మా మర్ఫీరేడియోతో కొన్ని అనుభూతులు;- సత్యవాణి కుంటముక్కుల- 8639660566

  ఏమిటో ఆరోజుల్లో నాకు వెర్రి వేపకాయకంటే కొంచం ఎక్కువేనేమో అనిపిస్తుంది ఇప్పుడు. నేనుచెప్పేముచ్చట్లు వింటే అవునెక్కువే అంటారు మీరూనూ!                                 మార్పీరేడియోలో వచ్చే ఆకాశవాణి కార్యక్రమాలలో కొన్నింటిని తలుచుకొంటుంటే ఆ కార్యక్రమాలు ఇంకా చెవులకు మధురంగా వినిపిస్తూవుంటాయి.
      ఉదయం భక్తిరంజనిలో వారాలని బట్టి వచ్చే భక్తిపాటలు, శనివారం వేంకటేశ్వరసుప్రభా తం,ఆదివారం బాలాంత్రపు రజనీకాంతరావు   గారు పాడే 'శ్రీసూర్యనారాయణా!మేలుకో హరిసూర్యనారాయణా!పాట ప్రతీవారంవిన్నా విసుపొచ్చేవికాదు.ఆ బాలాత్రపు రజనీకాంతారావు గారూ,ఆయన తమ్ముడు నళినీకాంతారావుగారూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఎడిటర్ గా అనుకొంటా పనిచేసేవారు.  వారిద్దరూమా అమ్మకు అంటే ,పూళ్ళభాను మేనత్తకొడుకులౌతారు.వారిగురించి చెపుతున్నప్పుడు చెప్పొద్దూ,మా అమ్మకంటే నాకే కొంచంగర్వంగా వుంటుంది.
   గాన సమ్మోహనుడు బాలమీరళీకృష్ణగారి 'ఏమిచేతురా లింగా'అనే తత్వంకూడా ఎన్ని సోమవారాలు విన్నా విసుపువచ్చేదేకాదు.అలాగే భద్రాచలరామదాసుకీర్తనలు,తూము నరసింహదాసుకీర్తనలూ ,అవీ ఇవీ అనికాదు,'తింటే గారేలే తినాలి,వింటే భక్తిరంజనే వినాలి'అన్నవిధంగా ప్రతీరోజూవిసుగనిపించకుండా, అధ్బుతంగా,వీనులవిందుగా,నాస్తికులుకూడా ఆస్తికులైపోయేవిధంగా, మధురాతి మధురమైన కంఠస్వరాలతోసాగిపోయేది భక్తిరంజని వినడం చెవులు వినిపించడం ఒక భాగ్యమన్నట్లుండేది.
      అదేమిటోగానీ వ్యవసాయకార్యక్రమం దూరదర్శన్ లో వచ్చినప్పుడు 'దూడా-పేడా'అంటూ అందరూ జోకులేసుకొని,కిస్  కిస్ మనినవ్వుకొనే వారంకానీ ,రేడియోలో వచ్చినప్పుడు వారి కఠంమాధుర్యానికి  కాబోల ఆసక్తిగా ఆలకించేవారం .
      ఆతర్వాతవచ్చే,"వార్తాం ,సూయంతాం,బలదేవానందసాగరహా'అంటూవచ్చే సంస్కృతవార్తలు కూడా అర్థంగాకపోయినా,ఆ కఠంలోని గంభీరత కదలకుండా కట్టిపడేసేది.
       ఇక ప్రాంతీయవార్తల సంగతికి వచ్చేసరికి,ఎవరు చదివినా,ఢిల్లీనుండివచ్చేవార్తలు కూడా ఎవరుచదివినా ఎంతో ఆసక్తిగా,ఈరోజు  ఎవరుచదువుతార? అనుకొంటూ ఎదురుచూసేవాళ్ళం.ఢిల్లీ వార్తలు జగ్గయ్యచదివినా,పణ్యాలరంగనాధరావుగారు చదివినా,మంగమ్మగారు చదివినా,ఇంకెవరుచదివినా మహత్తరంగా చదివేవారు.
      అలాగే ప్రాంతీయవార్తలుకూడా  ,చదివేది,కొప్పులసుబ్బారావుగారుకానీ,ఓంకార్ గారు కానీ, మరెవరుచదివినా,వార్తలలో సారాంశం కన్నా ,వారికంఠాల్లో గంభీరత కట్టిపడేసేది.వార్తలు వచ్చినంతసేపూ, ఇంట్లో ఇంటెడుమంది పిల్లామేకా వున్నా, అస్సంబ్లీలోలా అరుపులూ-కేకలూ వేయకుండా,ఇంటిల్లుపాదీ వార్తలు పూర్తైయ్యేవరకూ మౌనం పాటించి,నాన్నా,చిన్నాన్నా,అన్నయ్యా వార్తలు వినడానికి సహకరించేవారం.
     ఎందుకంటే ఇప్పటి టీ.వీల్లోలా నిమిష నిమిషానికీ వార్తలు వచ్చేవికాదు అప్పట్లో.ఢిల్లీనుండివార్తలు ఉదయం ఏడుగంటలకొస్తే,మళ్ళీ రాత్రి ఏడుగంటలకే వచ్చేవి.ప్రాంతీయవార్తలుమటుకు మధ్యాహ్నంకూడా వచ్చేవి.
     వార్తలతరువాత గాంధీ మార్గమనో,లఘునాటికో ఏదోఒక మంచి కార్యక్రమం,మధ్యలో ఏదోఒక సినీమానుంచి ,ఒకటి ,రెండుమంచిపాటకూడావేసేవారనిగుర్తు. ఆపాటలకోసం నచ్చినా నచ్చకున్నా ఆకార్యక్రమాలు వినేవారం. తరువాత సంగీతకార్యక్రమమో,మరేదో వచ్చినా,తరువాత శ్రోతలుకోరినపాటలువచ్చేవి.పాటలకన్నా,ఆపాటను కోరిన శ్రోతలపేర్లు చదవడానికిఎక్కువసమయం పట్టినా,ఆపేర్లలో ఎవరైనా, ఒక్కరి పేరైనా తెలిసినవారిది రాకపోతుందాఅని చెవులురిక్కించి, ఆసక్తిగా వినేవారం.అలా ఏన్నడూ జరగలేదుకానీ,   ఆపేర్లన్నీ చదవడానికి ఎక్కువసమయం పట్టినా విసుగు వచ్చేదికాదు అదేమిటోమరి.పైగా ఆశ్రోతల పేర్లు కూడా కొన్ని కంఠతావచ్చేవి.
    ఇక రెండవప్రసారంలో కార్మికులకార్యక్రమంలో '"రామయ్యా!ఏమిటి ఆలోచిస్తున్నావ్ ?"అని  ఒకడు అడిగితే,"ఇంటిపై కప్పుకు ఏమివెయ్యాలా అని ఆలోచిస్తున్నా'"అంటాడు రామయ్య."ఓస్ దానికంత ఆలోచన ఎందుకూ? చార్ మీనార్ వారి సిమ్మెంటురేకులుండగా!"అంటాడు మొదటివాడు.ఆనాడు రేడియోలో వచ్చిన ఈ అడ్వ ర్  టైజ్ మెంటు ఈనాటికిీ ప్రజల నాలుకలమీద ఆడుతోందంటే అతిశయోక్తి ఎంతమాత్రంకాదు.
    ఇక కార్మికుల కార్యక్రమంలో అడపాతడపా వేసే సినీమా పాటకోసం, ఆ కార్యక్రమాన్ని మనకు సంబంధం లేకపోయినా ఇష్టంగా వినేవారం.
    మద్యాహ్న కార్యక్రమాలలో తర్వాతకార్యక్రమం వాహ్వా !వాహ్వా !అనిపించే స్త్రీజన్మ ఎత్తినవారికి అత్యంత ఇష్టమైన స్త్రీలకార్యక్రమం.వనితావాణనిగుర్తు. అకార్యక్రమంలోనేననుకొంటాను  వినిపించే శారదా శ్రీనివాసన్ ,శారదా అశోకవర్థన్ ,వింజమూరిలక్ష్మి, సీతారత్నం.నండూరి విఠల్, మొదలైనవారెందరెందరో,వారివారి కంఠాలతో కదలకుండా కట్టిపడేసేవారు.ఉర్రూతలూగిస్తూ ప్రసారమైయ్యే ఏకార్యక్రమమైనాసరే, చెవులలో తెేనే పోస్తే,నాలుకతో తీపిని ఆస్వాదించేవారం.
