అన్నవరంలో ఆనందయ్య, ఆనందమ్మ అనే దంపతులు వున్నారు. అతని కొడుకులిద్దరూ డాక్టరు, ఇంజినీర్లు అయ్యారు. విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.
అతని పక్కనే వున్న గణపయ్య, గంగమ్మ దంపతులు ఒక్కగానొక్క కొడుకు శేషాద్రికి ఓ రోజు రిజిష్టరు పోస్టు వచ్చింది. దాన్ని తీసుకుని ఆనందయ్య వద్దకు నడిచాడు గణపయ్య.
ఆ లెటరు తీసిచూసిన ఆనందయ్య ఆశ్చర్యపోయాడు. గణపయ్య కొడుకు శేషాద్రికి మిలిటరీలో సైనికుడిగా చేరాలని ఆ లెటరు సారాంశం. అది చూసిన ఆనందయ్య విషయాన్ని గణపయ్యకు వివరించాడు. ‘‘ చూడు గణపయ్యా.. దేశంలో సులభంగా చేసే ఉద్యోగాలు ఎన్నో వున్నాయి. అవి వెతుక్కోకుండా ఇలా మిలిటరీకి ఎందుకు పంపుతున్నావు? అది ఎంతో సాహసంతో కూడిo ది.. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన ఉద్యోగం.. అది వదిలేసి ఇంకేదైనా ఉద్యోగం చూసుకోమని చెప్పు..’’ అన్నాడు ఆనందయ్య.
గణపయ్యకు అది నచ్చలేదు. కొడుకు శేషాద్రిని మిలిటరీలో సైనికుడిగా చేర్చాడు. కొద్దిరోజులైంది. ఇంటికొచ్చి వెళ్లాడు శేషాద్రి.
ఆనందయ్య కొడుకులు, పిల్లలు ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చి ఆనందంగా గడిపివెళుతున్నారు. కావలసినంత డబ్బు సంపాదిస్తున్నారు . అయినా తనను ఎవరూ గౌరవించలేదని మనసులో బాధ పడుతున్నాడు.
శేషాద్రి ఇంటికొచ్చి రెండేళ్లయింది. ‘‘ఓ సారి ఇంటికొచ్చిపోరా..’’ అని తల్లిదండ్రులు కోరినా రాలేదు. గణపయ్య, గంగమ్మ మదిలో ఆందోళన మొదలైంది. అయినా కొడుకు చేస్తున్న ఉద్యోగం దేశ రక్షణ కోసమే కదా? అని మనసు నెమ్మది చేసుకున్నారు.
ఓ నెల రోజుల తర్వాత కాశ్మీరు బార్డర్‌లో భీకరపోరు మొదలైంది. ‘చాకచక్యంగా విదేశీ ముష్కర మూకలను తరిమికొట్టిన కమాండర్ శేషాద్రి’ అని ప్రచురితమైన వార్తను దినపత్రికలో చూశాడు ఆనందయ్య. గణపయ్య వద్దకు పరుగుపెట్టాడు. ‘‘ గణపయ్యా.. గంగమ్మా..నీ కొడుకు ఎంత మంచి పనిచేశాడో చూడు..’’ అన్నాడు ఆనందయ్య.
అదేమిటో తెలియక అయోమయంగా ముఖం పెట్టారు. అంతలో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. అందరూ అభినందిస్తుంటే గణపయ్య కొడుకు రాలేదన్న బాధను మరిచాడు. దేశ రక్షణ కోసం కొడుకు చేస్తున్న సేవను తలుచుకుని ఆనందించాడు.
‘‘ గణపయ్యా..దేశ రక్షణ కోసం మీ కొడుకు చేస్తున్న సేవలు అమోఘం..!అతడిని ప్రోత్సహించి పంపిన నీకు అభినందనలు..మీ కొడుకు చేసిన పనికి నేనెంతో గర్విస్తున్నాను.. ’’ అని ప్రశంసిస్తుంటే గణపయ్య మనసు ఆనందంతో ఉప్పోగింది.
అదే ఏడాది రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ ఉత్తమ సేవ’ అవార్డు స్వీకరిస్తున్న
గణపయ్య కొడుకును చూసి దేశం గర్విస్తుంటే "" ఇలాంటి ఉద్యోగానికి ఎందుకు పంపుతున్నావ్..?’’ అని అపహాస్యం చేసిన ఆనందయ్య, తన కొడుకుల్ని ఆ ఉద్యోగానికి ఎందుకు పంపలేకపోయానా? " అని లోలోన కుమిలి పోయాడు.
అవార్డు స్వీకరిస్తున్న కొడుకు శేషాద్రిని చూసి అభినందించాడు. దేశ రక్షణ కోసం ఇంకా గొప్పగా పోరాడి మరిన్ని అవార్డులు పొందాలని ఆశీర్వదించాడు. ఆ ఊరి వాళ్లంతా తనకొడుకును ప్రశంసిస్తుంటే శేషాద్రి తల్లిదండ్రులు గణపయ్య, గంగమ్మ మనసు ఆనందంతో ఉప్పొగింది.
దేశ రక్షణ కోసం..!;- - బోగా పురుషోత్తం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి