చిచ్చర పిడుగు (అద్భుత జానపద కథ);-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూరిలో ఒక రాజుండేటోడు. ఆయనకు ఒక కొడుకు పుట్టినాక పురిట్లోనే పెండ్లాం చచ్చిపోయింది. దాంతో పసిపిల్లోన్ని చూసుకోడానికి ఎవరూ లేక ఇంకో ఆమెని పెండ్లి చేసుకున్నాడు. ఎంతయినా కన్నతల్లి కన్నతల్లే.... సవతితల్లి సవతితల్లే గదా... ఆమెకు ఈ పిల్లోడంటే కొంచంగూడా ఇష్టం లేదు. ఎందుకంటే రేప్పొద్దున రాజ్యానికి రాజయ్యేది పెద్ద పెండ్లాం కొడుకే గదా....
వీడే లేకుంటే నాకు పుట్టే పిల్లోడే ముందు ముందు రాజవుతాడని ఒకరోజు అర్ధరాత్రి అందరూ పండుకున్నాక కొందరు సైనికులని పిలిచి కావాల్సినంత ధనమిచ్చి, “ఈ పిల్లోన్ని తీస్కోనిపోయి చంపి కనుగుడ్లు గుర్తుగా తీసుకోని రాండి" అని పంపిచ్చింది.
వాళ్ళు సరేనని ఆ పిల్లోన్ని తీస్కోని పోయినారు గానీ చూసి చూసి ఆ పసిపిల్లోన్ని చంపలేకపోయినారు. దాంతో ఏమయితే అదే అయితుందనుకోని ఆ పిల్లోన్ని జాగ్రత్తగా ఒక చీమలపుట్టకాడ వదిలి పెట్టి... ఒక మేకను చంపి దాని కండ్లను తీసుకోనొచ్చి రాణికి చూపిచ్చినారు. రాజు పొద్దున్నే వచ్చి పిల్లోడు కనబడక అంతా వెదుకుతా వుంటే "రాత్రి ఎవరో దొంగలొచ్చినారు. వాళ్ళు గానీ ఎత్తుకపోయినారేమో" అనింది. చిన్న పెండ్లాం ముందరనే సేవకులందరికీ అడిగినోళ్ళకి అడిగినంత ధనమివ్వడంతో వాళ్ళు గూడా అదే మాట చెప్పినారు. దాంతో రాజు గూడా అదే నిజమనుకోని చానా చానా బాధపడినాడు.
ఆ పసిపిల్లోన్ని సైనికులు పుట్టకాడ వదిలేసి వచ్చినారు గదా... అందులోని చీమలు పిల్లోన్ని జాగ్రత్తగా చూసుకోసాగినాయి. ఎవరి కంటా పడకుండా లోన దాచిపెట్టి... అన్నీ కలసి ఆహారం తీసుకొచ్చి కన్నతల్లి లెక్క వేళకింత పెడతా... ఆడిస్తా... లాలిస్తా... జాగ్రత్తగా పెంచసాగినాయి. ఒక రోజు ఆ పుట్ట వున్న చోటికి ఆ పొలమాయన కూలీలతో వచ్చి “రేయ్! ఇది దారికి అడ్డమయిపోతా వుంది. రేపొచ్చి దీన్ని తవ్వేయండి" అన్నాడు.
దాంతో ఆ చీమలు ఈ పిల్లోన్ని కాపాడ్డం ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే పక్కనే వున్న మామిడి చెట్టు కనబడింది. వెంటనే అవి ఆ పిల్లోన్ని మామిడి చెట్టు దగ్గరికి తీసుకోనొచ్చి “వీనికెవరూ లేరు. మా పుట్ట గూడా రేపు తీసేస్తా వున్నారు. కాస్త నువ్వు చూసుకుంటావా?" అనడిగినాయి. అప్పుడా మామిడిచెట్టు సరేనని ఆ పిల్లోన్ని ఎవరికీ కనబడకుండా కొమ్మల నడుమన దాచి, ఆ మాటా ఈ మాటా నేర్పుతా... తియ్యతియ్యని కాయలు తినడానికి అందిస్తా జాగ్రత్తగా పెంచసాగింది. ఒకరోజు ఆ మామిడి చెట్టు యజమాని సేవకులను పిలచి “రేయ్! మనమిక్కడ ఇండ్లు కట్టుకోడానికి ఈ చెట్టు అడ్డమొస్తా వుంది. కూలీలని పిలిచి రేపు దీన్ని కొట్టేయండి" అని చెప్పినాడు.
దాంతో ఆ మామిడి చెట్టు ఈ పిల్లోన్ని కాపాడ్డం ఎట్లాగబ్బా అని బాధపడతా వుంటే అప్పుడే రాజు తోటమాలి బండిగట్టుకోని చేనుకి పోతా కనబన్నాడు. వానికి పెండ్లయి పదేళ్ళయినా పిల్లల్లేరు. దాంతో ఆ మామిడి చెట్టు వాన్ని పిలిచి “నీకెట్లాగూ ఎవ్వరూ లేరు గదా. ఇదిగో ఈ పిల్లోని తీసుకోని పెంచుకో, వీనికి గూడా ఎవ్వరూ లేరు" అంటా ఆ పిల్లోన్ని అందించింది. ఆ తోటమాలి పిల్లోన్ని చూసి సంబరపడి బెరటెరా ఇంటికి పోయి పెండ్లాం చేతిలో పెట్టినాడు. అప్పటి నుండీ వాళ్ళిద్దరూ ఆ పిల్లోన్ని చానా ప్రేమగా, ముద్దుగా అపురూపంగా పెంచుకోసాగినారు.
అట్లా ఒకొక్క సమ్మచ్చరమే దాటుతా యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటా నెమ్మదిగా ఆ పిల్లోడు పెరిగి పెద్దగయినాడు. వాడు రాజు కొడుకే గదా! దాంతో ఆయన నోట్లోంచి వూడిపన్నాడా అన్నట్లు అచ్చం రాజు మాదిరే తయారయినాడు.
ఒకరోజు రాణి చెలికత్తెలతో సాయంకాలపు పూట చల్లగాలికి అట్లా తిరిగొద్దామని చెప్పి తోటలోనికి వచ్చింది. ఆమెకు ఒకచోట చెట్లకి నీళ్ళు పోస్తా వున్న ఈ పిల్లోడు కనబన్నాడు. వాన్ని చూసి ఆమె ఆచ్చర్యపోయింది.
"ఇదేందబ్బా వీడు అచ్చం నా మొగుని మాదిరే వున్నాడు. కొంపదీసి మొదటి పెండ్లాం కొడుకు కాదు కదా" అని అనుమానపడి చక్కగా ఇంటికి తిరిగి వచ్చి అప్పట్లో పిల్లోన్ని అడవిలో చంపి రమ్మని పంపిచ్చిన సైనికులను పిలిపించి, మెడ మీద కత్తి పెట్టి “నిజం చెప్తారా, ఇక్కడికిక్కడే చంపి పారేయమంటారా!" అనింది. దాంతో వాళ్ళు భయంతో గజగజా వణికిపోతా జరిగినదంతా చెప్పినారు.
"వాడు గనుక అట్లాగే తిరుగుతా వున్నాడంటే ఎప్పుడో ఒకసారి నాకు ముప్పే, రాజు వాన్ని చూడకముందే ఎట్లాగయినా సరే చంపేయా"లని అనుకోనింది. రాజు దండయాత్రలకని వేరే దేశానికి పోయినాడు. తిరిగి వచ్చేలోపల రాజుకి తెలీకుండా పని ముగించేయాలి అనుకోని సైనికులను పంపించి తోటమాలిని బంధించి తీసుకోని రమ్మనింది. తోటమాలి చెరశాలలో పడడంతో ఆ పిల్లోడు వురుక్కుంటా రాణి దగ్గరకొచ్చి "మా నాయన్ని చెరశాలలో ఎందుకట్లా ఏసినారు" అనడిగినాడు.
దానికామె తలపట్టుకోని "నెలరోజుల నుండీ ఒకటే తలనొప్పి. ఎన్ని మందులేసినా తగ్గడం లేదు. అడవిలోకి పోయి ఏనుగుపాలు తెచ్చి తలంతా పట్టిస్తే తప్ప ఇది తగ్గదని రాజవైద్యులు చెప్పినారు. నీవంటి వీరుడు ఈ మూడు లోకాలలోను యాడా లేడంట గదా! కాబట్టి నీవు పోయి ఏనుగు పాలు తీసుకోనొస్తే మీ నాయన్ని విడిచిపెడతా. లేదంటే లేదు" అనింది.
ఏనుగుపాలంటే మాటలు కాదుగదా! అయినా వాడు సరేనని అడవిలోనికి పోయినాడు. అడివిలో అట్లా పోతావుంటే ఒకచోట ఒక ఏనుగుల మంద కనబడింది. వీడు ఒక చెట్టు ఎక్కి పైన దాచి పెట్టుకున్నాడు. కాసేపటికి ఏనుగులన్నీ స్నానం చేసొద్దామని పక్కనే వున్న చెరువుకు పోయినాయి. అవి అట్లా పోగానే వీడు బెరబెరా కిందికి దిగినాడు.
అక్కడంతా ఏనుగులు ఇష్టమొచ్చినట్టు తొక్కి, తిని, పెండేయడంతో అంతా కంపు కంపు కొడతా వుంది. దాంతో అప్పటికప్పుడు కట్టే పుల్లలతో ఒక పొరకను తయారు చేసి, ఆ స్థలమంతా నున్నగా కసువు కొట్టి, చెత్తంతా కన్నెగా ఎత్తి దూరంగా పారనూకి, అలికి ముగ్గులు పెట్టి చూడముచ్చటగా తయారుచేసి మళ్ళా చెట్టెక్కి కూచున్నాడు.
కాసేపటికి ఏనుగులన్నీ తిరిగి వచ్చినాయి. వచ్చి చూస్తే ఆ స్థలమంతా అద్దం లెక్క తళతళలాడతా కనబడింది. ఈ అడవిలో మన కోసం ఇంత కష్టపడింది ఎవరబ్బా అని అవి కిందా మీదా చూస్తా వుంటే చెట్టుపైన వీడు కనబన్నాడు. “ఏం కావాల నీకు? ఎందుకట్లా అడగకుండానే మాకు సాయం చేసినావు" అన్నాయి. వాడు జరిగినేదంతా చెప్పి “కొంచం మీ పాలిస్తే తీసుకోని పోయి మా నాయనను ఇడిపిచ్చుకుంటా" అన్నాడు.
“దానిదేముంది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకో" అంటా ఆ ఏనుగులు ఒక బిందె పాలు ఇచ్చి “దా నిన్ను తీస్కోని పోయి మీ రాజ్యం కాడ దించొస్తాం" అని చెప్పి వాడు వద్దు వద్దంటున్నా వినకుండా పెండ్లాం పిల్లలు అందరూ వెంట నడుస్తా వుంటే... ఒక ఏనుగు వాన్ని ఎత్తి మీద కూచోబెట్టుకోని బైలుదేరింది.
ఏనుగులన్నీ అట్లా గుంపులు గుంపులుగా వస్తా వుంటే డూరం నుండే చూసిన సైనికులు పరుగుపరుగున రాణి దగ్గరకు
పోయి “మహారాణీ! మహారాణీ! వాడు సామాన్యుడు గాదు. ఏనుగుపాలు తెమ్మంటే ఏకంగా ఏనుగుల మందనే తెస్తా వున్నాడు" అని చెప్పినారు. వాడు రాజ్యం దగ్గరికి రాగానే ఏనుగులకి పోయెస్తానని చెప్పి పాలు తీసుకోనొచ్చి రాణి చేతిలో పెట్టినాడు. రాణి అవన్నీ తీసుకోని నెత్తికి పూసుకునిందే గానీ వాళ్ళ నాయనను విడిచిపెట్టలేదు.
"నువ్వు చెప్పినట్లే ఏనుగుపాలు తెచ్చిచ్చినానుగదా! అయినా మా నాయనను ఎందుకు విడిచిపెట్టడం లేదు" అన్నాడు వాడు. 
దానికామె “అమ్మా! అబ్బా!" అని దొంగ మూలుగులు మూలుగుతా “ఈ తలనొప్పి ఏనుగుపాలు పట్టిచ్చినా కొంచంగూడా తగ్గనే తగ్గడంలేదు. అదే గనుక పులిపాలు పట్టిస్తే ఇట్ల పట్టియ్యడం ఆలస్యం అట్ల తగ్గిపోతాదంట. కాబట్టి నీవు పోయి పులిపాలు తీసుకోనొస్తే మీ నాయనను విడిచి పెడతా. లేదంటే లేదు" అనింది.
పులిపాలంటే మాటలు కాదుగదా! అయినా వాడు సరేనని అడవికి పోయినాడు. అట్లా అడవిలో పోతా పోతా వుంటే ఒకచోట పులి గాండ్రింపు వినబడింది. వీడు అదిరిపడి ఎందుకయినా మంచిదనుకోని ఒక చెట్టు ఎక్కి కూచున్నాడు. కాసేపటికి ఒక ఆడపులి మూడుకాళ్ళ మీద కుంటుకుంటా నెమ్మదిగా ఆడికొచ్చి, మనిషి వాసన గుర్తుపట్టి పైకి చూసింది. చూస్తే చెట్టుపైన వీడు దాచిపెట్టుకోని కనబన్నాడు.
అప్పుడా పులి వానితో "నా కాల్లో ముల్లు గుచ్చుకోని నెలనాళ్ళ నుండి అడుగు తీసి అడుగేయలేకపోతా వున్నా. కొంచం ముల్లు తీసి పుణ్యం కట్టుకో, నీకే సాయం కావాలన్నా చేస్తాను" అనింది. సరేనని వాడు కిందకి దిగొచ్చి జాగ్రత్తగా దాని కాలు ఒళ్ళో పెట్టుకోని ఆ మాటా ఈ మాటా మాట్లాడతా నొప్పి తెలీకుండా ముల్లును ఒక్కసారిగా పెరికి పారేసినాడు.
దాంతో ఆ పులి సంబరంగా "చెప్పు... నీకేం సాయం కావాల" అని అడిగింది. వాడు జరిగినేదంతా చెప్పి “కాస్త నీ పాలిస్తే తీసుకోని పోయి మా నాయనను ఇడిపిచ్చుకుంటా" అన్నాడు.
“దానిదేముంది! ఎన్ని కావాలంటే అన్ని తీసుకో" అంటా ఒక చెంబెడు పాలిచ్చి "దా! నిన్ను తీస్కోని పోయి మీ రాజ్యం కాడ దింపొస్తా" అని చెప్పి వాడు వద్దు వద్దంటున్నా వినకుండా... స్నేహితులు, పిల్లలు వెంట నడుస్తా వుంటే... వాన్ని మీద కూచోబెట్టుకోని బైలుదేరింది.
పులులన్నీ ఇట్లా గుంపులు గుంపులుగా వస్తా వుంటే దూరం నుండే చూసిన సైనికులు పరుగు పరుగున రాణి దగ్గరకు పోయి "మహారాణీ! మహారాణీ! వాడు సామాన్యుడు గాదు. పులిపాలు తెమ్మంటే ఏకంగా పులుల మందనే తెస్తా వున్నాడు" అని చెప్పినారు. వాడు రాజ్యం దగ్గరకి రాగానే పులులకు పోయెస్తానని చెప్పి పాలు తీసుకోనొచ్చి రాణి చేతిలో పెట్టినాడు. రాణి అవన్నీ తీసుకోని నెత్తికి పూసుకునిందే గానీ వాళ్ళ నాయనను మాత్రం విడిచి పెట్టలేదు.
