సుప్రభాత కవిత ;- బృంద
స్వేచ్ఛ  లేని మనసుకు
ఇచ్ఛ తీరేలా  వరమిచ్చి
స్వఛ్చమైన బ్రతుకు
ముచ్చటగా సాగాలని ప్రార్థన

నడిసంద్రాన నిలిచి
ఎటు వెళ్ళాలో తెలియని
సుడి చుట్టే సమస్యల
తుదముట్టించమని మనవి

తీరానికి దూరమై
ఆగమ్యగోచరంగా
అలజడుల పాలై వగచే
అంతరంగాలకు ఆశనిమ్మని వినతి

ఎటివాలున సాగే
నావ తీరున ఉన్న 
జీవితాలకు చక్కని
ఒడ్డుచూపమని  కోరిక

కారణమే తెలియని
కలతల క్రోధాలకు బలై
కమ్ముకున్న చీకట్లతో పోరాడే
మనసులకు ఊతమివ్వమని 
ఆకాంక్ష

అందమైన మనసిచ్చీ
అణకువ గల నడతనిచ్చి
అంతులేని కష్టాల కడలి
పాలై కుంగే మదికి ఊతమివ్వమనే
విన్నపాలు

చిన్ని మనసుల నిండిన
పెను చీకటి తెరలను
వెనువెంటనే తొలగించే
కనువెలుగై రమ్మని 

దోసిట ఆశల అంజలితో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు