అమ్మ+అమ్మ;- కొప్పరపు తాయారు
అమ్మ అమ్మలగన్నయమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ
ఈ అమ్మమ్మ అమ్మకే అమ్మ

ఎంతో అదృష్టం అమ్మమ్మ 
ఉండడం, అమ్మని పెంచిన 
తెలివిని పెంచుకున్న అమ్మ 
అమ్మనే కాచిన. చల్లని తల్లి

అపురూపవల్లి అమ్మ బిడ్డకి
పంచదా మమకారాల
పరమాన్నం మది మెచ్చగ
సంతరించుకున్న రెండు 

అమ్మల బలం నిరంతరం
తన కన్నులలోని పాపలకై
సర్వమర్పించదా, ప్రేమ వర్షిణి
బిడ్డ కన్న బిడ్డ, అసలు కన్నా

వడ్డీ ముద్దులా అపురూపం
అందుకే అమ్మమ్మలు
తన బిడ్డలకి వదులుకున్న
ముచ్చట్లు తన మనుమలలో

పొందు ఆస్వాదించు
అనుభవించు ఆనందించు
ఏమి తక్కువ. అనుభవాల
ఓషధి ప్రేమలకు పెన్నిధి

అందరి బాగు తానై తన కోసం 
ఉన్న బలాన్ని పూచిక పుల్లగా నెంచి
అర్పించు గుణవతి అమ్మకి అమ్మ
మనుమల భవిష్యత్తుకి
బంగారు బాట ప్రేమల పెన్నిధి !!

కామెంట్‌లు