ఇంతకీ  అప్పుడు విన్న ఏ కార్యక్రమం హైదరాబాదుది,ఏది విజయవ అంటే,జ్ఞాపకశక్తి తగ్గిపోవడంవల్ల ఈనాడు చెప్పలేను.
     అటుతర్వాత వచ్చే 'ఈమాసపు పాట'అంటూ తిలక్ మావయ్య అనుకొంటాను నెల్లాళ్ళూ 'ఈనెలపాట'నుకొంటాను, నెలంతా నేర్పినా వినడానికి విసుగొచ్చేదేకాదు.ఆ ఈమాసపుపాట రాసుకోడానికి పెన్నూ,పుస్తకంతో రడీగావుండి,పాటరాసుకొంటూ,  మావయ్యతో గొంతుకలిపి అచ్చంగా ఆయనలాగే పాడడం అప్పట్లో గొప్పేకదామరి.బహుశా ఆకార్యక్రమంలోనే అనుకొంటా, 'అమ్మమాట ఎంతొ అందమూ-మా అమ్మపాట మంచిగంధమూ,'కొండమీదా కోవెలొకటీ వెలసిందీ-కొమ్మమీదా కోయిలొకటీ కూసిందీ' పిల్లల్లారా -పాపల్లారామొదలైన గేయాలనెన్నింటినో పుస్తకంలోరాసుకొని పాడుకొనేవాళ్ళం.
    "ఆవిడెవరో  నాలాగే,"నేనూ లతామంగేష్కర్ లా పాడగలనందట."ఏదీ !పాడుమరి "అంటే,"ఉండండి ,మరి ఆవిడపాట రావాలికదా రేడియోలో !"అందట.అలాగన్నమాట.
       ఇక శని,ఆదివారాలలో వచ్చే,బొమ్మరిల్లు,బాలానందం,బాలవినోదం అవీ వినడం,"రారాండోయ్ రారండో" అంటూ వచ్చే ఆ కార్యక్రమాలకి సంబంధించిన స్వాగతం పాట, ఆ పిల్లలలో పిల్లదాన్నైపాడుకోవడం, ఆకార్యక్రమాలను ఆస్వాదిస్తూ,అక్కయ్యా -అన్నయ్యా మాటలకు పొంగిపోతూ ,మళ్ళీవచ్చే  శనిఆదివారాలకోసంఆరోజునుంచే ఆత్రంగా ఎదురుచూడడం,ఆహా!ఏమీ!మాతరంపిల్లలఅదృష్ణం.మరేదీ ఈతరంపిల్లలకా అదృష్ణం నేడు.
     ఇక సాయంత్రం ప్రసారాలలో ఐదుగంటలకు 'రేడియోలో "సిలోన్ స్టేషన్ నుంచి 'మీనాక్షీపొన్నుదొరై'వేసె ఒకే ఒక్క తెలుగుపాట వినడంకోసం అంత వెర్రెక్కిపోవాలా?ఆ సింహళభాషా ఎనౌన్సర్ ముద్దు ముద్దుగా ,వచ్చీరాని తెలుగులో 'మీ మీనాక్షీపొన్నుదొరై' అన్న ఆఒక్క,ఆఒక్క  మాటకోసమే ఆమెను ఆరాధ్యదేవతలా ఆరాధించడం,ఆమె ప్రసారంచేసే ఒక్క తెలుగుపాటకోసం,మర్నాడు సాయంత్రకోసం ఆత్రంగా ఎదురు చూడడం వెర్రేకదామరి.
     ఇక అలాగే   ప్రతీ ఆదివారం   నేషనల్ పిల్మ్ అని, వారానికి ఒకభాషచొప్పున, అన్నిభాషలలో ప్రసారమయ్యే సినీమాలతోపాటుగావేసే, 
తెలుగు  సినీమాకోసం,కన్నులు కాయలుకాసేలా ఎదురు చూడడం మరి వెర్రనరదాన్ని.
     'ఎ 'అంటే అస్సామీ అని, 'బి' అంటే బెంగాలీ అనీ, అలా ఆల్బా బెటికల్ గా ఢిల్లీనుంచి ప్రసారమయ్యే శబ్దచిత్రాలలో,'టి'అంటే ఈసారి తప్పక తెలుగు సినీమానే అనేసుకొని, ఆ ఆదివారంనాడు తిరునాళ్ళలో మూకలా ఊళ్ళోఉన్న ఆడంగులు,పిల్లకాయల్తో సహా,  మా మర్ఫీ రేడియో ముందు బైఠాయించాకా,తీరా ఆ ఢిల్లీవాడు దగాచేసి , తెలుగుసినీమాకాకుండా తమిళం సీనీమా వేస్తే,తెలుగుసినీమా విందామని కూడిన మాచుట్టుపక్కలఇళ్ళనుండి,పిల్లామేకాతోసహావచ్చిచేరినవారంతా, అదేదో ఆతప్పుపని,  ఆనేరం నేను చేసినట్టు, ఆ తెలుగుసినీమా రాకుండా నేనేదో దగా చేసినట్టూ, నాకేసి చురచురా చూస్తూ,ఛంగుమంటూలేచి, చంగులు జాడించుకొంటూ,విసవిసా ఇళ్ళకి వెళ్ళిపోతుంటే, నిజంగానే నేనే ఆ తప్పుచేసినట్టు, సిగ్గుపడుతూ, అవమానంగాభావించడం వెర్రికాక మరేమిటి!
    మూడు నాలుగు నెలలు ఎదురుచూడగా చూడగా,  తమిళం సినీమా తరువాత ఆదివారం తప్పకుండా  'టి ' అంటే 'టిస్పామీ 'అనే భాషయేదీ  లేనికారణంగా,తెలుగు  సినీమాయే వేసినా,అది ఏ అవార్డు సినీమాయో అయి ,అర్థం పర్థంకాక పోయినా,అర్థమైనట్టు నటిస్తూ, అమితంగా ఆనందించడం అన్నది వెర్రికాకపోతే మరేమిటి?
        శని ఆదివారాలలో వచ్చే,బాలానందం ,బాలవినోదం కార్యక్రమాలు వింటూ ,నిజమైన ఆనందాన్ని అనుభవించడం,అందులో నేర్పేపాటలను నేర్చుకొంటూ,అక్కయ్యా,అన్నయ్యల మాటలలోని మజాని జుర్రుకోవడం కూడా ఒక వెర్రితనమేఅంటారేమో ఈనాటి పిల్లలు.
    ఇక రాత్రిప్రసారాలలో,పేరు సరాగ్గా గుర్తులేదుకానీ,పొలాలనుండి నాన్నా,చిన్నాన్నా,అన్నయ్యా ఇంటికి వచ్చేసమయానికి,పాడిపంటలో,పసిడిపంటలో ఏదో ఒక వ్యవసాయకార్యక్రమం వచ్చేది.తరువాత ఉదయం వచ్చినట్టే,ప్రాంతీయ వార్తలు,ఆతర్వాత ఢిల్లీనుండి వార్తలూ వస్తుంటే, అప్పటిదాకా పక్కన చదివేవాళ్ళకు తోచకుండా,తొణగకుండా,ఒకరికంటే ఒకరు పోటీపడిమరీ,గడగడా పాఠాలుపైకిగట్టిగా   చదివే మా తమ్ముళ్ళూ,చెల్లెళ్ళూ కూడా,వార్తలు పూర్తి అయ్యేవరకూ, గునగునమని, నోట్లో నోట్లో గొణుక్కుంటూ చదవవలసిందే కానీ,పైకి గట్టిగా చదవడానికి వీల్లేదు.
      రాత్రి రేడీయోలో అప్పట్లో కాంతంకథలు లాంటి  ప్రఖ్యాత రచయితల నాటకాలు చాలాబాగుండేవి. అన్ని రేడియో క్రమాలమాటా అలావుంచితే,సరిగా జ్ఞాపకం రావటంలేదుకానీ,బహుశాశుక్రవారం అనిగుర్తు,రాత్రి ఎనిమిది గంటలనుండి తొమ్మిదిగంటలకువరకూ అనిగుర్తు ఢిల్లీనుండి ఇంగ్లీషువార్తలు వచ్చేవరకూ సినీమాపాటలు వచ్చేవి. 
 చెప్పానుకదా,మారేడియో 
మెట్లగదిలోవుండేది.అతిశయోక్తిగా చెప్పాలంటే మా వంటిల్లు ,భోజనాలవసారా ఫర్లాంగుదూరానికి కొంచం దగ్గరగావుండేది. మాపిన్ని సుందరమ్మ ఊళ్ళోలేకపోతే, రాత్రి భోజనాలైపోయాకా,భోజనాలు చేసినపీటలుకడగడం,వంటపొయ్యి అలికి వంటిల్లు ,భోజనాలవసారా కడగడం, మొదలైనడ్యూటీ నామీదపడేది.
      ఉత్తిరోజుల్లో అయితే,'ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదీ ,
చీపురుతో వంటిల్లుకడిగితే,
చెడుపేమున్నదీ'అనిపాడుకొంటూపనిచేసేదాన్ని కానీ,
సినీమా పాటలువచ్చే ఆ  శుక్రవారం మటుకు,అదేపాటను ఏడుస్తూ,ఇంట్లోవాళ్ళని తిట్టుకొంటూ,ముఖ్యంగా మా అన్నయ్యని చెడా మడా తిట్టుకొంటూ, ఆపనులు చేసేదాన్ని.అన్నయ్యను తిట్టడం ఎందుకంటే, బోజనాలవసారాలోకి రేడియో కార్యక్రమాలు వినపించేలా మైకు బిగిస్తానని ప్రతీసారీ మాట ఇవ్వడమేకానీ'రాజకీయనాయకుడిలా మాటమీదనిలబడింది ఏనాడూలేదు.రేడియోలు మరుగునపడి టీ.విలు వచ్చిపడ్డాయికానీ,మా అన్నయ్య వటింట్లోమటుకు మైకుమాత్రంబిగించనేలేదు.మా ఆడపిల్లలంతా అత్తారిళ్ళకు వెళ్ళేపోయాము.
    ఆరోజుల్లోదే ఒకరోజు నేనేమిటో,నేనుచేసిన ఘనకార్యమేమిటో,కాస్త సిగ్గు సిగ్గుగానైనా మీతో చేప్పాలని పిస్తోంది,.  
      సాధారణంగా మాపిన్నిసుందరివుంటే,రాత్రిభోజనాలైనాకా,వంటిల్లు సర్థిపెట్టడం,భోజనాలుచేసినపీటలుకడిగి ఎత్తిపెట్టడం,భోజనాలవసారా,వంటిల్లుకడగడం,పొయ్యి అలకడం,తులసికోటకడడం,అన్నిచోట్లా ముగ్గులువెయ్యడం మాపిన్నిపని.తనాపనిచేసుకొంటుంటే సాయంగా నేనక్కడ కూచోవాలంటే,మాపిన్ని రోజూఒక సినీమాకథ చెప్పాలి అదీ కండిషన్ .మాపిన్నికి సినీమాలు చూడడమన్నా,అవిమాకు కథలుచెప్పడమన్నా చాలాయిష్టం.మాఊర్లో సినీమాహాలువున్నా,పెద్దిళ్ళవాళ్ళు వెళ్ళి సినీమాచూసే అవకాశం లేనికారణంగా,వాళ్ళముగ్గురన్నదమ్ములగ్గరకూ,వాళ్ళకొడుకులదగ్గరకూ,వెళ్ళినప్పుడు ఎంచక్కా,"పాపం సుదరమ్మత్తకు సినీమాలిష్టమర్రా!వాళ్ళూళ్ళోచూడడానికి వుండదు"అని పుట్టిళ్ళకెళ్ళిన రెండుమూడు నెలలలోనూ కనీసం ఓపాతిక ముఫైసినీమాలుచూపించేవారు వాళ్ళ వాళ్ళు.ఆకథలన్నీ కడుపులోదాచుకొనేది. ఇదిగో నేనుసాయంగా కూర్చొన్నప్పుడు రోజుకొకథ చెప్పేది.తన మధురమైనకంఠంతో కథతోపాటుగా ,వాటిలోనిపాటలు కూడా పాడేది.అలానేను విన్నకథలు ఎన్నెన్నో చెప్పలేను. పాతాళభైరవి,గుణసుందరికథ,మల్లీశ్వరి,విప్రనారాయణ,సుగుణసుందరికథ,సువర్ణసుంద,సారంగధర,జయభేరి,విప్రనారాయణ సతీసక్కుబాయి,మీరాబాయి,భక్తపోతన,పరమానందయ్యశిష్యులకథ అలా ఎన్నకథలు ఎన్నని చెప్పను?శుక్రవారం నాడువచ్చేపాటలుకూడా మా పిన్నికథముందు బలాదూరేకనుక  ఆనాడు రేడియోపాటలు వినలేదన్నబాధవుండేదికాదు. కానీ, మాపిన్ని పుట్టింటికెళ్ళినప్పుడే నాకొచ్చిపడేదితంటా అంతా..
      మాపిన్నివున్నప్పుడు తను ఏఏపనులుచేసేదో ఆపనులన్నీ నేచేయవసివచ్చేది.                   .ఓపక్క రేడియో నాకిష్టమైన సినీమాపాటల పాడేస్తోంటుంది, పాటలైనాకా కడుగుతానంటే మా అమ్మ శశామీరా,అని ఒప్పుకోదు. "అంతసెేపు ఎంగిళ్ళలావుంచకూడదు.దరిద్రం"అంటుంది. అంతే ,కాళ్ళుబాదుకొంటూ వంటింట్లోకెళ్ళి.చప్పుడయ్యేలాదొంతరెేసిన వెండికంచాలు కడిగి లోపలెట్టి,.మా పైడమ్మ నూతిలోంచి తోడిపెట్టిన నీళ్ళబకెట్లు తెచ్చి.దబ్బుబ్బున చప్పుళ్ళుచేస్తూ, పీటలుకడిగి,దిబ్బుదిబ్బున దొంతరేసి,బుళక్కుబుళక్కు మని  నీళ్ళుదిమ్మరించేస్తూ,బర్రుబర్రున చీపురును చప్పుడుచేస్తూ వంటిల్లుకడిగేసి,చర్రునచర్రున నాలుగుముగ్గూకర్రలు గీకేసిపడేసి, వీధిగదిలోకి వచ్చేసరికీ ,"చిత్రరంజని మీరుకోరినపాటలు సమాప్తం.ఇప్పుడు ఢిల్లీనుండి ఇంగ్లీషులో ఫలానాప్రసంగ ప్రాసారం"అనేసేవాడు అనౌన్సర్ ...అప్పటినామనస్సుపరిస్థితి ఎలావుండేదో మీరేఊహించుకోండి.
        అసలు రాత్రులు మనుషులు భోజనాలెందుకుచేయాలి?చేసితిమిపో,ఆపీటలు -చేటలు ఎందుకుకడగాలి?
 ఆపొయ్యలకూ- గియ్యలూ ఎందుకలుకులూ- ముగ్గులూ అప్పుడే పెట్టాలి!
       అయితే ఇక్కడకూడా మీకొకమాటచెప్పాలి. ఆ వేడి పొయ్యలను, పిసరంత ఆవుపేడతో అలుకుతున్నప్పుడు,ఆ వచ్చేసువాసన పీల్చుకొంటూంటే,మండువేసవిలో మట్టి తడిసీతడవకుండా, కల్లాపిజల్లుగా వాన కురిసీ కురవనట్టు వాన కురిసినపుడు, భూమినుంచి ఎగసి వచ్చిన పరిమళంలా మనసును పరవసింపజేస్తుందావాసన. మట్టిపొయ్యనుంచి వచ్చే సువాసనను.. .ఆత్ ఆఘ్రాణించబుద్దౌతుంది పదేపదే. 
    మాపిన్ని పుట్టింటికి వెళ్ళినసందర్భంలో, అలా మాపిన్ని పనులు, నాపైపడినసందర్భంలో ,ఒక శుక్రవారం రేడియోలో చిత్రలహరి వస్తున్నరోజు, కాళ్ళు బాదుకొంటూ,ముక్కుచీదుకొంటూ, వంటగది కడగడానికివచ్చిననేను,
  ఆచేయాల్సినపనిపైకలిగిన, అమితమైన నాకోపం అంతా  ఇనప 'గణేష్ బ్రాండ్' నాణ్యతలో నెంబర్ ఒన్ గా .ఇండియాలోనే నెం.ఒన్ గా పేరుపొందిన, ఆ నీళ్ళబకెట్టుపైచూపించేనంతే నాకోపంతో కూడిన నాబలమంతా చూపించి బకెట్టును నేలమీదకు ది...బ్బు మని కుదేస్తే ,ఆ నిండా నీళ్ళు నిండివున్న ,ఆ అంతనాణ్యమైన,అంత పేరుగాంచిన ఆ గణేష్  ఇనుపబకెట్టు మొత్తంబాడీ, అప్పడంలా అణిగిపోయి. మట్టుకు అంటుకుపోయిందంటే మీరునమ్మాలి. .మరెప్పుడూ నాకుఅంత కోపం ఇప్పటివరకూ ఈడభైఏళ్ళు పైబడ్డ  జీవితంలో మరెప్పుడూ రాలేదన్నది నిజంగా నిజం.
     సరే !ప్రతీదాన్నీ ఆరాతీసి పసికట్టేసే, మా తెలివైన అమ్మకుమాత్రం, రాత్రికి రాత్రి ,ఆ బకెట్ అంతలా, అప్పడంలా ఎందుకైపోయిందో ,అంతగా ఎలా మణిగిపోయిందోఅని   ఇంట్లోవాళ్ళందరినీ,ప్రశ్నలమీద ప్రశ్నలు, యక్షప్రశ్నలేసిందిగానీ,ఏమాత్రం  తెలుసుకోలేకపోవడం ,నాకు గర్వకారణంగా అనిపిస్తుంది ఇప్పటికీ..
     నేనుమాత్రం ఆనాటి నాకోపం,ఉక్రోషం తలుచుకొంటూంటే,ఆనేనా ఈ నేను అని అనుకుంటూవుటాను.ప్రతీరోజూ మా ఇంట్లోవున్న గణేష్ వారి ఇనపబకెట్ నేను మరచిపోదామన్నా మరచిపోనివ్వదా సంఘటనను ఈనాటికీ.
    అయితే మా అన్నయ్య వంటవసారాలోకి, ఒక చిన్న మైకుగొట్టంబుడ్డి లాగలేదన్న కోపంతోనే ఆనాడలాచేశానని, నన్ను నేను ఇప్పటికీ సమర్థించుకొంటాను. ఆనాటి నా కోపాన్నీ,బాధను అర్థంచేసుకొన్నవారెవరైనా నన్ను తప్పక సమర్థిస్తారనే అనుకొంటున్నాను. 
     ఇంతకీ ఇప్పుడు  అరచేత మాణిక్యంలాగ చేతిలోయిమిడిపోయే సెల్లు ఫోన్ వచ్చేకా, సినీమాలు,సీనీమాపాటలు మనంకోరినవేవైనాసరే అల్లాధ్ధీన్ -అధ్భుతదీపాన్నడిగినట్లు ,మనం  గూగుల్ మాతనడిగితెే సరి.అరసెకనులో అందించేస్తుంది, ఏసినీమానైనా,సినీమాల్లోన,ఏపాటనైనాసరే!వినడానికి మన వీనులు సవ్యంగా వుండాలి, ఇయర్ ఫోన్లు ఇరవైనాలుగు గంటలూ చెవిలో దోపుకోవడంవల్ల చెవులు పాడుచేసుకోకుండా మనంవుంచుకోవాలికానీ. నువ్వలా రోజుకు ఎన్నివింటున్నావని మాత్రంనన్ను అడక్కండి.  మిమ్మల్నీ నేనడగను .సరేనా!
         
     
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
భళిరే నైరా
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం