పంచ తంత్రం కధలు; - సి.హెచ్.ప్రతాప్
పంచతంత్రం ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది అన్నది సాహిత్యకారుల నిశ్చితాభిప్రాయం  క్రీ. శ. 5వ శతాబ్దం లో విష్ణుశర్మ అనే గురువు  సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద విద్య నేర్చుకోదలచిన విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా రూపొందించిన ఈ గ్రంధం లో ఐదు భాగాలుగా విభజింపబడి  అనేక చిన్నచిన్న కథ ల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.ఈ పుస్తకాన్ని ఊహ తెలిసినప్పటి నుండి పిల్లలకు బోధించాలని మనోశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నేటి సమాజంలో పెచ్చు పెరుగుతున్న హింస, అనైతికత, అత్యాచారాలు, అవినీతి, మానవ సంబంధాలు క్షీణింపబడడం ఇత్యాది సమస్యలకు ఇటువంటి నీతి కధలను బాల్యం నుండే చిన్నారులకు బోధించాలి. ఇటువంటి నీతి కధలు వారి మనసులలో నాటుకొని తద్వారా నీతివంతమైన బాటలో వారు భవిష్యత్తులో నడిచేందుకు దోహదపడుతుంది. పంచతంత్రం 5 విభాగాల, 69 కథల సంపుటి. కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సమాజం గురించి, వ్యవస్థ, మానవ ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం.
పంచతంత్ర ఐదు వ్యూహాలు:
- స్నేహితుల మధ్య తగాదా (మిత్ర-బేధం)
- స్నేహితులను పొందడం (మిత్రలాభం)
- కాకులు మరియు గుడ్లగూబలు
- లాభాలు (సంపదలు) కోల్పోవడం
- అవివేకం (మతిలేని, బుద్ధిహీనంగా చర్య తీసుకోవడం) 

కామెంట్‌లు