నా కలం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలం
నా హలం
సాహిత్యలోకాన్ని దున్నేస్తా
కవితాపంటలను పండిస్తా

కలం
నా బలం
అందాలకవితలు ఆవిష్కరిస్తా
ఆనందాలను అందరికందిస్తా

కలం
నా అస్త్రం
దుర్మార్గులపై ప్రయోగిస్తా
సన్మార్గంలో నడిపించేస్తా

కలం
నా కరవాలం
అవినీతిపరులపై ఝల్లుమనిపిస్తా
నిజాయితీపరులకు పట్టంకట్టిస్తా

కలం
నా చైతన్యం
పాఠకులను జాగృతంచేస్తా
కవితాజగమును ఉఱ్ఱూతలూగిస్తా

కలం
నా దీపం
అఙ్ఞానంధకారాన్ని తరిమేస్తా
తల్లితెలుగును వెలిగించుతా

కలం
నా కుంచె
చక్కని కవితాచిత్రాలుగీస్తా
చిక్కని భావాలనుతెలుపుతా

కలం
నా ఉలి
అద్భుతకైతాశిల్పాలను చెక్కుతా
అందరిమదులను ఆకట్టుకుంటా

కలం
నా సాధనం
కోరుకున్నవి కూర్చుకుంటా
కుతూహలాన్ని కలిగించుతా

కలం
నా మానసం
ఆలోచనలనలకు రూపమిస్తా
భావాలను బయటపెడతా

కలం
నా హృదయం
ప్రేమజల్లులు కురిపిస్తా
అంతరంగాలను మురిపిస్తా

కలం
నా స్వరం
కమ్మనైనపాటలు వ్రాస్తా
శ్రావ్యమైనరాగాలు వినిపిస్తా 

కలం
నా ప్రాణం
ఎప్పుడూ ప్రక్కనుంచుకుంటా
అనునిత్యమూ కాపాడుకుంటా

కలం
నా జీవితం
కయితలు వ్రాస్తుంటా
మదులను దోస్తుంటా

నా కలం
చక్కనిది
నా కవిత
చిక్కనిది

నా కలమును
చూడండి
నా కవితను
చదవండి

నా కలముగళమును 
వినండి
నా కవితామర్మమును
ఎరగండి


కామెంట్‌లు