“నువ్వు చెప్పినట్లే పులిపాలు తెచ్చిచ్చినానుగదా, అయినా మా నాయనను ఎందుకు విడిచి పెట్టడం లేదు" అన్నాడు వాడు. దానికామె "అమ్మా! అబ్బా!" అని దొంగ మూలుగులు మూలుగుతా “ఎట్లాగబ్బా దీన్ని చంపడం" అనాలోచించి వాళ్ళ అన్న గుర్తుకొచ్చి "నాయనా! ఈడికి ఆరువందల మైళ్ళ దూరంలో అవంతీ నగరముంది. దానికి రాజు మా అన్ననే. ఆయన దగ్గర ఈ నొప్పి తగ్గడానికి మాంచి మందుంది. నిన్ను గుర్తుపట్టడానికి ఒక చీటీ రాసిస్తా. దాన్ని తీస్కోని పోయి మా అన్నకియ్యి. నువ్వు మా అన్న ఇచ్చిన మందును తీసుకరావడం ఆలస్యం మీ నాయన మీ ఇంట్లో వుంటాడు" అనింది.
"సరే" అని వాడు ఆమె ఇచ్చిన చీటీ తీసుకోని పోతా ఒకసారి వాళ్ళమ్మను చూసిపోదామని ఇంటికి వచ్చినాడు. వాడు స్నానం చేస్తా వుంటే వాళ్ళమ్మ వాని బట్టలుతుకుదామని దాండ్లను తీస్తా వుంటే జేబులోంచి జారి చీటీ కింద పడింది. "ఏముందబ్బా దీంట్లో" అని తెరచి చూస్తే ఇంగేముంది "వీడు నా సవతి కొడుకు. విషాన్ని పెట్టి చంపు" అని వుంది. "ఓహో! అదా సంగతి! ఇందుకా ఈమె వీన్నిట్లా బాధపెడ్తా వుంది" అనుకోని మరొక చీటీలో "వీడు నా కొడుకు. ఎందుకు ఏమిటి అని అడగకుండా వీనికి నీ కూతురినిచ్చి వెంటనే పెండ్లి చేయి" అని రాసి గమ్మున జేబులో పెట్టేసింది.
వీడు స్నానం చేసి, అమ్మ పెట్టిన అన్నం తిని బైలుదేరినాడు. అట్లా ఒకొక్క వూరే దాటుకుంటా, దాటుకుంటా ఏడు రాత్రులూ, ఏడు పగల్లు ప్రయాణించి ఆఖరికి అవంతీ నగరం చేరుకోని పోయి రాజుకు ఆ చీటీ ఇచ్చినాడు.
వాడు అచ్చం రాజు లెక్కనే వుంటాడు గదా! దాంతో “వీడు నా చెల్లెలి కొడుకా, ఎంతందంగున్నాడు! అచ్చం మా బావ లెక్కనే" అని మురిసిపోయి “దా... బాబూ...దా!" అంటా తీస్కోని పోయి రాచమర్యాదలు చేసి పూరు వూరంతా చూస్తుండగా తన ఒక్కగానొక్క కూతురినిచ్చి బ్రహ్మండంగా పెండ్లి చేసినాడు. ఆయనకు ఆ ఒక్క ఆడపిల్ల తప్ప మొగపిల్లల్లేరు. దాంతో వాన్నే ఆ రాజ్యానికి రాజుని చేసినాడు.
ఈడ ఇట్లా జరుగుతా వుంటే ఆడ తోటమాలి పెండ్లాం రాజు దగ్గరికి పోయి పిల్లోన్ని మామిడిచెట్టు తనకియ్యడం దగ్గర నుండి రాడి వాన్ని చంపమని వుత్తరం రాసి పెట్టడం దాకా జరిగింది జరిగినట్టు వివరించి ఆ ఉత్తరం ముక్క చేతిలో పెట్టింది. దాంతో రాజు కన్న తల్లిదండ్రులు మేమయిన కడుపులో దాచి పెట్టుకొని పెంచిన తల్లిదండ్రులు మీరు. ఇప్పటి నుంచీ మీరూ ఇక్కడే వుండండి" అంటూ రాణిని చెరశాలలో యేసి తోటమాలిని విడిపించినాడు. అందరూ కలిసి అవంతీ నగరానికి పోయి కొడుకునూ కోడలిని చూసి “పచ్చగా పిల్లా పాపలతో హాయిగా నూరేండ్లు బతకమని" ఆనందంగా ఆశీర్వదించినారు.
*********
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం