సామాజిక చైతన్యానికి సాంఘిక శాస్త్రమే నాంది

 సాంఘిక శాస్త్రం అనేది సామాజిక చైతన్యానికి దర్పణం వంటిదని పాలకొండ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి అన్నారు. వీరఘట్టం, పాలకొండ మండలాలకు చెందిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులతో తలవరం ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర విషయ పాఠశాల సముదాయం ఛైర్మన్ ఉప్పాడ అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. 
ఒకరోజు సమావేశంలో పాల్గొన్న సాంఘిక శాస్త్రోపాధ్యాయులను ఉద్దేశించి పర్రి కృష్ణమూర్తి మాట్లాడుతూ అంతర్జాలం ద్వారా పరీక్ష పే చర్చ జాతీయ విధాన సమీక్ష అంశాలను తమ తమ చరవాణి ద్వారా ఉపాధ్యాయులంతా పఠించి అవగాహన పొంది నివేదించాలని అన్నారు. విద్యార్థులచే కూడా వారి చరవాణి ద్వారా పఠించేలా కృషి చేయాలని అన్నారు. ప్రతీ తరగతిలో గల పిల్లల స్థాయిని ఉపాధ్యాయులంతా ఎవరికి వారు నమోదు చేసుకోవాలని, పాఠశాల పనివేళల అనంతరం ప్రోత్సాహం అవసరమైన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునివ్వాలని అన్నారు. 
పదోతరగతి విద్యార్థులంతా శతశాతం ఉత్తీర్ణత సాధించేలా, ప్రతీ విద్యార్థికి ఎనభై శాతం పైబడి మార్కులు సాధించేలా కృషి చేయాలని అన్నారు. 
తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సముదాయం ఛైర్మన్ ఉప్పాడ అప్పారావు మాట్లాడుతూ పటనైపుణ్యం, బోధనాభ్యసనా సామగ్రి, మైండ్ మేప్, విద్యార్థుల పూర్వజ్ఞానం గుర్తెరిగి బోధన చేపట్టిన నాడు అవగాహనతో కూడిన అభ్యసనం సాధ్యమని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లుగా బౌరోతు మల్లేశ్వరరావు, వూలక రవి, మాచర్ల రఘునాథదొర, పోతురాజు శంకరరావు, పర్రి రామమూర్తిలు వ్యవహరించారు. 
కుదమ తిరుమలరావు ప్రత్యేక గీతాలను ఆలపించారు. 
సాంఘిక శాస్త్ర బోధనలో కీలక అంశాలను గొడబ విజయభాస్కర్, జె.జయమణి, డి.పద్మావతి, పి.హేమలత, ఆర్.గౌరీశంకరరావు, ఎం.స్వర్ణలత, కుదమ తిరుమలరావు, ఎస్.నానబాబు, . నాగేశ్వరరావు తదితరులు వివరించారు.
గ్రంథాలయ పుస్తకాలను వినియోగించే అంశాలను వై.రమణమ్మ, డి.టి.వి.రత్నం చేపట్టారు. తలవరం పాఠశాల విద్యార్థిణులు గొర్లె కరిష్మ, 
దుబ్బాడ కల్యాణి, సీమల లాస్విక, టి.ధాన్యలక్ష్మి లచే చదివించారు. దేశభక్తుల చరిత్రను అనేక గ్రంథాలయ పుస్తకాల ద్వారా అభ్యసించుట ఎలా సాధ్యమైందో వివరించారు. పుస్తక సమీక్ష గూర్చి కె.తిరుమలరావు వివరించారు.
కామెంట్‌లు