లక్ష్మణ రేఖ
ఎవరైనా ఒక మాట అంటే దానికి అడ్డు చెప్పకుండా తప్పక అనుసరించాల్సి వస్తే ఆ మాటను లక్ష్మణ రేఖ అనటం పరిపాటి. ఎదురు చెప్పటానికి వీలులేని మాటలే లక్ష్మణ రేఖ. అలా ఎదురు చెపితే ఏదో ఒక అనర్ధం జరుగుతుందనే భయం వారిలో నాటుకుని అడ్డు చెప్పటానికి సాహసించరు. అసలు ఈ లక్ష్మణ రేఖ ఏమిటి? ఇది నానుడిగా ఎలా వచ్చింది? అనే విషయాన్ని పరిశీలిస్తే, ఈ నానుడి రామాయణ కథ నుండి వచ్చిందని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే లక్ష్మణుడు రామాయణ నాయకుడు రాముడి తమ్ముడు కాబట్టి.
రాముడు సీతతో పాటు లక్ష్మణుడు తో కలిసి అరణ్య వాసం చేస్తున్న తరుణంలో బంగారు జింక రూపంలో ఉన్న రాక్షసి మాయలమారి జింకను సీత చూసింది. ఆ జింక కావాలని కోరింది. దాన్ని పట్టుకు రావటం కోసం రాముడు వెళ్ళాడు. సీతవద్ద తమ్ముడు లక్షమణుడుని కాపలా ఉంచి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితిలోనూ వదినను వదిలి వెళ్ల వద్దని రాముడు శాసించాడు. చాలా సేపు గడిచింది. పొద్దు పోయింది. ఎంతసేపటికి రాముడు రాలేదు. పైగా రాముడు గావు కేక పెట్టినట్టు సీత విన్నది. రాముడికి ఏదో జరిగిందని భయపడింది. అన్నకు ఏదో అయ్యిందని తమ్ముడు లక్ష్మణునికి చెప్పింది. లక్షమణుడు సీతను వదిలి వెళ్ళటానికి నిరాకరించాడు. దుర్భుద్ధితో అన్నను రక్షించటానికి వెళ్లటంలేదని సీత మరిది లక్ష్మణుడిని నిందించింది. తప్పని పరిస్థితిలో లక్ష్మణుడు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. వెళుతూ వెళుతూ లక్ష్మణుడు ఇంటి ముందు ఓ గీత గీసాడు. ఎట్టి పరిస్థితిలోనూ తను గీసిన గీతను దాటి రావొద్దని వదినకు చెప్పి బయలుదేరాడు. లక్ష్మణుడు అలా వెళ్ళేడో లేదో భిక్షగాడి వేషంలో రావణుడు వచ్చాడు. భిక్ష వేయమన్నాడు. సీత భిక్ష తెచ్చింది. గీత దాటకుండానే భిక్ష వేయటానికి ప్రయత్నించింది. రావణుడు కొంచం కొంచం వెనక్కు జరుగుతూ సీతను గీత దాటేట్టు చేసాడు. ఇంకేముంది వెంటనే మాయలమారి రావణుడు సీతను తీసుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. సీత లక్ష్మణుడు గీసిన ఆ గీతను దాటకుండా ఉంటే ఆమెను రావణుడు ఏమి చేసి ఉండేవాడు కాదు. అంత శక్తి వంతమైంది ఆ గీత . సీత సురక్షితంగా వుండేది. లక్ష్మణుడు గీసిన ఆ గీతే లక్ష్మణ రేఖగా వాడుక అయింది.
లక్ష్మణ రేఖను సీత దాటబట్టే ఆమెకు అన్ని కష్టాలు వచ్చాయి. అలా ఒకరి మంచి కోసం కొందరు ఆప్తులు కొన్ని హద్దులు ఏర్పాటు చేస్తారు. వాటిని లక్ష్మణ రేఖతో పోలుస్తారు. ఆ హద్దులు దాట కుండా ఉంటే మనం బ్రతికి పోతాం, లేకుంటే సీత పడిన ఇడుములు మనము కూడా పడక తప్పదు. మన బాగు కోసం పెద్దలు ఏర్పాటు చేసిన గీతలు లక్ష్మణ రేఖ గా వాడుకై నానుడిగా మిగిలిపోయాయి. ఇదీ లక్ష్మణ రేఖ కథ.
౼ డా. దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి