సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -361
హస్తామలక న్యాయము
******
 హస్త అంటే చేయి, తొండము,మూర,వ్రాత,చేవ్రాలు,సహాయము అనే అర్థాలు ఉన్నాయి. ఆమలకము అంటే ఉసిరిక చెట్టు,ఉసిరి కాయ.
అర చేతిలోని ఉసిరి కాయ చాలా తేలికగా యిమిడి పోతుంది.చూడటానికి స్పష్టంగా ఉన్నదని,కనిపిస్తుందని అర్థము.
 'కరతలామలకము' అని తెలుగులో జాతీయంగా పిలువబడుతోంది.
అరచేతిలో ఉసిరి కాయకు ఎన్ని గీతలు ఉన్నాయో , దాని విశేషాలను చక్కగా, తేలికగా చెప్పగలము.
అంటే  ఏదైనా విషయం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఆయనకది హస్తామలకము/ (కరతలామలకం) సంపూర్ణంగా తెలుసు,అతనికది  చాలా తేలిక అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇలా హస్తామలకము లేదా కరతలామలకము ఒక విషయము యొక్క స్పష్టత, సులభ గ్రాహ్యత గురించి చెబుతుందన్న మాట.
 ఉసిరి కాయ యొక్క ప్రత్యేకత ఏమిటంటే చూడటానికిది నిమ్మకాయ వలెనే వుంటుంది.నిమ్మకాయ లోపలి గింజల విషయం ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఎంత పట్టి  చూసినా తెలియదు.కానీ ఉసిరికాయలోని గింజ/ విత్తనం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 
 మరెలాగో పనిలో పనిగా ఉసిరికాయ యొక్క ఉపయోగాలు, ఔషధంగా దాని ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం.
హిందువులు ఉసిరిచెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు.కార్తీకమాసంలో జరిగే వనమహోత్సవాలలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శ్రేష్ఠమని నమ్మిక.
భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత వుంది.  ప్రతి ఇంటిలో ఉసిరి చెట్టు ఉన్నట్లయితే ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలున్నా పోతాయని వాస్తుశాస్త్రంతో పాటు జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతోంది.
 ఉసిరి కాయలలో  విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో చ్యవన ప్రాస దీనితోనే తయారు చేస్తారు. ఉసిరిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే  సంపూర్ణమైన శక్తిని ప్రసాదిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పెద్దలు చెబుతుంటారు.
నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సూతమునితో 'కరతలామలకము' అనే పదబంధాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.
"అయ్యా! నీవు పురాణాలలో ప్రతిపాదితమైన విషయాలన్నీ తెలిసిన వాడివి. శుక బ్రహ్మ చేత ప్రవచితమైన భాగవతం మీకు కరతలామలకం " అని శౌనకాది మహర్షులు  సూతమునితో అంటారు.
 ఈ విధంగా ఆమలకము సంపూర్ణ శక్తిని ఇచ్చే కాయగానే కాకుండా పూర్తిగా పట్టుబడిన మరియు పిలిస్తే పలికే విద్యగా వ్యక్తికి విజ్ఞానం,మేధస్సు కలిగి వుండటాన్ని ఈ హస్తామలకము లేదా కరతలామలకము సూచిస్తుందన్న మాట.
 ఇదండీ! హస్తామలకము/ కరతలామలకం యొక్క అసలైన అర్థము.
 మనం కూడా  వివిధ విజ్ఞాన సంబంధమైన విషయాలను "హస్తామలకము" అయ్యే విధంగా నేర్చుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు