగా సభ్యులు ఉన్న ఆ గ్రూపులో చాలా మంది డాక్టర్లు, అడ్వకేట్స్, ఉపాధ్యాయులు, పర్యావరణవేత్తలు, బ్యాంకు మేనేజర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఇలా చాలా మంది ఉన్నారు.ఈ గ్రూపులో చాలా వరకు ఉపయోగపడే పోస్టింగులే ఉంటున్నాయి.అక్కడే పరిచయమయ్యారు ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ ఫణి కుమార్.ఈయన ద్వారానే విశ్రాంత తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ గారి అప్పాయింట్మెంట్ లభించింది.
ఒక ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కలుద్దాం అని చెప్పారు.నేను కవి మిత్రుడు శ్రీనివాస్ ఇద్దరం కలిసి ఖైరతాబాద్ లోనీ జన్ సేవా సంఘ్ కార్యాలయానికి వెళ్ళాం.దాదాపు నలబై అయిదు నిమిషాల మా సంభాషణల్లో ఎన్నో విషయాలు షేర్ చేసారు.......
ఊరు బీహార్ రాష్ట్రంలోనీ ఆరా జిల్లా కేంద్రం.నాన్న ఒక స్కూల్ టీచర్.అమ్మ చిన్నప్పుడే చనిపోయింది.ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం.చాలా కష్టపడి ఐపీఎస్ పూర్తి చేసి, మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనీ నర్సీపట్నం.ఆయనకు సమాజం పట్ల బాధ్యత,పేద ప్రజలకు ఏదో చేయాలన్న తపన,ఒక ఉన్నతాధికారిగా తన పరిధి మేరకు చేయగలిగినంత సహాయం చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.ఆయననే తెలంగాణ జైళ్ల డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా పనిచేస్తూ,వీఆర్ఎస్ తీసుకున్న వి.కే.సింగ్.1960 వ సంవత్సరంలో జన్మించిన ఆయన
1987 లో ఐపీఎస్ పూర్తి చేసి, నర్సీపట్నంలో ఏఎస్పీ గా
మొదటి పోస్టింగ్.ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా పనిచేస్తూనే 2020 సంవత్సరంలో వీఆర్ఎస్ తీసుకున్నారు.ప్రజల పట్ల ఆయనకున్న  బాధ్యత,జాలి,దయ, ప్రేమ, చాలా తక్కువ మంది అధికారులలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.పోలీసు శాఖ అంటే ప్రజల కోసం పనిచేసేది
అనీ మేం చదువుకునే రోజుల్లో చెప్పేవారు, కానీ అధికారిగా బాధ్యతలు స్వీకరించాకా, ప్రజల విషయం మర్చిపోయి,రాజకీయ నాయకుల కోసం పనిచేసే, శాఖగా పోలీసు శాఖ మిగిలిపోయిందనీ,ఆయన బాధ పడుతూ చెప్పారు.ఆయన 'ఈజ్ ఇట్ పోలీస్' అనే పుస్తకం కూడా రాసారు.ఆ పుస్తకం తెలుగులోకి కూడా అనువదించబడింది.
జైళ్ళలో సంస్కరణలు
క్షణికావేశంలో చేసిన తప్పు మూలంగా జైలు శిక్షలను అనుభవిస్తున్న ఎంతో మంది ఖైదీల కుటుంబాలు, ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతుండే వారు.అలాంటి వారిలో,ఆత్మసైర్యాన్ని నింపి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశారు.ఆయన ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి, వాళ్ళ ఆదాయ వనరులను, పెంచేందుకు కృషి చేశారు.అందులో ముఖ్యమైనది జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మంతటా
పెట్రోల్ బంక్ లను స్థాపించి, అందులో ఖైదీలకు పని కల్పించారు.ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ఖైదీలు కష్టపడి పని చేయడం వల్ల రాష్ట్రంలో జైళ్ల శాఖ ఆదాయం 600 కోట్ల పైనే అంటే మీరు నమ్ముతారా?
ఇది ముమ్మాటికీ నిజం.అంతే కాకుండా ఆయన డీజీ గా పనిచేసిన రోజుల్లో, రాష్ట్రంలోనీ అన్ని జైళ్ళలో ఉన్న ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు.అసలు చదువే రాని వాళ్ళు,చదువుకునీ, పెట్రోల్ బంక్ లలో పనిచేస్తూ, డబ్బులు సంపాదించి,ఇంటికి పంపేవారు.ఖైదీలు  ఒక క్రమశిక్షణతో,తమ శిక్షా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారికి, ఉదయాన్నే యోగా క్లాసులు,ఆ తరువాత చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు, ఖైదీలు మానసిక స్థితి, ఒత్తిడిని జయించే ఉద్దేశ్యంతో,
వాళ్ళకు సైకాలజిస్టులతో, క్లాసులు ఇప్పించడం.ఇలా వారి వారి శిక్షా కాలం ముగిసే సమయానికి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోవడమే, కాకుండా మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు.సమాజంలో ఒక మారిన మనిషిగా తన కుటుంబంతో బతుకుతారనీ,అలా వందల మంది
మారిన వాళ్ళు ఉన్నారని వికే సింగ్ చెప్పారు.ఇంకా ఆయన ఖైదీలకు వాళ్ళ పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్ళిళ్ళకు లోన్లు,కూడా మంజూరు చేసేవారు.ఆ తరువాత వాళ్ళు పనిచేసి,ఆ లోన్లను తీర్చేవారు.
తెలంగాణ రాష్ట్రంలో జైళ్ళన్నీ రిసార్ట్స్ గా మారిపోయాయనీ, అందరు అనుకుంటున్నారంటే ఆ ఖ్యాతి,ఆ శాఖల అధికారులు, మరియు సిబ్బందికి చెందుతుందనీ వికే సింగ్ అన్నారు.
జన్ సేవా సంఘ్
తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలు,ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి సరైన ఉపాధి అవకాశాలు లేక తమ కుటుంబాలను పోషించుకోలేనీ
అభాగ్యులకు సహాయం అందించే ఉద్దేశంతో 2007 సంవత్సరంలో జన్ సేవా సంఘ్ ఏర్పాటు జరిగింది.ఈ ఎన్జీవో సంఘం ఏర్పాటుకు కర్త కర్మ క్రియ అన్నీ వీకే సింగ్ గారే.ఆ సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమం ఆయన మస్తిష్కంలో నుంచి పుట్టినదే.అద్యక్ష, కార్యదర్శులు,వేరే వాళ్ళు ఉన్నా వీకే సింగ్ గౌరవాధ్యక్షురాలుగా,తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, ఎంతో మందికి మేలు చేస్తున్నారు.కరోనా సమయంలో వలస కార్మికుల నిత్యావసర సరుకులు అందజేయడమే కాకుండా వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకు
వెళ్ళేందుకు రవాణా సౌకర్యాలు కూడా కల్పించారు.నగరంలోనీ దాదాపు వంద ఫ్యాక్టరీలలో పనిచేసే,స్థానికులు,ఇతర రాష్ట్రాల కార్మికులు వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.వాళ్ళ యాజమాన్యాలతో, మాట్లాడి జీతభత్యాలు,ఇతర సమస్యలు పరిష్కారించడంలో కృషి చేశారు.ఇలా జన్ సేవా సంఘ్ అనేక విధాలుగా సామాన్య ప్రజలకు సహాయ పడుతూ వచ్చింది.ఇక్కడ విషయం ఏమిటంటే జన్ సేవా సంఘ్ అనే ఎన్జీవో సంఘానికి ఎలాంటి నిధులు లేవు.ఏ ప్రభుత్వం సహాయం చేయడం లేదు.మరి ఎలా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్న ప్రశ్న మన అందరిలో రాకుండా ఉండదు.అందులో ఉన్న పది వేల మంది సభ్యులు తాము స్వయంగా విరాళాలు ఇస్తూ ఆ సంఘాన్ని ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు.అది చాలా అరుదైన విషయం.
సిటిజన్ ఫోరం
ప్రజల్లో సామాజిక, రాజకీయ, చైతన్యం కల్పించి,ఒక బలమైన పౌర సమాజాన్ని నిర్మించాలన్న సంకల్పంతో 2017 సంవత్సరం లో వి.కే.సింగ్ సిటిజన్ ఫోరం అని ఒక సంస్థను స్థాపించారు.ఆ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం
ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక, వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్నదే ఆశయం.ఇది సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు,మీరే రాజయకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు.కుల,మత, భేదాలు లేకుండా ఒకే వేదికగా, నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడి, అన్యాయం, అవినీతిని అరికట్టడమే ఈ సంస్థ ఎజెండా.సిటిజన్ ఫోరం తమ ఆశయ సాధనకు మూడు దశల యాక్షన్ ప్లాన్ నీ రూపొందించింది.మొదటిది- గ్రామాల్లో ప్రజలు పరస్పర సహకారం, సలహా సంప్రదింపుల ద్వారా వాళ్ళ సమస్యలను వారే పరిష్కారించుకోవాలి.రెండవది-గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు గ్రామస్తులు వారి వారి పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలి.మూడవది-స్వచ్చతా అభియాన్ మరియు హరిత హారం వంటి కార్యక్రమాల ద్వారా అన్ని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి.నాలుగవది-నిజమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కుల, మత, వర్గ, భాషా భేదాలు, చూడకుండా, గ్రామాలను అభివృద్ధి చేసే, ఉత్సాహం ఉన్న యువకులు,విద్యావంతులకు ఓటు వేసి గెలిపించుకోవాలి.రాజకీయ పార్టీలు ఎరవేసే డబ్బు, పదవులకు లొంగిపోకూడదన్న, మొదటి దశలోనీ ఈ నాలుగు లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర, జిల్లా,మండల,గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయించారు. రాష్ట్ర కమిటీ లో ప్రతి జిల్లా నుంచి సభ్యులు, ప్రాతినిధ్యం వహిస్తారు.జిల్లా కమిటీలలో, ప్రతి మండలం నుంచి,మండల స్థాయి కమిటీలలో, గ్రామాల నుంచి సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు.జిల్లా,మండల స్థాయి కమిటీలు నేలకు ఒకసారి,గ్రామ కమిటీలు మూడు నెలల కొకసారి సమావేశమై సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థల అభివృద్ధి,మార్పులపై చర్చిస్తాయి.సిటిజన్ ఫోరం తరుపున ఎవరూ నిధులు వసూలు చేయకూడదనీ ప్రధానమైన నియమం. గ్రామంలోని, ప్రతి ఇంటి నుంచి ఒక వాలంటీర్ బాధ్యత తీసుకొని,తమ ఒక రోజుని, సిటిజన్ ఫోరం కి కేటాయించి,సమాజ సేవ చేయడం వల్ల అవినీతి రహిత, అభివృద్ధి చెందిన,సుందర గ్రామాలను మనం చూడవచ్చు.
ఆయన ఆశయం నెరవేరి ప్రతి గ్రామం సస్యశ్యామలం
కావాలని ఆశిద్దాం....💐🙏
                            

కామెంట్‌లు